WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సీనియర్లను విస్మరించి..జూనియర్‌ ఐఎఎస్‌లకు పెద్దపీట...!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 'పునీతా' బాధ్యతలుస్వీకరించబోతున్న నేపథ్యంలో త్వరలో భారీ ఎత్తున్న ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల బదిలీలు ఉండే అవకాశాలున్నాయి. అమెరికాలో ఉన్న 'సతీష్‌' చంద్ర నేడో..రేపో హైదరాబాద్‌కు చేరుకుంటారు. 3వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉండడంతో..తరువాత భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. గత నాలుగైదేళ్ల నుంచి ఒకే పోస్టులో ఉన్నవారిని తప్పిస్తారా..? లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఏయే అధికారి..ఏయే పోస్టులు నిర్వహిస్తున్నారు..అనే విషయంలోకి వెళితే...ఉమ్మడి రాష్ట్రంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ కమీషనర్‌గా నియమితులైన 'శ్యామలరావు' రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా అదే పోస్టులో నిరాటకంగా ఇప్పటికీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మచీలీపట్నంలో కోట్లాది రూపాయలతో స్వంత భవనాలను నిర్మించుకున్నారని ఒక పత్రిక సాక్ష్యాలతో వార్తలను ప్రచురించారు. అయినప్పటికీ..ఇప్పటి వరకు పాలకులు దీనిపై స్పందించలేదు..దీనిపై విచారణ కూడా జరిపించలేదు. అదే విధంగా పంచాయితీరాజ్‌శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న 'జవహర్‌రెడ్డి' ఉమ్మడి రాష్ట్రంలోనే అదే పోస్టులో ఉన్నారు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. దీనికి తోడు అదనంగా గ్రామీణాభివృద్ధిశాఖను కూడా ఆయనకే అప్పచెప్పారు. ఈ ఐదేళ్లల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపిస్తే వెలుగు చూడని ఎన్నో వాస్తవాలు బయటపడతాయని..కొందరు సిఎంకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తంతే గారెల బుట్టలో పడిన చందంగా ఈశాఖ మంత్రిగా 'నారా లోకేష్‌' బాధ్యతలు చేపట్టిన తరువాత..'జవహర్‌రెడ్డి' తీసుకుంటున్న నిర్ణయాలకు ఎదురే లేకుండా పోయింది. 

  పౌరసరఫరాలశాఖ కమీషనర్‌ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'రాజశేఖర్‌'కు వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకారశాఖలకు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పచెప్పి సంవత్సరంపైగా గడిచింది. ఆయనను ఏదో ఒక శాఖలో శాశ్వితంగా నియమించాల్సిన పాలకులు ఎందుకు మౌనం దాలుస్తున్నారో అధికార వర్గాలకు అంతుబట్టడం లేదు. సీనియర్‌ అధికారుల్లో కొందరికి చిన్న చిన్నశాఖలకు అధిపతులుగా నియమించిన పాలకులు వారి కన్నా జూనియర్‌ అయిన 'రాజశేఖర్‌'ను నాలుగు శాఖలకు అధిపతిగా నియమించారు. అదే విధంగా రవాణాశాణ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపిఎస్‌ అధికారి 'బాలసుబ్రహ్మణ్య,' పరిస్థితి అదే విధంగా ఉంది. ఆయనకు రవాణాశాఖ సీతయ్యగా పేరు పెట్టారు రవాణాశాఖ ఉద్యోగులు. ఆయన హయాంలో చాలా మంది రవాణావాఖ అధికారులపై ఏసీబీ దాడులు చేయించారు. పైన చెప్పిన ముగ్గురి కంటే 'బాల సుబ్రహ్మణ్యం'కు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. ఈ నాలుగేళ్లల్లో ఆయన తీసుకువచ్చిన సంస్కరణల వల్ల..రవాణా శాఖలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గతంలో రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగతున్న ప్రజలు..ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి నుంచే రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు పొందుతున్నారు. రవాణాశాఖలో బ్రోకర్ల వ్యవస్థను రద్దు చేసిన అధికారిగా 'బాలసుబ్రహ్మణ్యం' పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు రవాణాశాఖలో పనులు కావాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేంది. దేశ మొత్తం మీద..ఆంధ్రప్రదేశ్‌లోనే 'రవాణాశాఖ'లో ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయి. ఆయనను మరికొన్నాళ్లు కొనసాగించిన ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. మరో జూనియర్‌ అధికారి అయిన 'రవిచంద్ర' ఆర్థికశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్వహించాల్సిన బాధ్యతను కార్యదర్శి హోదాలో ఆయన నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఆర్థికశాఖకు మేధావులైన సీనియర్‌ అధికారులు బాధ్యతను నిర్వహించేవారు. ప్రస్తుతం జూనియర్‌ అయిన 'రవిచంద్ర'తో పనికానిస్తున్నారు. పాలకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని చెప్పవచ్చా..? స్వామి కార్యాలతో పాటు..స్వకార్యాలను కూడా నెరవేరుస్తున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వమే తమకు బాధ్యతలు అప్పచెప్పింది..తమకు అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అపార రాజకీయ, అధికార అనుభవం ఉన్న సిఎం చంద్రబాబు కొందరు అధికారులపై వివక్ష చూపుతూ..మరి కొందరిపై అవాజ్యమైన ప్రేమ చూపిస్తున్నారని పేరు తెచ్చుకుంటున్నారు. ఈ నియామకాలు ఎంత వరకు సమంజసమో..సిఎం చెప్పగలరా..? సిఎంఒ అధికారులు వివరించగలరా..?

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ