WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపా ఎమ్మెల్యే 'పెద్దిరెడ్డి'ని 'చంద్రబాబే' గెలిపిస్తున్నారా...?

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు పరోక్షంగా చంద్రబాబే సహకరించారనే విమర్శలు ఉన్నాయి. ఆయనపై 1994లో మినహా బలమైన అభ్యర్థిని దింపకపోవడమే కారణమని పలువురు నాయకులు చెబుతున్నారు. 'చంద్రబాబు'పై అప్పుడప్పుడు బాహాటంగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి విమర్శలు చేసినా..వైకాపా,టిడిపి నాయకులు కొట్టిపారేస్తుంటారు. వ్యాపారపరంగా, ఆర్థికపరంగా 'రామచంద్రారెడ్డి' ఎదుగుదలకు పరోక్షంగా 'బాబు' ఆశీస్సులు ఉన్నాయనేది టిడిపి నాయకుల అనుమానం. అదుగో...ఇదుగో 'రామచంద్రారెడ్డి'ని ఓడిద్దామని అంటారు. చివరకు బలహీన అభ్యర్థిని నిలబెట్టి 'పెద్దిరెడ్డి'ని గెలిపిస్తున్నారని ఇంతకు ముందు జరిగిన సంఘటనలను బట్టి వారు చెబుతున్నారు. పెద్దిరెడ్డిని ఓడించాలని 'చంద్రబాబు' నిర్ణయం తీసుకుంటే దానికి ఎదురే ఉండదని టిడిపి నాయకులకు తెలుసు. ఏదో ఒక సీటు పోతే నష్టమేమిటని 'చంద్రబాబు' భావిస్తున్నారేమో..? చిత్తూరు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు చివరకు టిటిడిలో కూడా 'పెద్దిరెడ్డి' సిఫార్సులకు చాలా విలువ ఇస్తారని అనేక సందర్బాల్లో నాయకులు,కార్యకర్తలు 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్‌ కూడా 'పెద్దిరెడ్డి'పై ఎటువంటి ఆరోపణలు, విమర్శలు చేయలేదు. 1994లో టిడిపి గాలి బలంగా వీచడంతో రామచంద్రారెడ్డి ఓడిపోయారన్నది పార్టీ నాయకుల నమ్మకం. ఏది ఏమైనా 'పెద్దిరెడ్డి'ని ఓడించాలని 'చంద్రబాబు' గట్టిగా భావిస్తే..ఆయన ఓడిపోవడం ఖాయం. లేదంటే...మళ్లీ గెలుస్తారు..గెలుస్తూనే ఉంటారని పార్టీ వర్గాల అభిప్రాయం.

(211)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ