WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎపిలో పంచాయితీ ఎన్నికలు తప్పవా..!?

పంచాయితీ సర్పంచ్‌ల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారులను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాయి. దీనిపై రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు హైకోర్టులో రిట్‌ దాఖలు చేసిన విషయం విదితమే. పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల నియామకం చెల్లదని, మూడు నెలలోపు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని గురువారం నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే తీర్పు ఎపికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కొందరు, అసెంబ్లీ ఎన్నికల తరువాత నిర్వహించాలని మరి కొందరు చంద్రబాబును కోరినా...ఆయన అసెంబ్లీ ఎన్నికలు తరువాత జరిపించాలని భావించి ప్రత్యేకాధికారులను నియమించారు. వాస్తవానికి పంచాయితీ ఎన్నికలు జరిగితే...వైకాపాకు చెందిన నాయకుల్లో చీలిక రావడం ఖాయం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లోని 'రెడ్డి' సామాజికవర్గ ఓటర్లలో చీలిక రావాలంటే పంచాయితీ ఎన్నికలను జరిపితేనే సాధ్యమవుతుంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లందరూ 'జనసేన' వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు జరిగితే..ఆ సామాజికవర్గంలో చీలిక అనివార్యం అవుతుంది. టిడిపికి 'కమ్మ' బిసీల మద్దతు ఉంది. అంతే కానీ..'జగన్‌' బలపరుస్తున్న 'రెడ్డి' సామాజికవర్గ మద్దతు వలే...టిడిపికి అటువంటి మద్దతు లేదు. మెజార్టీ ఓటర్ల మద్దతు వేరు..? కంచుకోటలను బద్దలు కొట్టడంవేరు. హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలమా..? ప్రతికూలమా..?అనేది పక్కన పెడితే..ఇదే తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు వర్తింప చేస్తే...టిడిపికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ తమ నెత్తిన ఆర్థిక భారం పడుతుందని దురుద్దేశ్యంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక పథకం ప్రకారం పంచాయితీ ఎన్నికలు జరగకుండా చంద్రబాబును తప్పుదోవపట్టించారనే అభిప్రాయం టిడిపి నాయకుల్లో ఉంది. తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు మూడు నెలల్లో జరపాలని..హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అదే తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉంది. దీనిపై సుప్రీంకోర్టులో స్టే లభించకపోతే పరిస్థితి ఏమిటి..? ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవుల్లో కొనసాగవచ్చు...పంచాయితీ సర్పంచ్‌లు పదవుల్లో కొనసాగడానికి అభ్యంతరం ఏమిటని..హైకోర్టు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని హైకోర్టు చెప్పవచ్చు. ఇదే జరిగితే పంచాయితీ ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకోక తప్పదు.

(243)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ