లేటెస్ట్

ఎమ్మెల్యేను లాగేస్తే...రైతుల ఉద్యమం ఆగుతుందా...?

రాజధాని మార్పుపై అధికారపార్టీ శరవేగంగా అడుగులు వేస్తుండగా...దానిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు తమ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక వైపు రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావం తెలుపుతూ వారి ఆందోళనకు మద్దతు ఇస్తోన్న ప్రతిపక్షాలను చిందరవందర చేయడానికి, బలహీనపర్చడానికి అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చిన తరువాత..అధికారపార్టీ కొద్దిగా నెమ్మదించింది. రైతుల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం కాకుండా చర్యలు తీసుకుంటూనే...వారి ఉద్యమానికి మద్దతు ఇస్తోన్న టిడిపిని బలహీన పర్చేందుకు పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని బలహీనపరిస్తే...మిగతా పక్షాలు సర్దుకుంటాయనే ధోరణి అధికార పార్టీలో కనిపిస్తోంది. దీంతో..ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వల విసురుతోంది. ఇప్పటికే గన్నవరం శాసనసభ్యుడు 'వల్లభనేని వంశీ'ని తమ వైపు తిప్పుకున్న అధికార పార్టీ తాజాగా గుంటూరు-2 ఎమ్మెల్యే మద్దాల గిరిని కూడా ఆకట్టుకుంది. ఆయనను పార్టీలో చేర్చుకోకున్నా..ప్రత్యేకంగా గుర్తించి..టిడిపికి దూరం చేసి..ఆ పార్టీని బలహీన పరచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిని లాగేసిన 'వైకాపా' నాయకులు మరో నలుగురిపై గురి పెట్టి వారిని లాగేస్తే..'చంద్రబాబు'కు ప్రతిపక్షహోదా పోతుందని, తద్వారా 'చంద్రబాబు'పై మానసికంగా పైచేయి సాధించినట్లు అవుతుందనే భావనతో ఉంది. 

ఉధృతంగా రైతుల ఉద్యమం సాగుతున్న సమయంలో రాజధాని ప్రాంత ఎమ్మెల్యేను ప్రతిపక్షపార్టీకి దూరం చేయడం ద్వారా, అతని ద్వారా విమర్శలు చేయించడం ద్వారా..రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తోన్న ఉద్యమానికి మద్దతు లేదని ప్రపంచానికి చాటాలనే అభిప్రాయంతో అధికారపార్టీ ఎత్తులు వేస్తోంది. రైతులు భారీగా ఉద్యమిస్తున్నారన్న చోటే..వారికి మద్దతు ఇస్తోన్న పార్టీకి చెందిన శాసనసభ్యుడు పార్టీ ఫిరాయిస్తున్నాడంటే...వారి ఉద్యమానికి ప్రజల మద్దతు లేదని చెప్పడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు స్వచ్చంధంగా రావడం లేదని, వారంతా ఎవరో ఆడిస్తే ఆడుతున్న వారని ఇప్పటికే అధికారపార్టీ ఎదురుదాడి చేస్తూ..తాను తీసుకున్న చర్యలను సమర్థించుకుంటోంది. తాజాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఆకర్షించడం ద్వారా..తమ చర్యలకు ప్రజల మద్దతు ఉందని ప్రపంచానికి చాటాలని భావిస్తోంది. అయితే...ప్రతిపక్ష ఎమ్మెల్యేలు...అధికార పార్టీకి మద్దతు ఇస్తే..రైతుల ఉద్యమం ఆగుతుందా..? తమకు జరిగిన అన్యాయం గురించి రోడ్లెక్కిన వారు..ప్రతిపక్ష ఎమ్మెల్యే పార్టీ మారితే..పోరాటాన్ని ఆపుతారా..?ఎటువంటి పరిస్థితుల్లో అలా జరిగే ప్రసక్తేలేదు. కేవలం రైతు ఉద్యమాన్ని బలహీనపర్చడానికి, ప్రతిపక్షాల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే అధికార పార్టీ మళ్లీ ఫిరాయింపులకు గేట్లు ఎత్తిందనేది అక్షరసత్యం. ఎమ్మెల్యేను లాగేస్తే...ఆ ఎమ్మెల్యేకి లాభమేమో..కానీ...రైతుల ఉద్యమం మాత్రం ఆగదు..ప్రజారాజధాని కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమైన వారిని ఇలాంటి ఎత్తుగడలు ఆపలేవు. 

(517)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ