WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇండియాటుడే సర్వేలో 'విజేత' కెసిఆర్‌...!

ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియాటుడే చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో మరోసారి 'కెసిఆర్‌' విజయదుందుభి మోగిస్తారని తేల్చి చెప్పింది. ఇండియాటుడే యాక్సిస్‌-మై-ఇండియా పోల్‌ పేరిట నిర్వహించిన సర్వేలో తెలంగాణాలో జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని తేలిందట. 'కెసిఆర్‌' తన ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్నారని ఆయనను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఈ సర్వే తేల్చింది. సెప్టెంబర్‌6వ తేదీన అసెంబ్లీ రద్దు చేసిన అనంతరం చేసిన ఈ సర్వేలో 43శాతం మంది మళ్లీ కెసిఆర్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారట. 18శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుండగా..ఆశ్చర్యకరంగా తెలంగాణ బిజెపి నాయకుడు 'కిషన్‌రెడ్డి' సిఎం కావాలని 15శాతం మంది కోరుకుంటున్నారు. 

  కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్నారని ఆయనకు మరోసారి ఓటు వేస్తామని 48శాతం ప్రజలు తెలిపారు. 26శాతం మంది ఆయన బాగా పనిచేయడం లేదని చెప్పగా, 16శాతం యావరేజ్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. మొత్తం సర్వేలో 7,110 మంది పాల్గన్నారని, వీరందరినీ ఫోన్‌ ద్వారా సర్వే చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. శానిటేషన్‌, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు, ధరలు పెరుగుదల తెలంగాణలో ముఖ్య సమస్యలుగా ఉన్నట్లు ఓటర్లు చెప్పారట. కాగా ప్రధానిగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు 44శాతం మంది 'నరేంద్ర మోడీ' వైపు మొగ్గుచూపారట. 39శాతం మంది 'రాహుల్‌గాంధీ'ని ప్రధానిగా చూడాలని ఉందని చెప్పారు. కాగా సర్వేలో ఎందుకు ప్రజలు టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపుతున్నారనే దానిపై సర్వే సంస్థ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. నాలుగేళ్ల క్రితం తెలంగాణను కెసిఆర్‌ సాధించారని ఆ సెంటిమెంట్‌ ఇంకా కొనసాగుతుందని సంస్థ తెలిపింది. మొత్తం మీద..రాబోయే ముందస్తు ఎన్నికల్లో మరోసారి...కెసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని..ఇండియాటుడే సంస్థ పేర్కొంది.

(339)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ