WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

12మంది ఐఎఎస్‌లపై 'ఐటి' నజర్‌...!?

సచివాలయంలో వివిధహోదాల్లో పనిచేస్తోన్న నలుగురుశాఖాధిపతులు, నలుగురు కలెక్టర్లు, నలుగురు కమీషనర్లు, డైరెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా పనిచేస్తోన్న వారిపై ఐటిశాఖ దృష్టిసారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పైన చెప్పిన ఐఎఎస్‌ అధికారులు ఈ నాలుగేళ్లల్లో ఎంత సంపాదించారు..? వారి ఆస్తులు ఎక్కడ ఉన్నాయనే దానిపై ఐటి అధికారులకు వారి వ్యతిరేకులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇటీవల సర్వీసు నుంచి రిటైర్‌ అయిన ఒక ఐఎఎస్‌ అధికారి ఆస్తుల వివరాలను ఐటి అధికారులు సేకరించినట్లు తెలిసింది. వివిధ పనులు చేసి పెడతానని...ఆ అధికారి లక్షలాది రూపాయలను వసూలు చేశారని, కొంత మందికి మాత్రం పనిచేసి పెట్టి..మరి కొందరికి రిక్తహస్తం చూపెట్టారని..వీరిలో పనికాని వారు ఐటి అధికారులను కలసి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అధికారి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లో కొన్న ఆస్తుల గురించి వారికి వివరించినట్లు తెలిసింది. పంచాయితీరాజ్‌ మంత్రి నారాలోకేష్‌ ఒక ఐఎఎస్‌ అధికారిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతుంటారు..? అయితే ఆ అధికారి కొందరు మధ్యవర్తులను పెట్టుకుని ఎన్నో పనులు చక్కపెట్టారు. దీంతో మధ్యవర్తులు లక్షల రూపాయలను లంచాలుగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా తమ వద్ద సొమ్ములు తీసుకుని...పనులు చేయని ఈ అధికారిపై ఐటి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

  మరో ఐఎఎస్‌ అధికారి తన సిబ్బంది ద్వారా లక్షలువసూలు చేశారని, అలా వచ్చిన సొమ్ముతో ఎక్కడ ఏమి కొన్నారనే దానిపై ఐటి అధికారులకు ఉప్పంది. ముఖ్యంగా నలుగురు కలెక్టర్లు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో...బెంగుళూరు, హైదరాబాద్‌ల్లో ఆస్తులు కొనుగోలు చేశారని ఐటి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వానికి ఆదాయం సంపాదించేశాఖలో ఉన్న ఐఎఎస్‌ అధికారి రూ.10కోట్లతో ఇళ్లు నిర్మించుకున్నట్లు గతంలో ఒక పత్రిక ప్రచురించింది. ఆ అధికారిని బదిలీ చేయాలని సిఎం పలుసార్లు ప్రయత్నించినప్పటికీ..ఆర్థిక మంత్రి అడ్డుపడడంతో..ఆ ప్రతిపాదన నిలిచిపోయినట్లు బయటకు పొక్కింది. అదే విధంగా ముగ్గురు ఐఎఎస్‌ అధికారులు వివిధశాఖలకు కమీషనర్లుగా, డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలను కేంద్ర పెద్దలకు బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారట. అక్కడ నుంచి సానుకూలంగా స్పందన లభిస్తే..ఇక్కడ ఐఎఎస్‌ అధికారులపై ఐటి అధికారులు దాడులు చేస్తారని తెలుస్తోంది. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోన్న ఇద్దరు అధికారులపై ఫిర్యాదులు రాగా..వారిపై కూడా దాడి చేయాలని ఐటి అధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా సమాచారం వస్తోంది. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందా..? లేక యాదృచ్చకంగా జరుగుతుందా...?అనేది త్వరలో బయటకు రానుంది.

(1201)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ