WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టి.టిడిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి భయం..!

తెలంగాణ రాష్ట్రంలో టిడిపి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారిలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగతా వారంతా టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే. ఆ విధంగా చేరిన ఎమ్మెల్యేల్లో మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు తప్ప మిగతా వారెవరూ విజయం సాధించే పరిస్థితి లేదని టిఆర్‌ఎస్‌ అగ్రనేతలు భావిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా కష్టపడితేనే విజయం సాధించవచ్చు. కాంగ్రెస్‌, టిడిపి,సిపిఐ కలసి పోటీ చేస్తే ఫిరాయింపు టిడిపి ఎమ్మెల్యేలందరూ మాజీలు కాక తప్పదు. రాజకీయంగా వారు పూర్తిగా తెరమరుగు కావడం ఖాయమంటున్నారు టిడిపి నాయకులు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్‌లో టిడిపి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి టిఆర్‌ఎస్‌లో చేరిన వారికి కంటిమీద కునుకు పట్టలేదట. ఆందోళనతో కనిపిస్తున్నారట. అభ్యర్థులెవరైనా...గెలవడం ఖాయం... ఫిరాయింపు ఎమ్మెల్యే ఓడిపోవడం అంత కన్నా ఖాయం అంటున్నారు తెలంగాణ టిడిపి నాయకులు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని స్థానిక నాయకుల పెత్తనానికి అడ్డుకట్టవేయాలని పలువురు నేతలు కోరుతున్నారు. ఇటీవల చంద్రబాబును స్వయంగా కలిసిన ఒకనేత 'జనమ్‌ప్రత్యేక ప్రతినిధి'తో మాట్లాడుతూ..కొందరు నేతలు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు..మీరు వారి సిఫార్సులు పాటించకుండా...స్థానిక నేతలను సమావేశపరిచి అభ్యర్థిని ఎంపిక చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. 

  నోటిఫికేషన్‌ రాకముందే ఇటువంటి సమావేశాలను నిర్వహించాలని ఆ నాయకుడు చంద్రబాబును కోరారు. ముఖ్యంగా తనకు ఎదురులేదని, అహంకారంతో విమర్శలు, ఎదురుదాడి చేస్తోన్న మంత్రి తలసాని దూకుడుకు చెక్‌ పెట్టాలని స్థానిక నేతలంతా ముక్తకంఠంతో చంద్రబాబుని కోరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి మాజీలు ఎందుకు ఆ పార్టీలో చేరి రాజకీయంగా నష్టపోయామని..జీవితాంతం కుంగి కృషించి బాధపడడం ఖాయమంటున్నారు పార్టీ నేతలు. ఇటీవల చంద్రబాబును మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా కలసి ఏదో ఒత్తిళ్లకు,భయాలతో పార్టీ మారామని, టిక్కెట్‌ ఇస్తామంటే పార్టీలో చేరతామని చెప్పడంతో..చంద్రబాబు ఆగ్రహంతో బయటకు వెళ్లమని చెప్పారట. ఒకప్పుడు మంత్రి లోకేష్‌కు సన్నిహితంగా మెలగిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆయనను ఏదో విధంగా కలసి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ టిడిపి ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సీటు ఇచ్చినా గెలుస్తామనే నమ్మకం వారిలో కనిపించడం లేదు.

(234)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ