లేటెస్ట్

రెండు రోజుల్లో రాజధాని భూస్కామ్‌పై సీబీఐ విచారణ

చంద్రబాబు, లోకేష్‌తో కలిపి 21మందిపై కేసులు
ఆరుగురు మాజీ మంత్రులపై విచారణ
పిఏసీ ఛైర్మన్‌ పయ్యావులపై కూడా...!

వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెబుతోన్న రాజధాని భూస్కామ్‌పై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి ప్రధాన కారణం రాజధానిలో జరిగిన ఇన్‌సైడ్‌ ట్రేడింగే కారణమని చెబుతోన్న ప్రభుత్వ పెద్దలు..అలా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసిన వారిపై సీబీఐతో విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు సమాచారం. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 'రాజధాని'గా అమరావతిని గుర్తించడం వెనుకే కుట్ర జరిగిందని, ఆయన సన్నిహితులకు ముందే రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో లీక్‌ చేసి..వారితో భారీగా భూములు కొనిపించి లాభపడ్డారని ప్రభుత్వ పెద్దలు ముందు నుంచి ఆరోపిస్తున్నారు. తాము అటువంటి చర్యలకు పాల్పడలేదని, ప్రతిపక్ష టిడిపి నాయకులు పలుసార్లు చెప్పినా...వారి మాటలను పట్టించుకోకుండా దీనిపై విచారణ చేయిస్తామని మంత్రులు చెబుతున్నారు. ఇన్‌సైడ్‌ ట్రేటింగ్‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయని, వాటితో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. తాము ఎటువంటి తప్పులు చేయలేదని, తమపై సీబీఐ లేదా సీఐడి లేదా మీ ఇష్టం వచ్చిన వారితో దర్యాప్తు చేయించుకోవచ్చుని ప్రతిపక్షనేత 'చంద్రబాబునాయుడు' సవాల్‌ విసరడం, ప్రస్తుతం రాజధాని తరలింపుపై రైతులు భారీగా ఉద్యమిస్తుండడంతో..తాము గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి రాజధాని భూములపై సీబీఐ విచారణ కోరాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజధాని తరలింపు సందర్భంగా రైతులు చేస్తోన్న ఆందోళనలో పాల్గొంటున్న పలుపార్టీలకు చెందిన నాయకులు ఎవరైతే రాజధానిలో అక్రమాలకు పాల్పడ్డారో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఏదో ఒక విచారణ జరిపించాల్సిన పరిస్థితి నెలకొంది. 

21మందిపై కేసులు

రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలతో ఇప్పుడు రాజధాని ప్రాంతంలో తాము చెబుతున్నట్లు జరిగిన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ప్రభుత్వం సీబీఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయబోతోంది. 4వేల ఎకరాల్లో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, దీని వెనుక టిడిపికి చెందిన వారు ఉన్నారని ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వస్తోన్న వార్తల ప్రకారం సీబీఐ విచారణ కోరితే దానిలో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు'ను చేర్చే అవకాశం ఉంది. ఆయనతో పాటు మాజీ మంత్రులు 'నారా లోకేష్‌, పరిటాల సునీత, పొంగులేటి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు (ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు) పల్లె రఘునాధరెడ్డిలపై విచారణ చేయించనున్నారు. కీ.శే. మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ను కూడా దీనిలో చేర్చనున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 'పీఏసీ' ఛైర్మన్‌ 'పయ్యావుల కేశవ్‌'పై కూడా విచారణ జరిపిస్తారని వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు 'జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌, ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌లతో పాటు మాజీ ఎంపి, సినీనటుడు మురళీమోహన్‌, లింగమనేని రమేష్‌, లంకా దినకర్‌ (ఈయన ఇప్పుడు బిజెపిలో ఉన్నారు) కంభంపాటి రామ్మోహన్‌రావు (రాజ్యసభ సభ్యుడు, బిజెపి), మాజీ టీటీడీ ఛైర్మన్‌ పుత్తా సుధాకర్‌ యాదవ్‌, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే 'గోరంట్ల బుచ్చయ్య చౌదరి', యలమంచలి శివలింగ ప్రసాద్‌ (సుజనాచౌదరి సోదరుడు) విబిసి ఫెర్టిలైజర్స్‌ సంస్థలపై విచారణ చేయిస్తారని తెలుస్తోంది. వీరంతా కలిపి దాదాపు 4వేల ఎకరాల ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారని దీనిపై విచారణ చేయాలని సీబీఐను ప్రభుత్వం కోరవచ్చు. రాజధాని కోసం చేసిన ల్యాండ్‌పూలింగ్‌, రాజధాని ప్రాంతం నిర్ణయించడంలో కుట్ర, సీఆర్‌డిఎ పరిధి నిర్ణయాలు తదితర అంశాలపై సీబీఐతో విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఐ లేదా సీఐడి విచారణ కోసం మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద..రాజధాని తరిలించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో తాము చేసిన ఆరోపణలపై విచారణ కోరడం ద్వారా...అక్కడ అక్రమాలు జరిగాయని ప్రచారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. 

(996)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ