WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ఐఎఎస్‌ అధికారికి నెలకు రూ.50లక్షలు ముడుపులు ముడుతున్నాయా..!?

ప్రభుత్వానికి ఆదాయవనరుల చేకూర్చేశాఖకు ముఖ్య అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారికి నెలకు40 నుంచి 50 లక్షల రూపాయలు ముడుపులు ముడుతున్నాయని ఒక స్వచ్చంధ సంస్థ పాటు, ఆశాఖలో పనిచేస్తోన్న క్రిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు ఆ అధికారి తీసుకున్న నిర్ణయాలతో సహా సిఎంఒ కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కొంత మంది మధ్యవర్తుల ద్వారా ఐఎఎస్‌ అధికారికి ముడుపులు అందుతున్నాయని ఆ శాఖలో పనిచేసే అధికారులందరికీ తెలుసు. ఆధారాలతో సిఎంఒకు ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న మధ్యవర్తులు..అక్కడ పనిచేస్తున్న క్రిందిస్థాయి అధికారితో ఆ ఫిర్యాదును చించి వేయించినట్లు తెలిసింది. ఈశాఖలో ఎప్పటి నుంచో పనిచేస్తోన్న అధికారిని బదిలీ చేయకుండా...ఆశాఖ మంత్రి అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైకాపా నేత అత్యంత అవినీతిపరుడు,50వేల కోట్లు రూపాయల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అప్పుడప్పుడు విమర్శలు, ఆరోపణలు చేసే ఆ మంత్రి తన శాఖలో పనిచేసే అధికారి అవినీతిని ఎందుకు సమర్థిస్తున్నాడు...? స్వామి కార్యంతో పాటు, స్వకార్యాలను కూడా ఆ అధికారి నెరవేరుస్తున్నాడని మంత్రికి కూడా తెలుసు. తాము పూర్తి ఆధారాలతో సిఎంఒ అధికారికి ఫిర్యాదు చేస్తే...దాన్ని చెత్తబుట్టలో వేయడాన్ని తెలుసుకున్న ఫిర్యాదు దారులు సచివాలయంలో ఆశాఖాధిపతికి ఇటీవలే ఫిర్యాదు చేశారు. స్వయంగా కలసి అధికారి చేతికి ఇచ్చారా..? అత్యంత రహస్యం అంటూ కవర్‌పై రాసి పోస్టు చేశారా..? లేక మరెవరి చేతికి అయినా ఇచ్చి పంపారా..? అనే విషయం బయటపడడం లేదు. ఇప్పటికే ఈ అధికారి సుమారు రూ.20కోట్లకు పైగా అక్రమార్జన చేశారని ఫిర్యాదుదారులు మీడియా వర్గాలకు కూడా ఉప్పుందించారు. శాఖాధిపతి పట్టించుకుంటారో..లేదో తెలియదు...ఆశాఖ మంత్రి సంపూర్ణ మద్దతు ఈ అధికారికి ఉంది. సిఎంఒ అధికారులు కూడా ఈ అధికారికి తోడ్పటుతున్నారు...? ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి..? ఈ అధికారిపై ఎవరు చర్య తీసుకుంటారు..? నిత్యం నిజాయితీని వల్లించే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ఫిర్యాదుదారులు, స్వచ్చంధ సేవా సంస్థ ప్రతినిధులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ అధికారి అవినీతి బాగోతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలుసు. ఆ అధికారిని బదిలీ చేద్దామని నిర్ణయం తీసుకునే సమయంలో, ఆ అధికారికి మద్దతు ఇస్తోన్న ఆశాఖ మంత్రి అడ్డుపడుతూనే ఉన్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా...ఇంటిలిజెన్స్‌ వర్గాలు నిద్రపోతున్నాయా..? ఏసీబీ అధికారులు ఏమి చేస్తున్నారు..? ఏ అధికారి ఎన్నికోట్లు తింటే తనకెందుకు..? తన పనులు జరుగుతున్నాయా..?అని ఆ శాఖ మంత్రి సరిపెట్టుకుంటున్నారా..? ఆ అధికారిని బదిలీ చేస్తే...మంత్రిని బాధపెట్టినట్లు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం మానివేశారా..? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పేదెవరు..? ఆ అవినీతి అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం కనుచూపుమేరలో లేదు. ఇదుగో..ఆ అధికారిని బదిలీ చేస్తున్నాం..అని సిఎంఒ అధికారులు లీకులు ఇస్తున్నా..అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి జరగనున్న బదిలీల్లో ఈ అవినీతి ఐఎఎస్‌ అధికారి స్థానభ్రంశం తప్పదని..ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజం అవుతుందో...? లేక ఆశాఖ మంత్రి వత్తిడిలు పనిచేస్తాయో..ముఖ్యమంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకుంటారో..లేదో అన్న విషయం త్వరలో బయటపడనుంది.

(290)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ