WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోట్లు ఉంటేనే పోటీకి అర్హత...!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులు  మరే రాష్ట్రంలో లేవని, సామాన్యులు కానీ..మధ్య తరగతులు వారు కానీ..ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేనట్లుగా ఆయా పార్టీల నాయకులు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కుటుంబాల చరిత్ర, విద్యార్హతలను బట్టి టిడిపి అభ్యర్థులను ఎంపిక చేసింది. అదే విధంగా లోక్‌సభ సభ్యులను కూడా గెలిపించి పార్లమెంట్‌కు పంపింది. రాజ్యసభకు కూడా మధ్య తరగతికి చెందిన మేధావులు, ఇతర ముఖ్యులను ఎంపిక చేసిన ఘనత ఆ పార్టీకి దక్కింది. ఆ విధమైన ఘన చరిత్ర ఉన్న టిడిపి తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.50కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్నవారే పోటీ పడే పరిస్థితులు ఉన్నాయి. రాజ్యసభకు ఎంపిక చేసిన వారందరూ వందలకోట్లుకు అధిపతులే. సామాన్య మధ్య తరగతి నుంచి రాజకీయంగా ఎదిగిన వారిలో అతి కొద్ది మంది మాత్రమే కోటీశ్వర్వులు అయ్యారు. సంపాదించుకోవడం చేతకాని వారు..రాజకీయంగా తెరమరుగయ్యారు. త్వరలో జరగనున్న లోక్‌సభ సభ్యుడుగా పోటీ చేయాలంటే రూ.100 నుంచి రూ.200 కోట్లు...ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్లు నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారై ఉండాలి. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా...అభివృద్ధి చేసినా..ఎన్నికల్లో ఓట్లు వేసే పరిస్థితులు లేవని 2009,2014 ఎన్నికలు రుజువు చేశాయి. చివరకు దళిత వర్గానికి చెందిన మంత్రులు, మాజీ మంత్రులు కూడా తాము రూ.20కోట్లు ఖర్చు పెడతాం..ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వండి..అనే స్థాయికి ఎదిగిన మాట యధార్థమే. ఇందులో టిడిపి అధినేత చంద్రబాబే కాదు..వైకాపా నేత 'జగన్‌' కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. 

  తనకు పార్టీలో పనిచేసేవారు అవసరం లేదని..సొమ్ములు ఖర్చు చేసేవారికి కావాలని అధినేతలు చెబుతున్నారు. పార్టీ పట్ల విధేయత ఉన్నా..టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై కొందరు ప్రశ్నించి నిలదీస్తున్నా..ఆ పప్పులేమీ ఉడకవు. టిడిపి అభ్యర్థులు రూ.100 కోట్లు ఖర్చు చేస్తారు..మీరు కనీసం రూ.50కోట్లు అయినా ఖర్చు చేయగలరా..అని 'జగన్‌' తన వద్దకు వచ్చిన వారిన అడుగుతున్నారట. దీనికి నిదర్శనమే గుంటూరు జిల్లా చిలకలూరిపేట అభ్యర్థి ఎంపిక అని వారు చెబుతున్నారు. ఇప్పటికే టిడిపిలో కనీసం వంద మందిపైగా రూ.20, రూ.50, రూ.100, రూ.200కోట్లు ఖర్చుపెట్టగలిగిన స్థోమత ఉన్న నాయకులున్నారని అటువంటి వారినే పార్టీనేత చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు మధ్యతరగతికి చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఏ విధంగా పుట్టింది..ఏ విధంగా పెరిగింది..అనేది గాలికి వదిలేసి..సామాన్య, మధ్యతరగతి వారిని పట్టించుకోకుండా కోటీశ్వరులనే ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉంది. చివరకు రాజ్యసభకు ఎంపిక చేసిన వారినే తీసుకుంటే..వారంతా కోటీశ్వర్లులే. వారిలో బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగా టిడిపి అభ్యర్థిని  ఎదుర్కోవాలంటే వారి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేవారు కావాలని 'జగన్‌' కోరుకుంటున్నారట. అదే విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నార..చేయబోతున్నారు. 

  ఈ రెండు పార్టీలతో పోటీ పడాలంటే...ఎంపిక చేసే అభ్యర్థులు కూడా కోటీశ్వేరుడు అయి ఉండాలని..'జనసేన' అధినేత 'పవన్‌' కూడా వచ్చినట్లు తెలిసింది. గతంలో మా పూర్వీకుల వివరాలు తెలుసుకుని పార్టీ టిక్కెట్‌ ఇచ్చారని, ఇప్పుడు పార్టీ టిక్కెట్‌ అంటే ఎన్నికోట్లు ఖర్చుపెడతావు..అని బాహాటంగా అడిగే పరిస్థితి వచ్చిందని పలువురు వాపోతున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టేవారు నిజాయితీగా ఉంటారా..? ప్రజాసేవ చేద్దామనుకునే వారి వద్ద కోట్లు సొమ్ములు ఉంటాయా..?ఓటుకు నోటు తీసుకునే వారు..నోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేవారు..ప్రజాస్వామ్యం గురించి, నీతి నిజాయితీ గురించి మట్లాడడం విడ్డూరంగా ఉందని సీనియర్‌ మంత్రి ఒకరు మీడియా వర్గాల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ..ఈ పరిస్థితికి ఎవరెవరు కారణమో..మీకు కూడా తెలుసుకదా..అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు లక్ష, రెండు లక్షలు తీసుకుని ఓట్లు వేశారు. ఈ విధమైన పరిస్థితులు దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉందని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదని,ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి పాకుతుందని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విధమైన పరిస్థితి చంద్రబాబు, వైఎస్‌లతోపాటు...తాజాగా 'జగన్‌, పవన్‌'లు కూడా కారణమవుతున్నారని...పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కోటీశ్వరులకే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అర్హత ఉంది..అని పలురాజకీయ పార్టీలు పరోక్షంగా చెబుతున్నాయి. ఈ వ్యవస్థను మార్చే నాధుడు ఎవరూ లేరని కొందరు మధ్యతరగతి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(293)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ