WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చిత్ర,విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న 'చంద్రబాబు'...!

రిటైర్డ్‌ అయిన ఐఎఎస్‌ అధికారుల సేవలను మళ్లీ వినియోగించుకునేందుకు వారికి ఉన్న సమర్థతను అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గత పాలకులు...ఏ అధికారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకుని అమలు చేసేవారు. ఇదే దారిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'రామాంజనేయులు' ఆయన అనుభవాన్ని, సమర్థతను గుర్తించి రిటైర్‌ అయిన తరువాత మూడు మాసాలు సర్వీసు పొడిగించి నీటిసరఫరాశాఖాధిపతిగా నియమించిన విషయం విదితమే. కానీ...ఇంతలో ఎవరెవరు..? ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో..తలనొప్పి తెప్పించారో కానీ...'రామాంజనేయులు'ను జిఎడి పరిధిలోని సమాచారశాఖ కార్యదర్శిగా నియమిస్తూ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. 'రామాంజనేయులు' గతంలో ఏయే శాఖల్లో..పనిచేశారో..ఆ శాఖల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలి కానీ...అందుకు విరుద్ధంగా ఆయన ఎప్పుడూ పనిచేయని, ఆసక్తి లేని 'సమాచారశాఖ'లో ఆయన సేవలను వినియోగించుకోవడం ఏమిటనే దానిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి చిత్ర,విచిత్రమైన నిర్ణయాలు గత పాలకులు ఎవరూ తీసుకోలేదని, అపార అధికార, రాజకీయ  అనుభవం ఉన్న ముఖ్యమంత్రి 'చంద్రబాబు' 'రామాంజనేయులు'ను ఆ పోస్టులో ఎందుకు నియమించారో అర్థం కావడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

  పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా మూడేళ్లు బాధ్యతలు నిర్వహించిన 'రామాంజనేయులు' రాష్ట్రంలో మారు మూల గ్రామాల్లోనూ సిసీ రోడ్లు నిర్మాణాలు చేసేందుకు కృషి చేశారు. అనేక సందర్బాల్లో 'రామాంజనేయులు' కృషిని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. సచివాలయంలో శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తూ సర్వీసు నుంచి రిటైర్‌ కావాలన్న 'రామాంజనేయులు' కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చి ఆయన సర్వీసును మరో మూడు నెలలుపొడిగించారు. ఇంతలో ఎవరెవరు..? ఎవరిపై ఒత్తిడి తెచ్చారో..కానీ..ఆయనను గతంలో పనిచేస్తున్న శాఖ నుంచి తప్పించి..సమాచారశాఖ కార్యదర్శిగా నియమించారు. దీనంతటికి తెర వెనక సూత్రధారి,సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి, పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి 'జవహర్‌రెడ్డే' కారణమనేది అధికార వర్గాల అభిప్రాయం. గత ఐదేళ్లు నుండి అదే శాఖాధిపతిగా పనిచేస్తోన్న 'జవహర్‌రెడ్డి' అంటే ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌కు అత్యంత అభిమానం, గౌరవమట. ఆయన 'లోకేష్‌'పై ఏం వత్తిడి తెచ్చారో..ఏమో కానీ...'రామాంజనేయులు'ను నీటిసరఫరాశాఖాధిపతిగా బాధ్యతల నుండి తప్పించే వరకు నిద్ర పోలేదు. 

  ఇప్పటికే సమాచారశాఖ కార్యదర్శిగా పనిచేస్తోన్న 'వెంకటేశ్వర్‌' కష్టపడుతూ, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమానాన్ని పొందారు. వాస్తవానికి ఐఐఎస్‌ సర్వీసుకు చెందిన 'వెంకటేశ్వర్‌' రెండేళ్లపాటు ఇక్కడ పనిచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించుకున్నారు. అయితే రెండేళ్ల సర్వీసు ముగియడంతో..ఆయన మరో రెండేళ్లు ఇక్కడ కొనసాగేందుకు కేంద్రం నుంచి ఇటీవలే అనుమతి తెప్పించుకున్నారు. 'వెంకటేశ్వర్‌' కష్టపడే విధానాన్ని, సమర్థతను, విధేయతను చూసే ముఖ్యమంత్రి ఆయన సర్వీసును ఇక్కడ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చి ప్రోత్సహించారు. 'వెంకటేశ్వర్‌'ను  ఏదో రకంగా అవమానించాలనే ధ్యేయంతో కొందరు సీనియర్‌ అధికారులు చెప్పిన మాట విని చిత్ర,విచిత్రమైన ఈ నియామకానికి ముఖ్యమంత్రి తెరతీశారని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.   'రామాంజనేయులు' సేవలను వినియోగించు కోవాలంటే..పంచాయితీరాజ్‌శాఖలో ఏదైనా కీలక విభాగంలో బాధ్యతలు అప్పచెప్పాలి. ఆ విధంగా కాకుండా..సమాచారశాఖలో నియమించి పలు విమర్శలను కొని తెచ్చుకున్నారు. ఏది ఏమైనా ఒక అధికారిని అవమానించే విధంగా మరో అధికారిని తెచ్చి..అదే పోస్టులో కూర్చోబెట్టిన వైనం గత పాలకులు ఎవరూ చేయలేదు. ఏది ఏమైనా ఇటువంటి ఖ్యాతి అపారమైన రాజకీయ, అధికార అనుభవం ఉన్న చంద్రబాబుకే దక్కిందని చెప్పవచ్చు.  

(563)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ