WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మేకపాటి' కుటుంబంతో 'ఆదాల' ఢీ...!

నెల్లూరు జిల్లాలో 'మేకపాటి', ఆదాల కుటుంబాల గురించి తెలియని వారు ఉండరు. 'మేకపాటి' సోదరుడైన 'శేఖర్‌రెడ్డి'కి 'ఆదాల' స్వయాన వియ్యంకుడు. అయినప్పటికీ 'చంద్రబాబు' ఆదేశాలతో సమీపబంధువైన మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి'పై పోటీ చేయబోతున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం పదివేల ఓట్లుతో ఓడిపోయిన 'ఆదాల' ఈ సారి యాభైవేల ఓట్ల మెజార్టీతో గెలవాలనే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. బంధుత్వాలు వేరు..రాజకీయాలు వేరు అన్నట్లు 'ఆదాల' దూసుకుపోతున్నారు. జిల్లాలో కొంత మంది నాయకులు పగలు విమర్శలు చేసుకుంటారు..రాత్రిపూట విందులు, వినోదాలకు వెళుతుంటారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి సోమిరెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డిలు కలసి విందులకు వెళుతుం టారనే పేరుంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన సోమిరెడ్డికి చివాట్లు పెట్టినట్లు తెలిసింది. బంధుత్వం ఉన్నా..పార్టీయే మిన్నాగా 'ఆదాల' మేకపాటిపై పోటీకి సిద్ధపడ్డారంటే...ఆయనకు పార్టీ పట్ల ఉన్న విధేయత అర్థం అవుతోంది. నెల్లూరులో నిన్నా మొన్నటి దాకా సులువుగా విజయం సాధిస్తామని వైకాపా నాయకులుభావించేవారు. కానీ గత పదిరోజుల్లో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. మున్సిపల్‌మంత్రి నారాయణ, ఆదాలలు లోక్‌సభలోని ద్వితీయ శ్రేణి నాయకులతో కలసి పనిచేస్తూ..వైకాపా నేతలను వణికిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని ఎమ్మెల్యేగా దించితే విజయం సాధిస్తారో..వారినే పోటీ చేయించాలని మంత్రినారాయణ, ఆదాలను చంద్రబాబు ఆదేశించడంతో సమర్థులైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. నెల్లూరు నుంచి 'నారాయణ' పోటీ చేయడం ఖాయం అవగా..కొవూరు ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికే మళ్లీ టిక్కెట్‌ ఇస్తారా..? లేదా..మరొకరికి ఇస్తారా..అనే విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, సమయం వచ్చినప్పుడు తానే నిర్ణయం తీసుకుంటానని..పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. 

  ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బల్లినేని కృష్ణయ్య, కొమ్మి లక్ష్మయ్యనాయుడులు త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదే నియోజకవర్గంలో 1985,89లో విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు 'బమ్మిరెడ్డి' టిడిపి గూటికి చేరబోతున్నారు. కావలి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌రావు పోటీ చేయడం ఖాయం. వైకాపాలో మూడు గ్రూపులు ఆరు తగాదాలు ఉన్న నేపథ్యంలో దానిని అనుకూలంగా మలచుకుని పార్టీ అభ్యర్థిని గెలిపించడమే కాకుండా ఎక్కువ మెజార్టీని సాధించాలని నాయకులందరికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా ఉదయగిరిలో తాజా ఎమ్మెల్యే రామారావు పోటీ చేస్తారా..? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా..అనే విషయం నాకు వదిలేయండి...అని చంద్రబాబు నాయకులకు చెప్పడంతో...ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. కందుకూరు నియోజకవర్గంలో తాజా ఎమ్మెల్యే పోతుల రామారావే మళ్లీ పోటీ చేయడం ఖాయం. మాజీ ఎమ్మెల్యే మహిందర్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయననే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు వై.ఎస్‌.జగన్‌. నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా తాను పోటీ చేసినా..మరొకరిని బరిలోకి దింపినా..గెలిపించే బాధ్యత తనదేనని..ఎమ్మెల్యే రామారావు చెబుతున్నారు. ఏడు నియోజకవర్గాల్లో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉన్న నాయకులను బరిలోకి దింపేందుకు మంత్రి నారాయణ, ఆదాలతో పాటు ఇతర ముఖ్యనాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నారు. దీంతో మళ్లీ ఎంపీగా 'మేకపాటి' పోటీ చేస్తారా..? లేదా...మరో నియోజకవర్గానికి తరలి వెళతారా..అనే విషయంపై వైకాపాలో చర్చ జరుగుతోంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే..తాట తీస్తా..అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం అందరూ పనిచేయాలి..ఎవరైనా వైకాపాతో కుమ్మక్కు అయితే...వారిని పార్టీ నుంచి తొలగిస్తానని..చంద్రబాబు హెచ్చరించడంతో నిన్నా మొన్నటి వరకు హడావుడి చేసిన మంత్రిసోమిరెడ్డి,ఎమ్మెల్సీ రవిచంద్రయాదవ్‌లు మౌన వత్రం పాటిస్తున్నారు. 'మేకపాటి'ని ఎదుర్కోనే టిడిపి నాయకుడు ఎవరు..? అంటే 'ఆదాల' రంగంలోకి దిగారు..ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి రాఘవరెడ్డి టిడిపిలో చేరేందుకు అంగీకరించారని, ఆయన ఏం కోరతారు..ఆయన కోరికలను 'చంద్రబాబు' నెరవేరుస్తారా..అనే దానిపై 'చంద్రబాబు' తుదినిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనా ఎంపీ సీటును అవలీలగా గెలుస్తామని భావించిన వైకాపా నేతలకు తాజాపరిస్థితులు మింగుడుపడడం లేదు. 'ఆనం' వర్గీయులు, నేదురుమల్లి వారసులను వైకాపాలో చేర్చుకున్నా..అది ఎంత వరకు లాభమో..ప్రస్తుతం చెప్పలేమని వారందరిని టిడిపిలో చేర్చుకుని కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్న చందంగా పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన వ్యూహం విజయవంతం అయింది. రెండు బలమైన కొండలను ఢీ కొడితే..ఎలా ఉంటదో...మేకపాటి, ఆదాల మళ్లీ పోటీ చేస్తే..అదే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్ములను నడిపిస్తున్నారు..ఆయన ఆదేశాలను పాటిస్తూ..సలహాలను తీసుకోవడం వలనే వైకాపా అభ్యర్థి 'మేకపాటి'కి భయం పుట్టిస్తున్నామని టిడిపి నాయకులు చెబుతున్నారు.

(1366)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ