WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పుడు 'బాబు' కాంగ్రెస్‌ వ్యతిరేకి....?..ఇప్పుడు...?

తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు బయోపిక్‌లదే హవా...! ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన 'మహానటి' తరహాలోనే త్వరలో ఇద్దరు ప్రముఖ రాజకీయనాయకులకు సంబంధించిన బయోపిక్‌లు రాబోతున్నాయి. వాటిలో ఒకటి తెలుగువారితో 'అన్నా' అని పిలిపించుకున్న మహానటుడు, స్వర్గీయ ముఖ్యమంత్రి 'నందమూరి తారకరామారావు'ది కాగా..మరోటి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితాల ఆధారంగా నిర్మించే సినిమాలు. వీటిలో 'అన్న'పై నిర్మించే చిత్రం 'యన్‌టిఆర్‌'. ఈ చిత్రాన్ని 'ఎన్‌టిఆర్‌' తనయుడు 'నందమూరి బాలకృష్ణ' నిర్మిస్తూ నటిస్తున్నారు. 'యన్‌టిఆర్‌'గా ఆయనే నటిస్తుండగా...ఇతర పాత్రలను పలువురు ప్రముఖులు పోషిస్తున్నారు. వినాయక చవితి నాడు...ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ ఒకటి రిలీజ్‌ చేశారు. దీనిలో ఎన్టీఆర్‌ తన అల్లుడైన 'చంద్రబాబు' భుజంపై చేయి వేసి..అప్యాయంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఈ చిత్రానికి సోషల్‌మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. కాగా...1984లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిని చేసిన సందర్భంలోనిది ఈ షాట్‌ అని సినిమాకు చెందిన వారు చెబుతున్నారు. అప్పట్లో...ఎన్టీఆర్‌ను 'నాదెండ్ల భాస్కర్‌రావు' కాంగ్రెస్‌ సహకారంతో...సిఎం పదవి నుంచి దించి వేశారు. దీంతో ప్రజానీకం తిరగబడి..మళ్లీ 'ఎన్టీఆర్‌'ను ముఖ్యమంత్రి చేసింది. ప్రజాస్వామ్యపునరుద్దరణ సమయంలో ఎన్టీఆర్‌కు అల్లుడైన 'చంద్రబాబు' విశేషంగా కృషి చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆయన వేసిన ఎత్తులు, వ్యూహాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎన్టీఆర్‌ను మళ్లీ సిఎం సీటులో కూర్చోబెట్టడానికి 'చంద్రబాబు' కాంగ్రెస్‌ పెద్దలను ఎదిరించి వారి వ్యూహాలను చిన్నాభిన్నం చేసి ఎన్టీఆర్‌ ప్రేమకు ప్రీతిపాత్రుడయ్యారు. ఇదంతా అప్పటి సంగతి.

  ఇప్పుడు 'యన్‌టిఆర్‌' సినిమాలో ఆయన రైతు దగ్గర నుంచి సిఎం అయ్యే వరకు చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దాన్ని కొంత మంది కొట్టిపారేస్తూ..'నాదెండ్ల' వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపేయడం, తరువాత ప్రజాఉద్యమంతో మళ్లీ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి సీటులో కూర్చునే వరకు కథ ఉంటుందని..ఆయన మళ్లీ పదవీ ప్రమాణం చేయడంతో..సినిమా ముగుస్తుందని చెబుతున్నారు. ఈ మొత్తం 'వెన్నుపోటు' వ్యవహారంలో కాంగ్రెస్‌ పెద్దలదే ప్రథమ హస్తం. నాటి పరిస్థితుల్లో టిడిపి నేతలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పోరాడారు. కానీ..ఈ సినిమా రిలీజ్‌ అయ్యేనాటికి..ఆంధ్రాలో కాకపోయినా..తెలంగాణలో అయినా..టిడిపి,కాంగ్రెస్‌ కలసి పోటీ చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన 'చంద్రబాబు' నేడు...కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తుండడమే వైచిత్రి. రాజకీయాల్లో ఆగర్భ శత్రువులు ఎవరూ ఉండరనేది ఒప్పుకుంటూనే...కీలకమైన తరుణంలో..ఆ పార్టీకి వ్యతిరేకంగా 'చంద్రబాబు' పోరాడినట్లు సినిమాల్లో చూపిస్తూ..మరో వైపు..ఆ పార్టీతో రాసుకుపూసుకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం..అంతా రాజకీయ మహిమ.

(1088)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ