WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి తీసుకున్న 'కోటి' గోవిందేనా...!?

ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తూ కోటి రూపాయలకు పైగా అడ్వాన్స్‌ రూపంలో తీసుకున్నారని బయటకు పొక్కడం, ఆ విషయం ప్రభుత్వ దృష్టికి సంబంధించిన అధికారులు తీసుకెళ్లడంతో..చాలా రోజుల తరువాత ఆయనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాకుండా ఆ సంస్థల్లో ఇద్దరు ముగ్గురు కిందిస్థాయి అధికారులతో వివిధ కారణాలతో అడ్వాన్స్‌ల రూపంలో సంస్థ ఉన్నతాధికారికి ఆ ముగ్గురు అందజేశారని..చివరకు ఆ సొమ్మును ఆయన చెల్లించకపోవడంతో..ఈ ముగ్గురు అధికారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అధికారి..ఏ సంస్థలో పనిచేసినా...అనేక వివాదాల్లో ఇరుక్కు పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్‌ రూపంలో కోటి రూపాయలను తీసుకుని తిరిగి ఆ సొమ్మును సంస్థను చెల్లించలేదు. తరువాత సంస్థ ఎండిగా నియ మితులైన ఉన్నతాధికారి ప్రభుత్వ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. ముగ్గురు జనరల్‌ మేనేజర్లకు ముప్పయి లక్షలు అడ్వాన్స్‌ రూపంలో తీసుకున్నారు..కానీ..వారు తామా సొమ్మును ఎండికి ఇచ్చామని చెబుతున్నారు. అయితే ఈ సొమ్ముతో తనకు సంబంధం లేదని..తాను అడ్వాన్స్‌ సొమ్ము తీసుకోలేదు..ఆ ముగ్గురు అధికారులు ముప్పయి లక్షలు తీసుకున్న విషయం తనకు తెలియదు..అని 'సుకుమార్‌' ప్రభుత్వానికి వివరణ ఇచ్చినట్లు బయటకు పొక్కింది. దీంతో వ్యవహారాన్ని తెలుసుకుని వాస్తవాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిగా ఎవరిని నియమిస్తారు..? వారు ఏ నివేదిక ఇస్తారో..అన్నది పక్కన పెడితే...ముప్పయి లక్షలు సొమ్ములు పోగొట్టుకున్నవారు...విచారణ ముందుకు వస్తారా..? లేదా అన్నది అనుమానంగా ఉంది. మూడేళ్లపాటు నిరాటకంగా..సంస్థల్లో దోపిడీ జరుగుతుంటే...కళ్లుండి గుడ్డి వానివలే అప్పటి మంత్రి 'పుల్లారావు'తో సహా ముఖ్య అధికారులెవరూ పట్టించుకోలేదు. 

 సిఎంఒ అధికారులకు విషయం తెలిసినా తెలియనట్లే వ్యవహరించారు. ఆగస్టు మాసంలో 'సుకుమార్‌' సర్వీసు నుంచి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ప్రభుత్వం చెల్లించాల్సిన పిఎఫ్‌, గ్రాట్యుడీ, ఇతర చెల్లింపులను ఆపివేసింది. పెన్షన్‌లో 75శాతం మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఆడిట్‌ నివేదిక ప్రకారం గిడ్డంగుల సంస్థల్లో అయిదారు కోట్లు దుర్వినియోగం అయ్యాయని..బయటపడడం..ఆ నివేదికను సంబంధించిన అధికారులకు ప్రభుత్వం నివేదించడం జరిగింది. ఈ విషయాలన్ని ప్రస్తుత శాఖాధిపతి రాజశేఖర్‌కు కూడా తెలుసు. ఆయన దృష్టికి వచ్చిన విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని పలువురు చెబుతున్నప్పటికీ తప్పులు అక్కడ జరిగాయా..? లేక ఇక్కడ జరిగాయా..?అన్న విషయాన్ని పరిశీలిస్తే..రెండో రెండూ అన్నట్లే కనిపిస్తుంది. తీసుకున్న సొమ్ములపై విచారణ జరుపుతారా..? లేక ఆడిట్‌లో వచ్చిన లోపాలపై దర్యాప్తు చేస్తారా..? గత సంవత్సరం నుంచి అడ్వాన్స్‌ల వ్యవహారం బయటకు వచ్చినా..బాధ్యత కల అధికారులెవరూ స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. గిడ్డంగుల సంస్థ ఎండిగా 'సుకుమార్‌' బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రిగా పుల్లారావు ఉన్నారు. ఆయన దృష్టికి కూడా ఈ విషయం వచ్చినా..తాను చెప్పిన పనులు చేస్తున్నారు..మిగతా విషయాలు తనకెందుకు అని ప్రేక్షక పాత్ర వహించి అప్రదిష్టపాలయ్యారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయం తెలియడంతో..ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి...సుకుమార్‌ను బదిలీ చేయించారు. అప్పటి వరకు మాజీ సిఎస్‌లు, శాఖాధిపతులు, సిఎంఒ కార్యాలయ అధికారులు ఎందుకు స్పందించలేదనేది వారు చెప్పాలి. అడ్వాన్స్‌ రూపంలో కోట్లు దండుకుని..తనకేమీ తెలియదని..సంబంధిత అధికారి తెలియజేస్తే..ఆధారాలున్నా..అటు మంత్రులు, ఇటుశాఖాధిపతులు ప్రేక్షక పాత్రను పోషించారనే తప్ప..సకాలంలో స్పందిం చాలన్న జ్ఞానం లేదు. ఇప్పుడు ఆయన రిటైర్‌ అయిన తరువాత నామ మాత్ర చర్యలతో సరిపెట్టాలని భావిస్తున్నారు. బాధ్యత కలవారందరూ మొహం చాటేశారు. బాధితులు లక్షల సొమ్ములను అప్పు చేసి కట్టి లబోదిబో అంటున్నారు. సుకుమార్‌పై విచారణ జరిగేదెన్నడు..? నివేదిక ప్రభుత్వానికి అందేదెప్పుడు..? ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరిగేవి కాదన్నది యధార్థం.

(327)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ