లేటెస్ట్

'స్థానిక' ఎన్నికలు 'రాజధాని'కి రెఫరెండమా...!?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పలు విషయాలు చర్చించడం, కొన్ని సలహాలు తీసుకున్నారని వార్తలు రావడం చర్చనీయాంశం అవుతోంది. ముందుగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, రాష్ట్ర విభజనతో వచ్చిన సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకున్నారని, వాటిని ఏకతాటిపై నిలిచి పరిష్కరించుకోవాలని భావించారని తెలుస్తోంది. అదే విధంగా నదీ జలాల విషయంలో ఉమ్మడిగా వ్యవహరించాలని అనుకున్నారని, దానితో పాటు ఇరు రాష్ట్రాలు కలిసి నిర్మించే ప్రాజెక్టులపై కూడా ఏకాభిప్రాయం వచ్చిందంటున్నారు. దాదాపు ఆరు గంటల పాటు వారిద్దరూ ముఖాముఖిగా చర్చించుకోవడం రెండు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలోనూ, ప్రజల్లోనూ ఆసక్తి కల్గిస్తోంది. గతంలో ఇరువురు కలిసి చర్చించుకున్నా..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని 'అమరావతి' మార్పుపై ఆందోళనలు జరుగుతున్న సమయంలో 'జగన్‌' 'కెసిఆర్‌'తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మూడు రాజధానుల ప్రతిపాదనను 'కెసిఆర్‌' మెచ్చుకున్నారని, మూడు రాజధానుల విషయంలో 'జగన్‌' ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారని కొన్ని పత్రికలు రాశాయి. మూడు రాజధానులు ఉంటే..మంచిదని, రాజధానుల వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతౌల్యత ఉంటుందని 'కెసిఆర్‌' పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా 'విశాఖ'కు రాజధానిని తరలించాలనే దానిపై ముందుకెళ్లాలని 'కెసిఆర్‌' 'జగన్‌' సలహా ఇచ్చారని, ప్రజాందోళనలను పట్టించుకోవద్దని, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కూడా ఇదే విధంగా ఆందోళన నిర్వహించినా తాను పట్టించుకోలేదని, అదే రీతిలో ఆంధ్రాలో జరుగుతున్న ఆందోళనలు గురించి పట్టించుకోకుండా ముందుకెళ్లాలని ఆయన సూచించారట. ప్రజలు ఆందోళనలు నిర్వహించినా, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా, ఇంకేమి చేసినా పట్టించుకోవద్దని, రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే ప్రజలు చేసే ఆందోళనలు సమిసి పోతాయని కూడా ఆయన సలహాఇచ్చారని అంటున్నారు. తన రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలోనే 'హుజూర్‌నగర్‌' ఉపఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచిందని, దీంతో ఆర్టీసీ సమ్మె నిర్వీర్యం అయిపోయిందని, అదే రీతిలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 'వైకాపా' గెలిస్తే రాజధాని గురించి ఆందోళన చేస్తున్నవారు మౌనం దాలుస్తారని 'కెసిఆర్‌' 'జగన్‌'కు వివరించారని చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలిస్తే..రాజధానిని మార్చడం సులవుతుందన్న 'కెసిఆర్‌' సలహాపై పలువురు సీనియర్‌ విశ్లేషకులు దండెత్తుతున్నారు. స్థానిక ఎన్నికలు అంటే స్థానికంగా ఉండే పరిస్థితులు ప్రభావం ఉంటుందని, దానికి 'రాజదాని' మార్పుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో వర్గాలు, స్థానిక పరిస్థితులను బట్టి పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతాయి. అటువంటి ఎన్నికలను రాజధాని మార్పుకు అంటగట్టడం సరికాదని వారు పేర్కొంటున్నారు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక ఎన్నికల్లో అవే పార్టీలు గెలుస్తుంటాయని, మరో నాలుగేళ్లు అధికారంలో ఉండేవారితో గొడవలెందుకనో లేక తమ ప్రాంత అభివృద్ధికి అధికారపార్టీ ఎంతో కొంత తోడ్పాటు అందిస్తుందన్న నమ్మకంతో వారు..ఓట్లు వేస్తుంటారని, ఇది ప్రజాభిప్రాయానికి ప్రాతిపదిక కాదని వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికి సంబంధించిన సమస్యను స్థానిక అంశాలతో జరిగే ఎన్నికలకు ముడిపెట్టి...ముందుకు వెళ్లమని 'కెసిఆర్‌' సలహా ఇవ్వడం సరైన చర్య కాదని వారు దుయ్యబడుతున్నారు. కావాలంటే రాజధాని మార్పు గురించి ప్రజలేమనుకుంటున్నారో వారి నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలంటే..దానికి ప్రత్యేక మార్గాలు ఉన్నాయని, దీనిపై రాష్ట్రమంతా ఓటింగ్‌ నిర్వహించుకోవచ్చుంటున్నారు. దీనికి ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తాయని అలా నిర్ణయం తీసుకుంటే 'జగన్‌' ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని, కెసిఆర్‌ ఇటువంటి సలహాలను 'జగన్‌' ఇవ్వాలని, సంబంధం లేని అంశాలను రాజధానికి ముడిపెట్టడం సరికాదని అంటున్నారు. 

(469)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ