WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పత్తిపాడు' 'టిడిపి' అభ్యర్థిగా 'కూచిపూడి విజయ'...!?

ఒకప్పుడు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టిడిపికి కంచుకోట. టిడిపి ఆవిర్భావం తరువాత ఆ పార్టీ అభ్యర్థిని వరుసగా ఐదుసార్లు ఇక్కడ నుంచి అక్కడి ఓటర్లు గెలిపించారు. అటువంటి కంచుకోటకు 2004 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ప్రభుత్వ వ్యతిరేక గాలుల్లో టిడిపి ఓటమి చెందిందని భావించినా..తరువాత వరుసగా మరో రెండు సార్లు కూడా అక్కడ టిడిపి ఓటమిని చవిచూసింది. దీంతో..అక్కడ పార్టీ పట్టుకోల్పోయిందేమోనన్న అనుమానం పార్టీ అధినేత నుంచి...పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు వచ్చింది. అయితే వరుసగా మూడుసార్లు ఓడిపోయినా...2014 ఎన్నికల్లో విజయం సాధించి..మళ్లీ టిడిపి ఫామ్‌లోకి వచ్చింది. అయితే 2014లో పార్టీ గెలిచిందన్న సంతోషం నాలుగేళ్లలోనే ఆవిరయింది. ఇక్కడ నుంచి గెలిచిన 'రావెల కిశోర్‌బాబు' ఆదిలో పార్టీ లైన్‌లోనే నడిచినా..తరువాత...క్రమంగా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు దూరం అయ్యారు. తనను గెలిపించిన వారినే దూషిస్తూ...అధినేతపై అనవసర కామెంట్లు చేస్తూ... అనాయాసంగా వచ్చిన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు. చివరకు...ఆయన వ్యవహార శైలితో సీటు కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. జిల్లాలో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో సీటు ఇవ్వని వారిలో ఆయన ప్రథమ స్థానంలో ఉన్నారు. దీంతో...ఇక్కడ నుంచి పోటీ చేయడానికి పలువురు ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్నారు.

  2009లో ఎస్సీ నియోజకవర్గమైన 'పత్తిపాడు'లో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 'మేకతోటి సుచరిత' విజయం సాధించారు. వై.ఎస్‌ మరణం తరువాత జరిగిన ఉపఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థి ఎస్‌.వీరయ్యపై మరోసారి విజయం సాధించి నియోజకవర్గంలో తిరుగులేని పట్టుసాధించారు. అయితే..అనూహ్యంగా 2014లో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబుపై ఓటమి పాలయ్యారు. అయితే నాలుగేళ్ల నుంచి టిడిపిలో ఉన్న వర్గవిభేదాలను తనకు అనుకూలంగా మలచుకుని..ఇప్పుడు మరోసారి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ నుంచి మళ్లీ 'సుచరిత' పోటీ చేస్తారని వైకాపా అధినేత 'జగన్‌' ప్రకటించిన నేపథ్యంలో....ఆమెను ఎదుర్కోవడానికి టిడిపి ఎవరిని బరిలోకి దించాలనే దానిపై కసరత్తులు చేస్తోంది. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చే పరిస్థితి లేనందున ఆయన స్థానంలో ఎవరిని దించితే పార్టీ గెలుస్తుందనే దానిపై పార్టీ అధినేత 'చంద్రబాబునాయుడు' సర్వేలు చేయిస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి టిడిపికి చెందిన పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. 

  మొదటగా గతంలో పోటీ చేసిన ఎస్‌.వీరయ్య మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా..ఆయన ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయారని..ఆయనకు ఇస్తే..మరోసారి..పార్టీ ఓడిపోతుందని నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. కానీ..తనపై ఓటర్లకు సానుభూతి ఉందని..తనకు ముచ్చటగా మూడోసారి సీటు ఇస్తే గెలుస్తానని..ఆయన అంటున్నా...అధినేత చంద్రబాబు కానీ ఆయన కుమారుడు 'లోకేష్‌' కానీ...ఆలకించే పరిస్థితుల్లో లేరు. కాగా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'రామాంజనేయులు' ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పౌరసంబంధాలశాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ...లేదా..గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్‌ స్థానంలో కానీ...లేదా..'పత్తిపాడు' అసెంబ్లీ స్థానం నుంచి కానీ బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. పోటీకీ 'రామాంజనేయులు' కూడా సంసిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. దీంతో...ఆయనకు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన కాకుండా మరో కేంద్ర సర్వీసు అధికారి కూడా ఇక్కడ పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారు. వీరు కాకుండా గతంలో కాంగ్రెస్‌లో ఉండి ఇటీవల టిడిపిలో చేరిన 'కూచిపూడి సాంబశివరావు' దంపతులు ఇక్కడ నుంచిపోటీ చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

'విజయ'కు అవకాశం...!

కాంగ్రెస్‌ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి వీరవిధేయులైన 'కూచిపూడి' దంపతులు...ఆయన మృతి చెందిన తరువాత...టిడిపిలో చేరారు. వారు 'జగన్‌' పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా..చివరకు టిడిపిలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు...వారు 'బాపట్ల' పార్లమెంట్‌ స్థానం నుంచి తాము టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తామని 'చంద్రబాబు' వద్దకు వెళ్లారు. అయితే..అప్పటికే...ఆ సీటును 'సుజనాచౌదరి' అనుచరుడు 'మాల్యాద్రి'కి ఇస్తున్నట్లు ప్రకటించడంతో..'కూచిపూడి' దంపతులకు పోటీ చేసే అవకాశం దొరకలేదు. అప్పట్లో తన వద్దకు వచ్చిన 'కూచిపూడి'దంపతులకు భవిష్యత్‌లో పోటీ చేసే అవకాశం ఇస్తానని 'చంద్రబాబు' హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వారు 'చంద్రబాబు'ను ఆయన కుమారుడ్ని కలసి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుంటే...'వీరయ్య, రామాంజనేయులు, మరో ఐఎఎస్‌  అధికారి కంటే 'కూచిపూడి విజయ' సరైన అభ్యర్థి కాగలరని నియోజకవర్గ టిడిపి అభిమానులు పేర్కొంటున్నారు. 

  గతంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేసిన 'విజయ' సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేశారని పేరుంది. ఆమె సమర్థతను చూసే..నాడు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమెకు ఛైర్మన్‌ పదవి ఇవ్వవద్దన్నా 'వై.ఎస్‌' ఏకగ్రీవంగా ఆమెకు పదవి కట్టబెట్టారు. అటువంటి సమర్థత కలిగిన 'విజయ'కు ఇప్పుడు 'పత్తిపాడు' సీటు ఇస్తే ఆమె సునాయాసంగా గెలుస్తుందనే మాట నియోజకవర్గ ఓటర్ల నుంచి వినిపిస్తోంది. వైకాపా నుంచి మహిళా అభ్యర్థి పోటీ చేస్తుండడంతో..టిడిపి నుంచి కూడా మహిళకే అవకాశం ఇస్తే గట్టి పోటీ ఉంటుంది. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేయడం, 'విజయ' భర్త 'కూచిపూడి సాంబశివరావు' రెండు సార్లు 'తాడికొండ' నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఉండడం వారికి కలసివస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉన్నత విద్యావంతురాలిగా పేరున్న 'విజయ'కు పత్తిపాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే...జిల్లాలో మహిళకు అవకాశం ఇచ్చినట్లుగా కూడా అవుతుంది. పైన పేర్కొన్న అనుకూలతలను బేరీజు వేసుకుంటే..'విజయ'కు పోటీ చేసే అవకాశం దొరుకుతుంది. కానీ...జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన 'తాడికొండ, వేమూరు' నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపైనే...ఇక్కడ 'విజయ'కు పోటీ చేసే అవకాశం దొరకవచ్చు. 'తాడికొండ'లో మళ్లీ 'మాదిగ'లకు అవకాశం ఇస్తే..ఇక్కడ...'విజయ'కు అవకాశం రావచ్చు. అక్కడ కనుక...'మాల' సామాజికవర్గానికి ఇస్తే..ఇక్కడ 'విజయ'కు అవకాశాలు లేనట్లే. మరో వైపు 'వేమూరు' ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనంద్‌బాబు'ను 'బాపట్ల' పార్లమెంట్‌ అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేస్తే...'వేమూరు' నుంచైనా..'విజయ'కు అవకాశం దక్కవచ్చు.  ఏది ఏమైనా...ఉన్నత విద్యావంతురాలు, రాజకీయంగా సమర్థత చాటుకున్న మహిళను పోటీకి దింపితే..పార్టీ విజయతీరాలకు చేరుతుందనే అభిప్రాయం నియోజకవర్గ టిడిపి ఓటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. మరి అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

(1044)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ