లేటెస్ట్

ఏడాది చివరి రోజున రహస్య జీవోల వెల్లువ...!

తమ ప్రభుత్వం అంతా పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ప్రజలకు అన్నీ చెప్పే చేస్తుందని పదే పదే చెప్పే అధికారపార్టీ పెద్దలు ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఏడు మాసాల్లో పాలనాంశాలను వైకాపా ప్రభుత్వం అత్యంత రహస్యాన్ని పాటిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో పలు రహస్య జీవోలను విడుదల చేసిన ప్రభుత్వం 2019 ఆఖరి రోజున దాదాపు 77 రహస్య జీవోలను విడుదల చేసింది. పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖల్లో 33 రహస్య జీవోలను మంగళవారం నాడు విడుదల చేశారు. అదే విధంగా మున్సిపల్‌ మరియు పట్టణాభివృద్ధిశాఖల్లో 40 కాన్ఫిడెన్షియల్‌ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి కాకుండా రెవిన్యూలో ఒకటి, ఫైనాన్స్‌లో రెండు, మహిళా,శిశు సంక్షేమశాఖల్లో మరో జీవోను ఈ రోజే విడుదల చేసింది. పాలనలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెబుతోన్న ప్రభుత్వం ఒకే రోజు ఇన్ని రహస్య జీవోలను విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. 'జగన్‌' ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో దాదాపు 120కి పైగా రహస్య జీవోలను విడుదల చేసింది. గతంలో టిడిపి ప్రభుత్వం 700కు పైగా రహస్య జీవోలు ఇచ్చిందని, పాలనలో రహస్యాలు పాటిస్తూ దోచుకున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం టిడిపిని మించి రహస్య జీవోలనువిడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఏడాది ఆఖరులో ఒకేసారి అన్ని జీవోలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన రహస్య జీవోల్లో విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తూ తీసుకోవాల్సిన చర్యల గురించే ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

(961)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ