WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ ఇఒగా 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం'...!?

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యంను కొన్ని కారణాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించలేకపోతున్నానని, ఎన్నికల తరువాత..'ఎల్‌వి'ని సిఎస్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. 'ఎల్‌వి'కి ప్రస్తుతం ఏ పోస్టు కావాలో కోరుకోమని 'చంద్రబాబు' అడగ్గా..దానికి 'ఎల్‌వి' టీటీడీ ఇఒగా వెళతానని చెప్పారని తెలిసింది. రెవిన్యూశాఖలోని ఐదుశాఖలకు అధిపతిగా అంటే రెవిన్యూ,దేవాదాయ,ఎక్సైజ్‌,కమర్షియల్‌ ట్యాక్స్‌ మరియు రిజిస్ట్రేషన్లు శాఖాధిపతిగా 'ఎల్‌వి'ని నియమిస్తే..ఎలా ఉంటుందనే దానిపై 'చంద్రబాబు' అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎల్‌వికి ఎన్నిశాఖలు ఇచ్చినా...ఆయన కన్నా జూనియర్‌ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'పునీతా' కింద పనిచేయాల్సి ఉంటుంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ఎవరూ అందుకు అంగీకరించరు. పై కారణాలతో 'ఎల్‌వి' టీటీడీ ఇఒగా వెళితే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. గతంలో ఆయన టీటీడీ ఇఒగా బాధ్యతలు నిర్వహించారు. నిజాయితీ,సమర్థత కలిగిన అధికారిగా పేరుపొందారు. 

  టీటీడీ బోర్డు స్వయంప్రతిపత్తి ఉండడంతో ఇఒపై ముఖ్యమంత్రికి తప్ప ఏ అధికారికి పెత్తనం ఉండదు. దేవాదాయశాఖ మంత్రి కూడా మొక్కుబడిగా వచ్చిపోతుంటారు...మంత్రి కాబట్టి టీటీడీ అధికారులు ఆయనను గౌరవిస్తుంటారు. అన్ని విధాలుగా ఆలోచించే... ఎల్‌వి టీటీడీ ఇఒగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని ఐఎఎస్‌ అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకప్పుడు 'ఎల్‌వి' పట్ల వివక్ష చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబే..ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించలేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రస్తుత సిఎస్‌ పునీతా 2019 మే మాసాంతానికి రిటైర్‌ కానుండడంతో...జూన్‌1లో 'ఎల్‌వి'ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని 'చంద్రబాబు' ఆయనకు హామీ ఇచ్చారు. రెవిన్యూశాఖలోని అన్ని శాఖల అధిపతిగా 'ఎల్‌వి'ని నియమించి..ఆయన సేవలను ఉపయోగించుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. కానీ...టీటీడీ ధార్మిక సంస్థలో పనిచేస్తే...ఒక్క ముఖ్యమంత్రికి తప్ప వేరే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. దీని వల్ల తాను కొత్త సమస్యలను ఎదుర్కోనని 'ఎల్‌వి' భావిస్తున్నారట. మొత్తం మీద..మళ్లీ 'ఎల్‌వి'ని టీటీడీ ఇఒగా నియమిస్తారని తెలుస్తోంది. 

(370)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ