WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నేడు 'జగన్‌'ను కలవనున్న టిడిపి ఎమ్మెల్యే 'ఆమంచి'

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ నేడు వైకాపా అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిని లోటస్‌ పాండ్‌లో కలవబోతున్నారు. గత కొన్నాళ్లుగా టిడిపి అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆమంచి టిడిపికి గుడ్‌బై చెప్పబోతున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోతులకు, ఆమంచికి రాజీ చేయటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన సునీతను సమర్ధిస్తున్నారని నియోజకవర్గంలో ఆమె అన్ని వ్యవహరాలలో కలుగజేసుకుని ఇబ్బందుల పాలు చేస్తున్నారని, దీనిపై చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు పలుమార్లు విన్నవించినా వారు స్పందించటం లేదని 'ఆమంచి' ఆరోపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా కృష్ణమోహన్‌ పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కూడా కలిసినట్లు తెలుస్తుంది. పవన్‌ సామాజిక వర్గానికి చెందిన ఆమంచి జనసేనలో చేరటం లాంఛనమేనని జనసేన కార్యకర్తలు భావించారు. ఆయన అనూహ్యంగా నేడు జగన్‌ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 ఎన్నికలలో ఆయన నవోదయం పార్టీ తరపున పోటీ చేసి టిడిపి అభ్యర్ధిపై సంచలన విజయం సాధించారు. ఆ తరువాత ఆయన టిడిపిలో చేరి కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికలలో తనపై ఓడిపోయిన సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే కాకుండా నియోజకవర్గంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వటం, మళ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధిగా తానే పోటీ చేస్తానని సునీత చెపుతుండటం ఆమంచికి మింగుడు పడటం లేదు. దీంతో ఆయన టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. శుక్రవారం నాడు లోటస్‌పాండ్‌లో ఆయన జగన్‌ను కలుస్తారని తర్వాత పార్టీలో చేరతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఆమంచి టిడిపిని వీడడం టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్‌ అనే చెప్పాలి.

(1364)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ