WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలకు సీట్లు లేవట..?

శరవేగంగా తరముకొస్తున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమదైన రీతిలో సిద్ధం అవుతున్నాయి. అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా, కొత్తగా పోటీలో ఉంటానంటున్న 'జనసేన' పార్టీలు కొన్ని చోట్ల అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో మూడు పార్టీలు తమ వ్యూహాలకు అనుగుణంగా సీట్లు ఇస్తూ పోతున్నాయి. ప్రతిపక్ష వైకాపా ఇప్పటికే పలు జిల్లాల్లో మీరే అభ్యర్థులు ప్రచారం చేసుకోండి...అని చెప్పి వారికి క్లియరెన్స్‌ ఇస్తుండగా..అధికార పార్టీలో మాత్రం ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో 102 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ...ఇప్పుడు గతంలో పోటీ చేసిన వారిలో చాలా మందిని మార్చాలని ఆలోచిస్తోంది. తమ పార్టీ తరుపున గెలిచిన వారే కాకుండా..గత నాలుగేళ్లుగా వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టిడిపిలో చేరిన వారిలో కూడా కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని ఆలోచిస్తోంది. మిగతా చోట్ల ఎలా ఉన్నా..నెల్లూరు జిల్లా రాజకీయాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి గాలి వీచినా..నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ గాలి పెద్దగా వీయలేదు. ఇక్కడ నుంచి ఆ పార్టీ తరుపున ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నాలుగున్నరేళ్ల అధికారం తరువాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లల్లో వీరు ప్రజలకు దూరం అయ్యారని..వీరికి టిక్కెట్‌ ఇవ్వవద్దని స్థానిక నాయకులు, ప్రజలు, కార్యకర్తలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వెంకటగిరి, కోవూరు నుంచి బి.రామారావు, రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం..ఈ ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అధికార పార్టీలో ఉన్నా..వీరు స్వంత పనులు, వ్యాపారాలతో నాలుగున్నరేళ్లు కాలక్షేపం చేసి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వెంకటగిరి ఎమ్మెల్యే బి.రామారావు స్థానికంగా ఉండకుండా...బెంగుళూరులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకుంటూ..నియోజకవర్గాన్ని విస్మరించారనే మాట వినిపిస్తోంది. ఆయన నియోజకవర్గ ఓటర్లకు, కార్యకర్తలకు అందుబాటులో లేరని..ఇటువంటి వారికి టిక్కెట్‌ ఇస్తే ఎలా...అని స్వంత పార్టీ నాయకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'రామారావు' వ్యవహారశైలిపై ఇంటిలిజెన్స్‌, ఇతర వర్గాలు అందించిన సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు మళ్లీ టిక్కెట్‌ ఇవ్వరని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 

  ఇక వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణదీ అదే పరిస్థితి. ఆయనకు కోపం ఎక్కువని...ప్రజలకు కొంత మేర అందుబాటులో ఉన్నా..స్వంత పనులకే ఆయన ప్రాధాన్యత ఇస్తారని..చెబుతున్నారు. దీంతో..ఆయనకు కూడా టిక్కెట్‌ వచ్చే ఛాన్స్‌ లేదు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిది మరో చరిత్ర. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆఖరి నిమిషంలో టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే..ఆయనలో కాంగ్రెస్‌ వాసనలు పోలేదట. టిడిపిలో చేరినా..కాంగ్రెస్‌ నేతలకు, వైకాపా నేతలకే ఆయన పనులు చేసి పెడుతున్నారట. దీంతో అసలైన టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆయనపై కోపంగా ఉన్నారట. ఈసారి ఆయనకు టిక్కెట్‌ ఇస్తే..ఓడించడం ఖాయమని బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా టిక్కెట్‌ రాదట. మొత్తం మీద..గత ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తే...ఆ ముగ్గురికి కూడా ప్రస్తుతం పోటీ చేసే అవకాశం రాకపోవడం విశేషంగా చెప్పవచ్చు.

(2901)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ