WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పత్తిపాడు' టిడిపి అభ్యర్థిగా 'రామాంజనేయులు'...!

అనేక సంవత్సరాలు ఐఎఎస్‌ అధికారిగా వివిధ హోదాల్లో సమర్థవంతంగా బాధ్యతలునిర్వహించిన 'రామాంజనేయులు' సర్వీసు నుంచి రిటైర్‌ అయినప్పటికీ వచ్చే మార్చి వరకు ఆయన సర్వీసును పొడిగించిన విషయం విధితమే. ప్రస్తుతం ఆయన సమాచారశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామాంజనేయులను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలా..? లేక ఎమ్మెల్యేగా పోటీ చేయించాలా..? అనేదానిపై 'చంద్రబాబు' ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ..ఆయనను ఎన్నికల బరిలోకి దించడం ఖాయం. 2014లో పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన 'రావెల కిశోర్‌బాబు'పై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు 'చంద్రబాబు'. గుంటూరు కలెక్టర్‌గా పనిచేసిన 'రామాంజనేయులు'కు 'పత్తిపాడు నియోజకవర్గంపై పూర్తిగా అవగాహన ఉంది. కాంగ్రెస్‌ హయాంలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన 'రామాంజనేయులు' అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించారు. 

 ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి అనేక పనులను కూడా చక్కపెట్టారు. ఆ నాడు ఆయన చక్కపెట్టిన పనులే నేడు ఆయనను రాజకీయంగా ఆదుకోబోతున్నాయి. పత్తిపాడు నుంచి 'రావెల'కు తప్ప మరెవరికి ఇచ్చినా..మద్దతు ఇస్తాం..మీ ఇష్టం వచ్చిన వారిని పోటీలో దించండి..అని స్థానిక నేతలంతా..ఒక మాటగా చంద్రబాబుకు వారు తెలియజేశారు. 'రామాంజనేయులు' గుంటూరు జిల్లాకు చెందిన వారు కానప్పటికీ..ఆయన సర్వీసులో ఎక్కువ కాలం గుంటూరు జిల్లాతో పాటు..చుట్టుపక్కలే పనిచేయడం ఆయనకు కలసి రాబోతోంది. పత్తిపాడు నుంచి 'రామాంజనేయులు'ను బరిలోకి దించేందుకు 'చంద్రబాబు' అంగీకరిస్తారా..? లేక ఎంపీ అభ్యర్థిగా ఎక్కడ నుంచి అయినా ఎంపిక చేస్తారా..? అనే విషయం బయటపడడం లేదు. కానీ పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు 'రామాంజనేయులు'లు సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తన సేవలను ఎలా వినియోగించుకున్నా..అందుకు సిద్దమేనని...'రామాంజనేయులు' చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో పాటు..స్థానిక నేతలతో పరిచయాలు ఉండడం..రామాంజనే యులకు అదనంగా కలసి రావచ్చు. పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు పత్తిపాడు నియోజకవర్గంపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మాజీ మంత్రి రావెలను మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేయడం మాత్రం జరగదు. ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం..!

(455)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ