WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' ఆయువు పట్టుపై 'రాహుల్‌' దెబ్బకొడుతున్నాడా...!?

ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై 'రాహుల్‌గాంధీ' దృష్టి పెట్టారా...? ఆయనను దెబ్బ తీయాలని ప్లాన్‌ చేశారా..? ఎట్టి పరిస్థితుల్లో వై.ఎస్‌.జగన్‌ను ఆంధ్రాలో అధికారంలోకి రాకుండా చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారా...? కాంగ్రెస్‌ తరపున రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వై.ఎస్‌కు, ఎంపీగా 'జగన్‌'కు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే తమను నమ్మించి మోసం చేస్తారా..? అనే కోపంతో..'రాహుల్‌' అదను చూసి 'వై.ఎస్‌' తనయుడిపై ప్రతీకారం తీర్చుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత...కాంగ్రెస్‌ సంస్కృతి ప్రకారం పిసిసి అధ్యక్షుడ్ని ముఖ్యమంత్రిగా నియమించాల్సి ఉన్నా..తమ తల్లి వై.ఎస్‌ను ప్రోత్సహించాలని భావించి ఆయనను సిఎం చేసిందని, సిఎం అయిన తరువాత వేలకోట్లు దోచుకుంటున్నా...పెద్దగా పట్టించుకోలేదని, తమ వల్ల వై.ఎస్‌ సిఎం అయితే..ఆయన మృతి చెందిన తరువాత తమకు అండగా ఉండాల్సిన 'జగన్‌' పార్టీని చీల్చి  ఆంధ్రాలో పార్టీని నాశనం చేశారని... ఇప్పుడు 'జగన్‌'ను ఓడించే అవకాశం తమకు వచ్చిందని..దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను వదులుకోనని 'రాహుల్‌' చెబుతున్నారట. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ను రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తూనే...ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటున్న వర్గాలపై ఆయన దృష్టి పెట్టారట. 

  ఒకవైపు తాము అధికారంలోకి వస్తే...ఆంధ్రాకు ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, రాజధాని నిర్మాణానికి చేయూత వంటివన్నీ ఇస్తామని 'రాహుల్‌' ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ఎస్సీ,ఎస్టీ,బిసీ సామాజికవర్గాలపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తున్నారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని..పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి..రాహుల్‌ మాటలకు వారి నుంచి భారీ స్పందన వస్తోంది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ అయిన ఎస్సీ, ఎస్టీలు..మొన్నటి ఎన్నికల్లో 'జగన్‌'కు ఓటు వేశారు. ఇప్పుడు కూడా వారంతా 'జగన్‌' వైపే ఉన్నారు. అయితే..దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి వారు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ వైపు మళ్లుతున్నారు. ఎస్సీ,ఎస్టీలకు రక్షణ ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీనేన్న భావం రాష్ట్రంలో ఉన్న దళితుల్లోకి మెల్లగా వెళుతోంది. ఈ ప్రభావంతో 'జగన్‌'కు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎస్సీ,ఎస్టీల్లో భారీ మార్పు రాకపోయినా..నియోజకవర్గానికి కాంగ్రెస్‌కు ఐదు వేల నుంచి పది వేల ఓట్లు వచ్చినా...'జగన్‌' ఓటు బ్యాంక్‌కు భారీగా గండిపడుతుంది. దాంతో..కాంగ్రెస్‌ పార్టీ గెలవలేకపోయినా...'జగన్‌'ను ఓడించగలుగుతుంది. కాంగ్రెస్‌ చీల్చే ఓట్లు వల్ల టిడిపికి భారీగా లబ్దికలుగబోతోంది. 

  కేవలం ఎస్సీ,ఎస్టీ ఓట్లే కాదు..రాయలసీమలో బలమైన సామాజికవర్గమైన 'రెడ్లు'ను మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని వైకాపాలో చేరాలని భావించిన 'రెడ్లు' ఇప్పుడు మనసు మార్చుకుని కాంగ్రెస్‌లోనే ఉండాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి రాకపోయినా..కేంద్రంలో అధికారంలోకి వస్తామని..'రాహుల్‌' ప్రధాని అవు తారని..దాంతో తమ జాతకాలు మారతాయని..ముందు 'జగన్‌'నుఓడిస్తే..వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తా మనే భావన వారిలో ఉంది. అందుకే..రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు..కాంగ్రెస్‌ వైపే నిలబడ్డారు..మరి కొందరు మళ్లీ కాంగ్రెస్‌ బాట పడుతున్నారు. మొత్తం మీద...'రాహుల్‌' అదను చూసి 'జగన్‌' ఆయువు పట్టుపై కొడుతున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

(2445)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ