లేటెస్ట్

'రాజధాని' ఆటలో సమిథలు...సామాన్యులే...!

గత నెల రోజులుగా రాష్ట్రంలో రాజధాని వ్యవహారం రాజకీయపార్టీల్లో, ప్రజల్లో అలజడి సృష్టిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో 'శాసనరాజధాని' ఉండొచ్చు అన్న ప్రకటన అమరావతిలో కలకలం సృష్టించింది. ఆయన ప్రకటన తరువాత జి.ఎస్‌.రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ నివేదిక కూడా అదే రీతిలో  నివేదిక ఇవ్వడంతో...ఇక రాజధాని విశాఖపట్నానికి మారడం ఖాయమైపోయిందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి ప్రకటన తరువాత రాజధాని రైతులు, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. రాజధాని కోసం తాము త్యాగాలు చేశామని, తమ భూములను రాజధాని కోసం ఇస్తే..రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తే...తాము రోడ్డున పడతామని, రాజధానిని ఇక్కడే కొనసాగించాలని రైతులు ఉద్యమబాట పట్టారు. వారికి సంఘీభావంగా టిడిపి,జనసేన,బిజెపి, సిపిఐ, సిపిఎం, లోక్‌సత్తా తదితర పార్టీలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇలా ఉద్యమాన్ని నిర్వహిస్తుండగా..అధికార వైకాపా మాత్రం మూడు రాజధానుల వల్ల లాభం ఉంటుందని, సిఎం ప్రతిపాదనతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఈ రెండు వాదనలతో ఏదో ఒక వాదానికి మద్దతు ఇస్తూ...వారు మద్దతు ఇచ్చేవారితో కలసి వాదులాడుకుంటున్నారు. అయితే రాజధాని 'అమరావతి'లో కొనసాగినా...'విశాఖపట్నానికి' వెళ్లినా...సామాన్యులకు కలిగే లాభం ఏమిటో ఎవరూ చెప్పడం లేదు..? అటు ప్రతిపక్షం కానీ...ఇటు అధికార పక్షం కానీ..రాజధాని వల్ల సగటు పౌరుడికి వచ్చే లాభమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. 

గత ఐదేళ్లుగా రాజధాని 'అమరావతి'లో ఉన్నప్పుడు సగటు పౌరుడికి కలిగిన లాభం ఏమిటి...? రాజధాని ప్రకటన తరువాత..వారి మౌళిక జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి..? (ఒక్క రాజధాని ప్రాంతానికి మాత్రం మినహాయింపు) రాజధాని వల్ల అక్కడ ఉన్న భూములు ధరలు పెరగడంతో..వాటిని అమ్ముకున్న వారికి లాభం జరిగింది. భూములు లేని నిరుపేదలు..అప్పుడెలా ఉన్నారో...ఇప్పుడూ అలానే ఉన్నారు. రాజధాని హైదరాబాద్‌ నుంచి 'అమరావతి'కి వచ్చిన తరువాత..ఎవరైనా సామాన్య, మధ్య తరగతి ప్రజలు..రాజధాని ప్రాంతంలో ఒక సెంట్‌ భూమి కొనగలిగారా...? లేక అక్కడేమైనా ఇళ్లు నిర్మించుకోగలిగారా..? లేదు కదా...భూములు ఉన్నవారు...ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర బ్రోకర్లు లాభపడ్డారు తప్ప..సామాన్యులు లాభపడలేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న మచిలీపట్నంలో మాట్లాడుతూ..రాజధాని ప్రకటనతో 'అమరావతి'లో గజం భూమి ధర రూ.30వేలు పలికిందని, మరోసారి తనకు అధికారం ఇస్తే...అదే గజం లక్ష రూపాయలు అయ్యేదని చెబుతున్నారు. నిజమే ఆయన అలా చేసి ఉండేవారేమో..కానీ..గజానికి లక్ష వెచ్చించి అక్కడ కొనుగోలు చేసేదెవరు..? సగటు, మధ్యతరగతి పౌరులు..ఆ ధరకు కొనగలరా..? రాజధాని వల్ల గజం ధర లక్ష అయితేనేమి..? పది లక్షలైతే వారికేమి..? వారికేమైనా..లాభం ఉందా..? రాజధాని అందరికీ దగ్గరగా ఉందంటున్నారు..అది నిజమే..కానీ..సామాన్యుడెవరైనా...గత ఐదేళ్లల్లో సచివాలయానికి వచ్చారా..? వారికి సచివాలయంతో పని ఉంటుందా..? ఒకవేళ ఉన్నా..సదరు మంత్రులు కానీ, అధికారులు కానీ..వారిని సచివాలయ గేటు దాటికి లోపలికి రానిచ్చారా..? ఒకవేళ ఏదో తిప్పలు పడి వచ్చినా..వారి పనులు అయ్యాయా..? ఎంతో మంది...సిఎం రిలీఫ్‌పండ్‌ కోసం సెక్రటేరియట్‌ గేట్‌ వద్ద ఎండలో పడిగాపులు కాసిన సంగతిని అప్పుడు అధికారంలో ఉన్నవారికి తెలియకపోయినా..నిత్యం అక్కడే సంచరించే జర్నలిస్టులందరికీ తెలుసు..మరి సచివాలయం ఇక్కడ ఉన్నా..విశాఖలో ఉన్నా..లేక కర్నూలులో ఉన్నా...అడవిలో ఉన్నా..వారికి ఒకటే...? దానితో వారికి పెద్దగా పనిలేదు..ఉన్నా..వారి గురించి ఆలోచించే వారెవరూ లేరు..మరి వారెందుకు రాజధాని గురించి ఆలోచిస్తారు..?

ఇక ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నట్లు...విశాఖకు సచివాలయాన్ని మారిస్తే...సామాన్యులకు ఒరిగేదేముంది. దేశంలోనే 'విశాఖ' వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అటువంటి నగరానికి సచివాలయం వెళితే..అక్కడ కొత్తగా జరిగే అభివృద్ధి ఏముంది..? 'విశాఖ' నుంచి పాలన సాగిస్తే...సామాన్యులు అభివృద్ధి చెందుతారా..? సరే 'విశాఖ'లోనే సచివాలయం, ఇతర శాఖలు ఉంటే...సామాన్యులను ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తారా..? సామాన్యులకు ఆ మహానగరంలో ఒక సెంటు భూమి అయినా ఇస్తారా..? ఇవ్వరు కదా...? 'అమరావతి'లో వలే...'విశాఖ'లో కూడా సామాన్యులు ఇంటి జాగాలను కూడా కొనుక్కోలేరు కదా..?అలానే వారిని సచివాలయానికి రానీయరు కదా...? మరి రాజధాని ఎక్కడైతే ఏముంది..? రాజధాని అమరావతిలో ఉన్నా..విశాఖకు తరలినా..సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొత్తగా వచ్చేదేముంది..? రాజధాని 'అమరావతి'లో ఉన్నా..లేక విశాఖలో ఉన్నా..అధికార, ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధులకు, లేక ఇతర వ్యాపారవర్గాలకు లాభం తెస్తుందే కానీ..సగటు పౌరులకు ఉపయోగం ఉండదనేది అక్షర సత్యం. రాజధాని వల్ల అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు లాభపడ్డారు కనుక..ఇప్పుడు తాము కూడా లాభపడితే తప్పేమిటన్నుట్లు..అధికార పార్టీ భావిస్తూ..తరలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న చోట అన్ని సౌకర్యాలు ఉన్నా..రాష్ట్రానికి మధ్యలో ఉన్నా...గత పాలకులు సృష్టించిన రాజధానిలో తాము ఉండాల్సిన అవసరం లేదనే మంకు పట్టుతో, కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలను వదిలేసి..మళ్లీ రాజధానిని నిర్మిస్తామంటూ..ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయటానికి యత్నాలు చేస్తున్నారు. సామాన్యులు, సగటు కుటుంబీకుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా..తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ అవసరాలు, రాజకీయ స్వార్థం కోసం 'రాజధాని' అనే ఆటను అధికార, ప్రతిపక్షాలు సాగిస్తున్నాయి. చివరకు ఈ ఆటలో సమిధలయ్యేది సామాన్య ప్రజలే.  

(394)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ