WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒకే సామాజిక వర్గానికి 'ఆహార కమీషన్‌'ను చంద్రబాబు కట్టబెట్టేశారా...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సిఎంఒ అధికారులు వారు చెప్పిన మాటలను వారే పాటించడం లేదు. వారు చెప్పిన సూత్రాలు, మార్గదర్శకాలను వారే పాటించడం లేదని..కొందరి విషయంలో మార్గదర్శకాలు, సూత్రాలు గట్టిగా వర్తిస్తుండగా...మరి కొందరి విషయంలో మాత్రం వాటి గురించి నామ మాత్రంగానైనా పట్టించుకోవడం లేదు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఒకశాఖలోని కీలకమైన పోస్టులో నియమించవద్దు...అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్గతంగా అధికారులకు, మంత్రులకు ఇతర కీలక స్థానాల్లో పనిచేస్తున్నవారికి చెప్పిన మాట. సిఎంఓ వర్గాలు కూడా దీన్ని పాటించాలని ఆయన స్పష్టంగా చెప్పారు. కొందరి విషయంలో ఈ మార్గదర్శకాలను స్పష్టంగా పాటిస్తున్న అధికారులు, మరి కొందరి విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖ మంత్రిగా  సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తుండగా..ఆశాఖ డైరెక్టర్‌గా 'సోమిరెడ్డి' సామాజికవర్గానికి చెందిన ఐఎఎస్‌ అధికారి మురళీధర్‌రెడ్డిని నియమించారు. వ్యవసాయశాఖలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని నియమించడం సిఎంఒ అధికారులు పసిగట్టలేకపోయారు..ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఈ విషయంపై అప్పట్లో కొందరు మంత్రులు మాట్లాడుతూ తమ శాఖలో ఫలనా అధికారిని  నియమించాలని కోరితే...వారు మీ సామాజికవర్గానికి చెందిన వారు... నియమించడం సాధ్యం కాదు..అని సిఎంఒ వర్గాలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి...మరి వ్యవసాయశాఖలో ఎలా నియ మించారని ప్రశ్నిస్తే...సమాధానం లేదట. ఇది పాత సంగతి కాగా..తాజాగా...రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో ఇదే రీతిలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురిని నియమించి...మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎంఒ అధికారులు తాము చెప్పిన మార్గదర్శకాలను, సూత్రాలను తామే అధిగమించారు. రాష్ట్ర ఆహార కమీషన్‌ ఛైర్మన్‌గా మాజీమంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ను ముఖ్యమంత్రి గతంలో నియమించారు. ఆదే శాఖకు 'రాజశేఖర్‌' కార్యదర్శిగా ఉండగా...ఇప్పుడు రాష్ట్ర ఆహార కమీషన్‌ ఛైర్మన్‌ కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'రవిబాబు'ను నియమించి అంతా ఒకే సామాజికవర్గానికి అధికారాన్ని కట్టబెట్టారనే విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొని తెచ్చుకున్నారు.

  రాష్ట్ర ఆహార కమీషన్‌ ఛైర్మన్‌గా నియమించబడిన టిడిపి నేత 'జె.ఆర్‌.పుష్పరాజ్‌' తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పలువురి ముందు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఈ విషయం 'చంద్రబాబు'కు తెలిసినా..ఆయన పోనీ అని..ఛైర్మన్‌ పోస్టు ఇవ్వగా..ఇప్పుడు ఆయన సిఫార్సుతో 'రవిబాబు'కు కూడా అదేశాఖలో కార్యదర్శిహోదాను కట్టబెట్టారు. తనను దూషించిన, ఇతర విధంగా ఆరోపణలు చేసిన వారికే 'చంద్రబాబు' ప్రాధాన్యత ఇస్తున్నారనేమాట వినిపిస్తోంది. అంతే కాకుండా సర్వీసులో ఉన్నప్పుడు అసమర్థుడు, ఇతర అభియోగాలున్నాయని 'రవిబాబు'కు కలెక్టర్‌ పోస్టు ఇవ్వడానికి నిరాకరించిన 'చంద్రబాబు' రిటైర్‌ అయిన తరువాత ఆయనకు ప్రాధాన్యత కల పోస్టు ఇచ్చారు. 'రవిబాబు'కు కలెక్టర్‌ పోస్టు ఇప్పించాలని రాజకీయనాయకులు, పలువురు మంత్రులు  'చంద్రబాబు'ను కోరగా..'ఆయన గురించి మీకు తెలుసా..? ప్రస్తుతం నిర్వహిస్తున్న డైరెక్టర్‌ పోస్టు చాలు..దయచేసి సిఫార్సు చేయవద్దు..అంటూ అటువంటి వారిని గట్టిగా మందలించి పంపేశారు. మరి అప్పుడు మందలించిన 'చంద్రబాబే' ఇప్పుడు ఆయనకు ప్రాధాన్యత కల పోస్టు ఇప్పించడం గమనార్హం. 

  కాగా టిడిపి వర్గాలు మరో ఆస్తకరమైన విషయాన్ని చెబుతున్నాయి.  'రవిబాబు' టిడిపి వ్యతిరేకి అని ఆయన  2014 ఎన్నికలకు ముందు  కొందరు మీడియా వారితో మాట్లాడుతూ...'జగన్‌' ముఖ్యమంత్రి అవడం ఖాయం...'చంద్రబాబు' మళ్లీ హ్యాట్రిక్‌ పరాజిత నేతగా మిగులుతారు..? అంటూ యధేచ్చగా వై.ఎస్‌ కుటుంబంపై తన ప్రేమను చాటకున్నారు. అటువంటి 'రవిబాబు'ను ఇప్పుడు ఆహార కమీషన్‌ సభ్యకార్యదర్శిగా ఎలా నియమించారు..? ఆయన పేరును ఎవరు సిఫార్సు చేశారు..? ఆయన సమర్థుడా...? లేక నిజాయితీపరుడా..? అనే విషయాన్ని పక్కన పెడితే...టిడిపి వ్యతిరేకి, ముఖ్యమంత్రి వ్యతిరేకి.. 'చంద్రబాబు' సామాజికవర్గాన్ని ఉద్దేశిస్తూ కులపరమైన వ్యాఖ్యలు చేశారనే పేరు...కూడా ఆయనపై ఉంది. అంతే కాదు..స్వంత గ్రామంలో ఆయన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి విరాళాలు ఇచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. కాగా కీలకమైన ఈ పోస్టులో 'రవిబాబు'ను నియమించడానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పుల్లారావు, ఆహార కమీషన్‌ ఛైర్మన్‌ పుష్పరాజ్‌, శాఖ కమీషనర్‌ 'రాజశేఖర్‌'లు  సిఫార్సు చేయడమే కాక ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. టిడిపి నాయకుడైన 'పుష్పరాజ్‌' ఆ పార్టీకి వ్యతిరేకి అయిన 'రవిబాబు'కు సిఫార్సు చేయడం ఏమిటి..? 'చంద్రబాబు'ను టిడిపిని తిడితే మాకేమిటి సంబంధం...? అని మంత్రి పుల్లారావు, ఛైర్మన్‌ 'పుష్పరాజ్‌'లు భావించారేమో..? వ్యక్తిగత విమర్శలు, కులపరమైన ఆరోపణలు, ఇతరత్రా వేధింపులు, ఆరోపణలు ఉన్న 'రవిబాబు'ను ఆహార కమీషన్‌ కార్యదర్శిగా నియమించడం ఏమిటని..ఐఎఎస్‌ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఒకే కులానికి చెందిన వారికి అగ్రపీఠం వేయడం ఏమిటని బీసీ వర్గాలతో పాటు ఇతర వర్గాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో..ఎవరెవరిని ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారో..? తెలియదని... నిన్నా మొన్నటి వరకు పనికిమాలిన అధికారి అని పక్కన పెట్టిన 'రవిబాబు'నే ఇప్పుడు రిటైర్‌ అయిన తరువాత ప్రాధాన్యత కలిగిన పోస్టులో నియమించారంటే...ముఖ్యమంత్రి కొందరి ఒత్తిడికి లంగిపోయారని టిడిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

(670)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ