WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఐటి సెగలు...!

గత నాలుగేళ్లల్లో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సీనియర్‌ నాయకుల్లో సగం మందికి పైగా వంద, రెండు,ఐదు,వెయ్యి కోట్ల వరకు ఆస్తులు సంపాదించారని సమయం వచ్చినప్పుడు వారి వివరాలను బయట పెడతామని గతంలో వైకాపా,బిజెపి నాయకులు విమర్శలు, ఆరోపణలు కురిపించిన విషయం విదితమే. అప్పట్లో వారి విమర్శలను లెక్కపెట్టని ముఖ్యులందరూ తాజాగా ఐటి శాఖపేరు చెబితేనే హడలిపోతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన కొన్ని జిల్లాల్లో అధికారపార్టీ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పేరుకే వ్యాపారాలని..అక్రమంగా సంపాదించి సొమ్ములే వందల కోట్లు ఉంటుందని...ఐటి శాఖ అధికారులకు ఉప్పుందించారు ప్రతిపక్షానికి చెందిన కొందరు నేతలు. ఇప్పటికే మున్సిపల్‌ మంత్రి నారాయణకు సంబంధించిన కాలేజీలపై దాడులు నిర్వహించారని ప్రచారం జరుగుతుండగా...అలాంటిదేమీ లేదని మంత్రి చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు..ఏయే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు..ఎవరితో వీరికి భాగస్వామ్యం ఉంది. వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్మెంత..? రాజకీయాలను అడ్డుపెట్టుకుని సంపాదించి సొమ్ము ఎక్కడ దాచారు..? వీరి బినామీలు ఎవరు..? అని బిజెపి నాయకులు ఆరా తీస్తుండడం గమనార్హం. 

  బిజెపి ఎంపి నర్సింహ్మారావు ఇదే విషయంపై ఆ పార్టీ నాయకులతో రహస్యంగా చర్చిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే...బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు భారీగా ఆస్తులు సంపాదించుకున్న విషయం అందరికీ తెలుసు. అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు..సంపాదించిన సొమ్ములు ఐటి శాఖ చేతికి దొరకుండా రకరకాల మార్గాలతో బయటకు చేరవేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేల ఆస్తులు వెయ్యికోట్లు పైగా మించి ఉంటాయి తప్ప...తక్కువ ఉండవని...ఆ పార్టీ నాయకులే అనేక సందర్బాల్లో ఆఫ్‌ ది రికార్డుగా చెబుతుంటారు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తాము రాజకీయాలను అడ్డంపెట్టుకుని సంపాదించిన సొమ్ముతో బెంగుళూరు, హైదరాబాద్‌, బంబాయి, పూనే తదితర నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని వైకాపా నాయకులు, బిజెపి నాయకులు ఆరోపణలు చేస్తూ త్వరలో ఆధారాలు చూపుతామన్నారు. విమర్శలు, ఆరోపణల వివరాలను ఐటి శాఖకు కేంద్ర నిఘా వర్గాలు అందజేశాయి. దీంతో అక్రమంగా సంపాదించిన మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి దినదిన గండంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే ఎటువంటి టెన్షన్‌ లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. సీనియర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఎక్కడ ఐటి శాఖ తమపై పడుతుందేమోనన్న భయంతో..ఇప్పటికే విలువైన ఆస్తులను తరలించారని ఐటిశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఐటి సెగ వ్యాపార వర్గాలకే కాదు.. పారిశ్రామికవేత్తలతో పాటు..మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా తాకాయి.

(316)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ