WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తాడికొండ 'కత్తెర'ను కట్‌చేసిన 'జగన్‌'...!

'తాడికొండ' వైకాపా అభ్యర్థిగా 'శ్రీదేవి'...!?

గుంటూరు జిల్లా వైకాపాలో మరో సంచలనం. నిన్నటి వరకు పలు నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్న వారిని తొలగిస్తూ..ఆ స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ ముందుకెళుతున్న ఆ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నేడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'తాడికొండ' ఇన్‌ఛార్జిగా ఉన్న 'కత్తెర హెనీ క్రిస్టినా'ను తొలగిస్తూ...ఆ స్థానంలో 'డాక్టర్‌ శ్రీదేవి'ని నియమించారని విశ్వసనీయంగా తెలిసింది. గత ఎన్నికల్లో 'క్రిస్టినా' తాడికొండ నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి శ్రావణ్‌కుమార్‌పై ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమెను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు. అయితే..ఇప్పుడు సొమ్ములు దండిగా పెట్టే మరో అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ముందుకు రావడంతో...'క్రిస్టినా'ను తొలగించి..ఆ స్థానంలో 'శ్రీదేవి'ని నియమించారని తెలుస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన 'తాడికొండ'లో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. జిల్లాలో ఇప్పటికే 'చిలకలూరిపేట, పెదకూరపాడు, గుంటూరు-2' నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా ఉన్నవారిని తొలగించి ఆ స్థానంలో సొమ్ములు దండిగా ఉన్నవారికి సీట్లు కట్టబెడుతున్నారని స్వంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. కాగా..తమను తొలగించడం అన్యాయమని...'కత్తెర' దంపతులు వాపోతున్నారట. పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాము పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని.. కానీ..తమకు చెప్పకుండానే 'జగన్‌'ను తమను తొలగించడం బాధ కల్గిస్తుందని..వారు చెబుతున్నారు. 

  ఈ రోజు విజయనగరంలో ఉన్న 'జగన్‌'ను వారి కలసినప్పుడు ఈ విషయం చెప్పారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే పలునియోజకవర్గ బాధ్యులను తప్పించిన 'జగన్‌' మరో నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో బాధ్యులుగా ఉన్నవారిని తొలగిస్తారని పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. వినుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న 'బల్లా బ్రహ్మనాయుడు'ను కూడా తొలగిస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రాకున్నా..వినుకొండ నుంచి ఒక డాక్టర్‌ పోటీకి సిద్ధమయ్యారని..ఆయనే అభ్యర్థి అవుతారని తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. కాగా..ప్రస్తుతం వైకాపా నుంచి గెలిచిన 'మంగళగిరి, గుంటూరు-1, బాపట్ల, నర్సరావుపేట ఎమ్మెల్యేలకు మళ్లీ సీటు ఇవ్వరని పార్టీకి చెందిన అత్యంత సీనియర్‌ నేత ఒకరు ఆఫ్‌ ది రికార్డుగా మీడియాతో పేర్కొన్నారు. వీరు కాక..మరి కొన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద...పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టనష్టాలను ఓర్చి పనిచేసిన వారిని కాదని కొత్తవారికి అవకాశం ఇవ్వడంపై...వారు మండిపడుతున్నారు. తమను వాడుకుని మోసం చేశారని ఆరోపిస్తూ...ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ..గెలిచే అభ్యర్థులకే అధినేత ప్రాధాన్యత ఇస్తారని..టిక్కెట్లు రాని వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తారని 'జగన్‌' సన్నిహితులు చెబుతున్నారు.

(1263)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ