WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజకీయ భవిష్యత్‌ కోసమే 'జనసేన'లోకి 'నాదెండ్ల'...!?

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు తనయుడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ వైకాపాలో చేరతారని ప్రచారం జరిగినప్పుడు ఆయన కొట్టిపారేశారు..ఖండించారు..కాంగ్రెస్‌తోనే తన కుటుంబం ఉంటుందని...రాహుల్‌గాంధీని బలపరచాలని కోరిన కొద్ది నెలలకే ప్లేట్‌ ఫిరాయించి...'జనసేన' పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాదెండ్ల కుటుంబం ఏనాడో హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకుంది. అప్పుడప్పుడు రాకపోకలే తప్ప...2014 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత 'నాదెండ్లమనోహర్‌' రాజధానికే పరిమితం అయ్యారు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా 'మనోహర్‌'కు పేరుంది. ఆయన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తాను ఇక్కడే పుట్టిపెరిగానని..విద్యాబ్యాసమంతా ఇక్కడే జరిగిందని..తెలంగాణలో జన్మించిన వారు హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఎన్నికల్లో పోటీ చేయడం లేదా..? తనకు కూడా అదే విధంగా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన 'రాహుల్‌'ను కోరినట్లు తెలిసింది. కానీ తెలంగాణ నాయకులకు మనోహర్‌కు సీటు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. పైగా 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడానికి కాంగ్రెస్‌ నాయకులకు సుతారం ఇష్టపడలేదు. స్థానికేతరుడైన 'మనోహర్‌'కు ఎలా టిక్కెట్‌ ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. 

  గతంలో ఆయన కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం ప్రచురించినప్పుడు...ఆయన దానిని ఖండించలేదు..అలా అని చెప్పి...తన మనోభిష్టాన్ని బయటపెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కూకట్‌పల్లి టిక్కెట్‌ దక్కదు..తెనాలిలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాదు. రాజకీయంగా తెరమరుగు అయ్యేకన్నా..'జనసేన' పార్టీలో చేరితే..సామాజికవర్గానికి పెద్దపీట వేస్తారని మనోహర్‌ నమ్మకం. మరో ఆరు నెలల్లో ఎపిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటికి వైకాపాతో 'జనసేన'కు పొత్తు కుదిరితే తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించవచ్చుననే నమ్మకంతో 'మనోహర్‌' ఉన్నారు. మనోహర్‌ తప్పటడుగు వేయబోతున్నారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెనాలి నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించి స్పీకర్‌ పదవి నిర్వహించి మూడోసారి పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. భవిష్యత్‌లో ఎపిలో కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని...మనోహర్‌కు తెలుసు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన 'జనసేన'లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పవన్‌ కూడా మనోహర్‌ వంటి నాయకుల అవసరం ఎంతో ఉంది. ఇంత వరకు కమ్మ సామాజికవర్గంలోని ముఖ్యనాయకులెవరూ 'జనసేన'లో చేరలేదు. నాదెండ్ల చేరితే ఆయనను అనేక మంది ఆయన సామాజికవర్గ నాయకులు..అనుసరిస్తారనేది 'పవన్‌' నమ్మకం.

(203)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ