లేటెస్ట్

ప్రజా వ్యతిరేకతను 'జగన్‌' లెక్కచేయడం లేదా...!?

రాజధాని అమరావతి తరలింపుపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడు చాలా మంది ఇది..ప్రస్తుత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం వేసిన ఎత్తుగడగా భావించారు. రాష్ట్రంలో ప్రజల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తట్టుకోవడానికే ఆయన మూడు రాజధానుల ప్రకటన చేశారని, దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్నారు. కానీ..ఆయన ప్రకటన చేసిన వెంటనే జి.ఎన్‌.రావు కమిటీ  తన నివేదికను బయటపెట్టడం, తరువాత కొందరు సీనియర్‌ అధికారులు విశాఖపట్నంలో సచివాలయానికి స్థలాలు, భవనాలు చూడడంతో..'జగన్‌' ప్రకటనపై ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయన స్పష్టమైన విధానంతోనే ఆ ప్రకటన చేశారని, చాలా సీరియస్‌గానే ఆయన మూడు రాజధానుల విధానంగా ఉన్నారని స్పష్టం అయింది. తొలుత 'జగన్‌' ప్రకటనపై రాజధాని రైతులు స్పందించడం, వారు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాక రేగింది. మూడు ప్రాంతాల్లో దీనిపై ఆందోళనలు నెలకొన్నాయి. సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడానికి ఆ ప్రాంతానికి చెందిన వారు స్వాగతిస్తుండగా, ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమకు హైకోర్టు ఇస్తామని తొలుత చెప్పినప్పుడు కొంత మంది స్వాగతించినా, తరువాత హైకోర్టు వల్ల ఉపయోగం లేదని, తమ ప్రాంతంలోనే పరిపూర్ణమైన రాజధానిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు ఉత్తరాంధ్రలో కొంత మంది నాయకులు..తమకు రాజధాని అవసరం లేదని, ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతాన్ని అలానే ఉండనీయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి 'జగన్‌' పర్యటనకు అనుకున్నంత మైలేజ్‌ రాలేదు. దీంతో మూడు రాజధానుల ప్రకటన తరువాత...ఏ ప్రాంతాన్ని సంతృప్తి పరచలేని పరిస్థితి పాలకుల్లో నెలకొంది.

మూడు రాజధానుల విషయంలో ప్రస్తుతం అమరావతి రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తుండగా..మరో పక్క..రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఈ ఆందోళనలు పాకుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, అనంతపురం, కడప జిల్లాల్లో మూడు రాజధానుల ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఈ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరో వైపు ప్రజలు కూడా రోడ్లపైకి వస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా..ప్రజల్లో ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై వారు పెదవి విరుస్తున్నారు. విపక్ష పార్టీలు, ఆందోళనలు చేస్తుండగా, అధికారపార్టీలో ఆంతర్మథనం నెలకొంది. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి గురించి వారు తమ నాయకుడికి చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తోన్న ప్రకటనలు వారిని తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తుండడంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు ఇంకా ఎక్కువతుండడం, వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఏమి చేయాలే తెలియక దిక్కులు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాను చేసిన ప్రకటన ప్రకారం రాజధానిని విశాఖపట్నం తరిలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చకచకా చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్‌ 6వ తేదీ లోపు విశాఖపట్నం నుంచి పాలన జరగాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగా కొన్ని డిపార్ట్‌మెంట్ల హెడ్‌లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ కార్యాలయాలు చూసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సచివాలయాన్ని విశాఖపట్నం తరలించాలని, అక్కడ నుంచే పరిపాలన ప్రారంభించాలని ఆయన తన సహచరులకు సూచిస్తున్నారు. ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత మరింత కాలం ఉండదని, ఒకసారి ఇక్కడ నుంచి కార్యాలయాలు తరలిస్తే..ప్రజలు దాని గురించి పట్టించుకోరని ఆయన అంచనా వేస్తున్నారు. తాను అనుకున్నదానిపై ప్రకారమే ముందుకు వెళ్లాలని, దీనిలో మరో మాటకు తావులేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద..ప్రజల్లో మూడు రాజధానుల ప్రకటనపై వ్యతిరేకత ఉన్నా..ముఖ్యమంత్రి మాత్రం ముందుకు వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారు. 

(452)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ