WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఏపియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 'చందు జనార్థన్‌' ఎన్నిక...!

ఏపీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ జర్నలిస్టు 'చందు జనార్థన్‌' ఎన్నికయ్యారు.సీనియర్‌ జర్నలిస్టుగా అందరికీ సుపరిచితుడైన 'చందు జనార్ధన్‌' 2005 సంవత్సరం నుంచి మొన్నటి వరకు రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ మీడియా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. వివిధ పత్రికల్లో, వివిధ హోదాల్లో  'జనార్ధన్‌' పనిచేశారు. అంతే కాకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేసి..వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యుజెలో కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  కర్నూలు జిల్లా నంద్యాలలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఏపీయుడబ్ల్యుజె రాష్ట్ర 35వ మహాసభల్లో నూతన అధ్యక్షునిచే పదవీ ప్రమాణస్వీకారం, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గతంలోనే అధ్యక్షునిగా ఎన్నికైన ఐ.వి.సుబ్బారావు చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 'చందు జనార్థన్‌', కోశాధికారిగా ఎ.వి.శ్రీనివాసరావులు ఎన్నిక కాగా..ఉపాధ్యక్షులుగా 'మచ్చా రామలింగారెడ్డి, పసుపులేటి రాము, మాణిక్యాలరావు,కె.జయరాజులు ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ఎన్‌.శ్రీరామమూర్తి, జయప్రకాష్‌, అక్కుళప్ప, రామసుబ్బారెడ్డి, శివప్రసాద్‌, కార్యవర్గ సభ్యులుగా చావా రవి, యు.వెంకట్రావు, ఈశ్వరరావు, కె.పాపారావు, అచ్యుతరావు, చంద్రమోహన్‌, రాంబాబు,వాసపల్లి సుబ్బారావు, మోహన్‌రావు,భక్తవత్సలరావు, సురేష్‌,నాగసాయి,రవి, ప్రసాదు, శ్రీనివాస్‌,ఎన్‌.జయరాములు, టి.లక్ష్మణరావు, వి.ఎస్‌.ఎస్‌.రామాంజనేయులులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  60 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన ఏపియుడబ్ల్యుజె 35వ రాష్ట్ర మహాసభలు అత్యంత కోలాహల వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా  నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మొత్తం 9వేల మంది సభ్యులు కల సంఘంలో 136 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఐజెయు అగ్రనేత కె.శ్రీనివాసరెడ్డి, ఐజెయు అధ్యక్షులు దేవులపల్లి అమర్‌లు ముఖ్య అతిధులుగా హాజరవగా, ఆలపాటి సురేష్‌, డి.సోమసుందర్‌, అంబటి ఆంజనేయులు ఎన్నికల పరిశీలకులుగా,శ్రీనివాస్‌ ఎన్నికల అధికారిగా పనిచేశారు. కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌ ప్రకటించారు.

జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: చందు జనార్ధన్‌

నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన 'చందు జనార్ధన్‌' ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన ఏపీయుడబ్ల్యుజె జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడిందని...అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ఆధ్వర్యంలో తామంతా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాడుతామని తెలిపారు. తమపై నమ్ముకం ఉంచి..తమను ఎన్నుకున్న సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలుపుతున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీయుడబ్ల్యుజె చాలా కృషి చేసిందని, జర్నలిస్టుల ఇళ్లను ఒక కొలిక్కి తేవడంలో ఏపీయుడబ్ల్యుజె చేసిన కృషి అందరికీ తెలిసిందేనని అన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి తెచ్చిన చట్టం అమలు చేయడానికి కృషి చేస్తామని, అదే విధంగా ఇతర సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు. చిన్న పత్రికల సమస్యలు, అక్రిడిటేషన్‌, బస్సు పాస్‌లు, ఇన్సూరెన్స్‌, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించడానికి తాము శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు.

(258)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ