WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గాలి' కుటుంబంలో చిచ్చుపెడుతోన్న 'కాంగ్రెస్‌' నేత...!?

మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకుడు స్వర్గీయ 'గాలి ముద్దుకృష్ణమనాయుడు' వారసత్వంపై ఆ కుటుంబంలో విభేదాలు పొడచూపాయి. 'గాలి' మరణించిన తరువాత...ఆయన ఇద్దరు కుమారులు..'గాలి' వారసత్వం కోసం రోడ్డున పడ్డారు. ఇద్దరు కుమారులూ రాజకీయాల్లో ఆసక్తి చూపిస్తుండడం, 'ముద్దు' వారసత్వంగా తమకే 'నగరి' సీటు ఇవ్వాలని ఇద్దరూ పోటీ పడడంతో...టిడిపి అధినేత మధ్యేమార్గంగా 'ముద్దు' సతీమణిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాత కూడా 'ముద్దు' కుమారులు ఇద్దరూ 'నగరి' సీటు తమకే ఇవ్వాలని కోరుతుండడంతో... 'చంద్రబాబు' వారిద్దరికి కాకుండా వేరే వారికి సీటు ఇవ్వాలని ఆలోచించారు. 'అశోక్‌రాజు', టిటిడి జెఇఒల్లో ఒకరిని 'నగరి' అభ్యర్థిగా నియమించబోతున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే...ఇటీవల నియోజకవర్గంలో..ఎవరు టిడిపి అభ్యర్థి అయితే...విజయం సాధించగలరని..అధినేత నిర్వహించిన సర్వేలో 'గాలి' కుటుంబ సభ్యులు అయితేనే ఇక్కడ విజయం సాధించగలరని తేలిందట. దీంతో..'చంద్రబాబు' మళ్లీ 'ముద్దు' కుటుంబ సభ్యులను పిలిపించుకోవాల్సి వచ్చింది. ఈ రోజు 'అమరావతి'లో ఆ కుటుంబ సభ్యులతో పాటు..సీటు ఆశిస్తున్న 'అశోక్‌రాజు' ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కూడా 'ముద్దు' కుటుంబంలో ఏకాభిప్రాయం రాలేదట. తమకే టిక్కెట్‌ ఇవ్వాలని 'ముద్దుకృష్ణమనాయుడు' కుమారులైన 'భానుప్రకాష్‌, జగదీష్‌లు మళ్లీ పోటీపడ్డారట. దీంతో..విసుగు చెందిన 'చంద్రబాబు' మరోసారి కుటుంబ సభ్యులందరూ కలసి కూర్చుని మాట్లాడుకుని..ఎవరో ఒకరి పేరు చెప్పాలని చెప్పి పంపించారట. అయితే...ఆయన చెప్పినట్లు..'ముద్దు' కుటుంబ సభ్యులు ఒకరి పేరు చెప్పే పరిస్థితి లేదని..ఇద్దరూ మొండి పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

  వాస్తవానికి నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో 'ముద్దుకృష్ణమనాయుడు' ఇద్దరు కుమారులు ప్రచారం నిర్వహించారు. వీరిలో...'భానుప్రకాష్‌' క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో..ఆయనే 'ముద్దు' వారసుడు అనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. అయితే...'ముద్దు' చిన్న కుమారుడు 'జగదీష్‌' కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉన్నారు. ఇన్నాళ్లూ వ్యాపారాలు నిర్వహిస్తూ..'నగరి'కి దూరంగా ఉన్న 'జగదీష్‌' ఇప్పుడు సీటు తనకే ఇవ్వాలని పట్టుపడుతున్నారట. నియోజకవర్గ ప్రజలతో మమేకమైన 'భానుప్రకాష్‌'ను కాదని..'జగదీష్‌'కు టిక్కెట్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యం పార్టీ అధిష్టానానికి లేదట. అయితే కుటుంబ సభ్యులను ఒప్పించి ఇస్తే బాగుటుందనే అభిప్రాయంతో..పార్టీ అధినేత 'చంద్రబాబు' ఈ కసరత్తు చేస్తున్నారు. కాగా...నియోజకవర్గానికి దూరంగా ఉన్న 'జగదీష్‌' పోటీపై అంత గట్టిగా పట్టుపట్టడం లేదట. ఆయన మామ 'సుబ్రహ్మణ్యం నాయుడు' సీటు తెచ్చుకోవాలని 'జగదీష్‌'పై ఒత్తిడి తెస్తున్నారు. కర్ణాటకకు చెందిన 'సుబ్రహ్మణ్యంనాయుడు' కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఇప్పుడు తన అల్లుడిని రాజకీయాల్లో క్రియాశీలకం చేయాలనే ఉద్దేశ్యంతో..ఆయన 'జగదీష్‌'పై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు ఆయనే కారణమని నియోజకవర్గంలోని టిడిపి నాయకులు చెబుతున్నారు. 'సుబ్రహ్మణ్యం' ఒత్తిడి లేకపోతే సీటు కోసం 'జగదీష్‌' అంత పట్టుపట్టరని..మామ ఒత్తిడితోనే తనకూ సీటు కావాలని ఆయన కోరుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద...ఈ కాంగ్రెస్‌ నేత వల్ల 'ముద్దు' కుటుంబంలో చిచ్చు రేగిందని..మరి టిడిపి అదినేత చంద్రబాబు ఆ చిచ్చును ఎలా ఆర్పుతారో చూడాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

(640)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ