WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లక్ష ఓట్లు సాధించిన ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తారా...!?

సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలవాలని గట్టిపట్టుదలతో గెలిచే అభ్యర్థుల కోసం వెతుకుతోంది. గత ఎన్నికల్లో గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుండడంతో..వారి స్థానంలో కొత్తవారిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు ప్రతిపక్ష వైకాపా కూడా ఈ ఎన్నికల్లో చావో..రేవో తేల్చుకోవాలనే ధ్యేయంతో ముందుకెళుతోంది. ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సొమ్ములకే ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించేది సొమ్ములేనని..ఎవరు ఎక్కువ ఖర్చుపెడతారో..వారికే టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెబుతోందని...ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. అభ్యర్థి ఎవరు..? ఆయనకు ప్రజల్లో ఏ మాత్రం పట్టు ఉంది..అనేది ఏమీ చూడకుండా...డబ్బులే అభ్యర్థిని ఎంపిక చేస్తాయని..పరోక్షంగా తేల్చి చెబుతూ..అటువంటి వారి కోసం వెతుకుతున్నారు. ఇంకో వైపు 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' కూడా తమ పార్టీ తరపున కొందరిని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఏపార్టీలో చూసినా..అభ్యర్థుల ఎంపిక కోసమే కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కొన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా గెలిచిన అభ్యర్థులు పరిస్థితి ఏమిటి..? వాళ్లు మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో గెలవగలరా..? గతంలో వారికి ప్రజల్లో ఉన్న మద్దతు ఇప్పుడూ ఉందా..? అనే దానిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఆరా తీసింది. ఒక్కో నియోజకవర్గంలో సరాసరి రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్న పరిస్థితుల్లో వాటిలో సగానికి పైగా అంటే లక్ష ఓట్లు తెచ్చుకుంటే వారి గెలుపు సునాయాసమే. గత ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే...ఇలా లక్ష ఓట్లకు పైగా తెచ్చుకున్న వారు దాదాపు 13 మంది ఉన్నారు. 'తిరుపతి' ఉప ఎన్నికలు దీనికి మినహాయింపు. ఈ లక్ష ఓట్లకు పైగా తెచ్చుకున్న ప్రస్తుత ఎమ్మెల్యేల్లో మళ్లీ ఎంత మంది గెలుస్తారు..? వారికి మళ్లీ లక్షకు పైగా ఓట్లు వస్తాయా..? ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఒక అంచనా వేస్తోంది. వీరిలో ఎంత మంది మళ్లీ లక్ష ఓట్లు సాధిస్తారో..చూద్దాం..?  

  మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 13 మందికి పైగా ఎమ్మెల్యేలు లక్షకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. వీరిలో కొందరు మళ్లీ అదే స్థాయిలో ఓట్లు పొందే పరిస్థితి ఉండగా..మరి కొందరి పరిస్థితి మాత్రం దిగజారింది. ముందుగా ఉత్తరాంధ్రాలో గత ఎన్నికల్లో లక్షకు పైగా ఓట్లు తెచ్చుకున్న వారి పరిస్థిథి చూద్దాం. విశాఖపట్నం జిల్లా 'భీమిలి' నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసిన రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి 'గంటా శ్రీనివాసరావు' 1,18,020 ఓట్లు తెచ్చుకుని సమీప వైకాపాకు చెందిన 'కర్రి సీతారాం'పై 37226 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో టిడిపి,బిజెపి,జనసేన మద్దతుతో 'గంటా' ఘన విజయం సాధించగా..ఇప్పుడు బిజెపి, జనసేనలు టిడిపికి దూరం అయ్యాయి. అదే సమయంలో 'గంగా' నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి అక్కడ ఓటర్లల్లో ఉంది. ఇటీవల ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన సర్వేలో ఆయన మళ్లీ గెలవరని చెప్పడంతో..ఆయన ఆ సర్వేపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక..తాను మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేసి..గతంలో వచ్చిన మెజార్టీ కన్నా..ఎక్కువ మెజార్టీ సాధిస్తానని చెప్పడం గమనార్హం. అయితే..ఆయన చెప్పిన విధంగా నియోజకవర్గంలో పరిస్థితి లేదని..స్థానిక ఓటర్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉండడం ఆయనకు ఇబ్బంది కరమే. ముక్కోణపు పోటీలో ఆయన గెలవడం ఖాయమే కానీ..గతంలో వచ్చిన మెజార్టీ రావడం కష్టమనే అభిప్రాయం ఉంది. జిల్లాలో లక్ష ఓట్లు సాధించిన మరో అభ్యర్థి 'వెలగపూడి రామకృష్ణబాబు'. ఈయన విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి  1,00,624 ఓట్లు సాధించి వైకాపా అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. నియోజకవర్గ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే 'రామకృష్ణ' మరోసారి ఘన విజయం సాధిస్తారని నియోజకవర్గ ఓటర్లు, ఇతర రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయనకు ప్రత్యర్థులు ఎవరైనా..ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజార్టీ సాధించడం కష్టమే.

   తూర్పుగోదావరి జిల్లా 'మండపేట' నుంచి పోటీ చేసిన వి.జోగేశ్వరరావు లక్ష ఓట్లకు పైగా సాధించారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 1,00,113 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి వైకాపాకు చెందిన 'గిరిజాల వెంకటస్వామి నాయుడు'కు 69745 ఓట్లు వచ్చాయి. అయితే...ఈసారి జోగేశ్వరరావుకు అంత మెజార్టీ సాధించడం కష్టమే. ముక్కోణపు పోటీ జరగనున్న నేపథ్యం, కాపు ఓట్లలో చీలిక వస్తుందనే మాటతో..'జోగేశ్వరరావు' విజయం అంత సులువేమీ కాదు. ఇక్కడ 'పవన్‌' ప్రభావం ఎవరికి నష్టం చేస్తుందో చెప్పలేం. అయితే..గతంలో వచ్చిన లక్ష ఓట్లు రావని స్పష్టంగా చెప్పవచ్చు. 'పశ్చిమగోదావరి' జిల్లాలో గత ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు లక్షకు పైగా ఓట్లు సాధించారు. ఉండి నియోజకవర్గం నుంచి టిడిపి తరుపున పోటీ చేసిన 'వి.వి.శివరామరాజు'కు 1,01,530 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి పత్తపాటి సర్రాజుకు 65,299 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన అభిమానాన్ని పొందుతున్న 'శివరామరాజు' ఈ సారి సునాయాసంగా గెలుస్తారు. కానీ..గతంలో వచ్చిన మాదిరి లక్ష ఓట్లు రావడం కష్టమే. 'తణుకు' నుంచి గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసిన 'అరిమిల్లి రాధాకృష్ణ'కు కూడా 1,01,015 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థికి 70,067 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి మళ్లీ 'అరిమిల్లి' ఘన విజయం సునాయాసమే. అయితే..లక్ష ఓట్లు రావడం కష్టమనే అభిప్రాయం ఉంది. కాగా మరో నియోజకవర్గమైన 'చింతలపూడి'లో గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన 'పీతల సుజాత'కు 1,05,417 ఓట్లు వచ్చాయి.వైకాపాకు చెందిన దివ్యపై ఆమె 15164 ఓట్ల తేడాతో గెలుపొందింది. అయితే గత ఎన్నికల్లో లక్ష ఓట్లు సాధించిన ఆమెకు ఈసారి టిక్కెట్‌ ఇవ్వడమే కష్టమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. లక్ష ఓట్లు సాధించిన ఆమెకు 'చంద్రబాబు' మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అయితే అవినీతి ఆరోపణలు, ఇతర విమర్శలు రావడంతో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఆమెకు టిక్కెట్‌ ఇస్తారా..? ఇవ్వరా..అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమెకు టిక్కెట్‌ ఇస్తే ఓడిపోవడం ఖాయమని..ఆమెకు సీటు ఇవ్వవద్దని ఆమె వ్యతిరేకులు పార్టీ అధినేతపై వత్తిడి తెస్తున్నారు. మరి చంద్రబాబు ఆమె విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో..కానీ..ఆమె పోటీ చేస్తే..మాత్రం గతంలో వచ్చినట్లు లక్ష ఓట్లు రావడం దాదాపు అసాధ్యమే.

  కృష్ణా జిల్లా 'పెనమలూరు' నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన 'బోడే ప్రసాద్‌'కు గత ఎన్నికల్లో 102330 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తారని 'బోడే'కు పేరుంది. అయితే..ఇక్కడ నుంచి మంత్రి లోకేష్‌ పోటీ చేస్తారనే మాట పార్టీ వర్గాల నుంచి సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మంత్రి లోకేష్‌ పోటీ చేస్తే..లక్ష ఓట్లుకు పైగా వస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో మళ్లీ 'బోడే'' పోటీ చేసినా..అదే స్థాయిలో ఓట్లు రావచ్చు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన 'గోనుగుంట్ల వీరాంజనేయులు'కు 104321 ఓట్లు వచ్చాయి. ఆయన తన ప్రత్యర్థి అయిన 'నన్నపునేని సుధ'పై దాదాపు 21,407 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సారి ఆయనకు లక్ష ఓట్లకు పైగా రావడం కష్టమే. ఆయన గత నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ద్వితీయశ్రేణి నాయకులకు, వ్యక్తిగత సహాయకులకు వదిలేసి..దూరంగా ఉన్నారని..ఆ ప్రభావం ఆయనపై పడనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వ్యక్తిగా అందరికీ దగ్గరవాడైన 'జివి' నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. కరువు,నిరుద్యోగం నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్నా ఆయన పట్టించు కోలేదన్న విమర్శ ఆయనపై ఉంది. 'జివి' హయాంలో గుర్తుంచుకునే పని ఒక్కటీ చేయలేదన్నది నియోజకవర్గ ప్రజల ఆరోపణ. వ్యక్తిగత బలహీనతలు, వ్యక్తిగత సహాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు చేస్తోన్న అరాచకాలు..'జివి' ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇప్పటికైతే..ఆయన ఓడిపోయే అవకాశం లేదు కానీ...బలమైన ప్రత్యర్థి ఎదురైతే...ఆయనకు ఇక్కట్లు తప్పవు. అదే సమయంలో గతంలో వచ్చినట్లుగా లక్షకు పైగా ఓట్లు మాత్రం రావని ఖచ్చితంగా చెప్పవచ్చు.

  కడప జిల్లాలోని 'పులివెందుల'లో గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి 124576 ఓట్లు వచ్చాయి. ఆయనకు ఈసారి కూడా లక్షకు పైగా ఓట్లు వస్తాయనడంలో ఎటువంటి సందేసం లేదు. అయితే...ఆయనకు గతంలో వచ్చిన మెజార్టీ తగ్గుతుంది. ఇదే జిల్లా 'జమ్మలమడుగు' నియోజకవర్గం నుంచి వైకాపా తరుపున పోటీ చేసి గెలిచిన 'ఆదినారాయణరెడ్డి'కి కూడా లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే..ఆయన తరువాత..టిడిపిలో చేరి మంత్రి అయ్యారు. ఇక్కడ గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన 'ఆదినారాయణరెడ్డి' 'రామసుబ్బారెడ్డి'లు ఒకేపార్టీలో ఉండడంతో..వారిద్దరూ సఖ్యతగా పనిచేస్తే..వైకాపా నుంచి ఎవరు పోటీ చేసినా..ఇక్కడ టిడిపి అభ్యర్థి లక్ష ఓట్లను సాధిస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి వారిద్దరూ సఖ్యతతో పనిచేస్తారా..లేదో చూడాలి.  చిత్తూరు జిల్లా 'పుంగనూరు' నుంచి వైకాపా తరుపున పోటీ చేసిన 'పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి' కూడా లక్ష ఓట్లకు పైగా సాధించారు. అయితే ఈసారి ఆయన అన్ని ఓట్లు సాధించడం కష్టమే. మరో నియోజకవర్గమైన 'చంద్రగిరి'లో వైకాపా అభ్యర్థి 'చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి' 100924 ఓట్లు వచ్చాయి. అయితే..ఈసారి లక్ష ఓట్లు ఆయనకు రావడం కష్టమైన పనే. టిడిపి చెవిరెడ్డిని ఓడించడానికి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి యుద్దానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న 'కుప్పం' నియోజకవర్గంలో ఆయనకు గత ఎన్నికల్లో 102952 ఓట్లు వచ్చాయి. ఈసారి ఆయన అక్కడ పోటీ చేయరని..ఆయన కుమారుడు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ నుంచి ఆయన కుమారుడు పోటీ చేసినా..లక్ష ఓట్లు రావడం ఖాయమే. ఏది ఏమైనా గత ఎన్నికల్లో లక్ష ఓట్లు సాధించిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మళ్లీ విజయంసాధించడం ఖాయమే అయినా...లక్ష ఓట్లు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే సాధించగలరనడంలో ఎటువంటి సందేహం లేదు.

(1452)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ