WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా'లో అధికారం 'జగన్‌'దేనట...!

ఇండియాటుడే సర్వేలో తేలిన నిజం...!

'జగన్మోహన్‌రెడ్డి' అభిమానులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా అధికారంలోకి వస్తుందని..ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ఇండియాటుడే' ప్రకటించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతిపక్ష వైకాపా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే...ఆ పార్టీకి 43శాతం ఓట్లు వస్తాయట. అదే సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 38 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనపై 36శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా...33శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సర్వే తేల్చింది. మొత్తం 10,650 మందిని ఫోన్‌ ద్వారా చేసిన సర్వేలో ఈ విషయం తేలిందని 'ఇండియాటుడే' ప్రకటించింది. కాగా...ప్రధానిగా నరేంద్రమోడీ కన్నా...రాహుల్‌గాంధీ అయితేనే మంచిదని ఆంధ్రా ప్రజలు తేల్చారట. 44శాతం మంది ప్రజలు 'రాహుల్‌గాంధీ'ని ప్రధానిగా చూడాలని భావిస్తుంటే...38శాతం మంది 'మోడీ'కి మద్దతు ఇస్తున్నారట. వ్యవసాయం కుంటుపడడం, నిరుద్యోగిత, ధరలు పెరగడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారట. వీటి వల్లే..అధికార టిడిపిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సర్వే తేల్చింది.

కాగా 'ఇండియాటుడే' సర్వేపై ప్రతిపక్ష వైకాపా నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా..అదో పనికిమాలిన సర్వే అని తెలుగుదేశం నాయకులు కొట్టిపడేస్తున్నారు. హిందీ బెల్ట్‌కు చెందిన ఆ ఛానెల్‌కు వాస్తవ పరిస్థితులు తెలియవని..వారు వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా కోసం ధర్నా చేస్తుంటే..ఈ ఛానెల్‌ వారు..ఆంధ్రా వారికేమి కావాలని..వారికి హైదరాబాద్‌ ఉంది కదా..ఇంకేమిటి సమస్య..అంటూ ప్రసారాలు చేసింది..ఇది..ఆ ఛానెల్‌కు, పత్రికకు..ఆంధ్రాపై ఉన్న అవగాహన అని కొట్టిపడేస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌షాల ద్వయం వండివార్చిన సర్వే ఇదని..దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే టిడిపి నాయకులు ఏమి చెప్పినా...వైకాపా నాయకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని..గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయామని, ఈసారి మాత్రం అధికారం తమదేనని..ఘంటాపథంగా చెబుతున్నారు.

కొసమెరుపు: ఇండియాటుడే సంస్థ గొప్పగా ప్రకటించిన ఈ సర్వేలో...రాష్ట్రంలో ఒక శక్తిగా ఉన్న 'జనసేన' అధినేత 'పవన్‌కళ్యాణ్‌' గురించి వీసమెత్తు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. 'పవన్‌'తో సంబంధం లేకుండానే..వైకాపా గెలుస్తుందని.. ఈ సర్వే చేసిన వారు అంచనా వేశారా..? ఏమో..!

(892)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ