లేటెస్ట్

‘అమ్మో..మళ్లీ ఆకస్మిక తనిఖీలా...!?

టెక్నాలజీ పెరిగిన రోజుల్లో..ఈ తనిఖీలు ఎందుకు..?

అంతా వాట్సప్‌ పాలనే కదా...

ఉద్యోగులతో..పెట్టుకోవడం అవసరమా..?

హడలిపోతున్న తెలుగుతమ్ముళ్లు...!

మరోసారి ఓటమికి సిద్ధమవుతున్నామా..?

ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ గతంలో తాను చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అటు రాజకీయంగా, ఇటు అధికారికంగా ఆయన గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆయన వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేదనే భావన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాజకీయంగా ఆయన చేస్తోన్న తప్పులు..పార్టీ పుట్టిముంచుతాయనే భయం వారిలో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా, అధికారులనే నమ్ముకుని ఆయన చేస్తోన్న పాలన పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో విస్మ‌యాన్ని క‌ల్గిస్తోంది. ఎన్నికల ముందు ఆయన చెప్పిందేమిటీ..? ఇప్పుడు చేస్తోన్నదేమిటి..అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేసిన కార్యకర్తలను గుర్తుంచుకుంటానని, వారికి సరైన పదవులు ఇస్తానని హామీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకూ అన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయలేదు. ఒకవేళ భర్తీ చేసినా నామమాత్రంగానే చేశారు.


పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి పనిచేసిన వారికి, పొత్తుల్లో సీట్లు పోగొట్టుకున్న వారికి ఆయన న్యాయం చేయలేదు. దీనిపై ప్రశ్నించిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా..గతంలో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను హత్యచేసిన వారినీ, అరాచకంగా ప్రవర్తించిన వారిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేమంటే..తాను కక్షపూరిత రాజకీయాలు చేయనని, తనకు అంతా తెలుసునని, అంతా చట్ట ప్రకారం చేస్తానంటూ..రోజులు గడిపేస్తున్నారు. తమ ప్రాణాలు,మానాలు తీసినా..వారిపై చర్యలు లేకపోతే..ఎలా..? అంటూ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ అధినేత వ్యవహారంపై నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ పార్టీ అధికారంలో ఉన్నా..పార్టీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురైనా..ఆయన పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా ఖండనలు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు తప్ప..నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. అదే సమయంలో..‘వైకాపా’ నాయకులు, సానుభూతిపరులకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారు. ‘జగన్‌’ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో అంటకాగిన ‘మెఘా’ సంస్థకు ‘చంద్రబాబు’ పెద్దపీట వేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ‘మెఘా’కు అందరికంటే..ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ‘జగన్‌’ జేబు సంస్థ అయిన ‘షిర్డీసాయి ఎలక్ట్రికల్‌’కు విద్యుత్‌ కాంట్రాక్టులన్నీ కట్టబెడుతున్నారు.ఇక అధికార వ్యవస్థ మొత్తం పాత అధికారులతోనే కునారిల్లుపోతోంది. అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులను కనీసం అరెస్టు కూడా చేయడం లేదు. వందలకోట్లు కొట్టేసిన అధికారులకు కొత్తబట్టలు పెట్టి..పంపించారు. అధికార వ్యవస్థపై పట్టుసాధించలేకపోవడంతో..వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. దీంతో..రాష్ట్రంలో అధికారం ‘టిడిపి కూటమి’దా..లేక ‘వైకాపా’దా అనే సందేహాలు సామాన్య కార్యకర్తల్లో నెలకొంటోంది. కొన్ని సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా..మిగతా వ్యవహారాల విషయంలో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


పరిస్థితి ఇలా ఉంటే..ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో..ఎప్పుడో..ఆయనముఖ్యమంత్రి అయిన కొత్తల్లో చేసిన ఆకస్మిక తనిఖీలు అనే పాత‌ రాగాన్ని మ‌ళ్లీ పాడుతున్నారు. వచ్చే అక్టోబర్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఆయన ప్రకటించడం ‘టిడిపి’ వ‌ర్గాల‌ను షాక్‌కు గురిచేసింది. గతంలో...ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అప్పట్లో..ఇది సామాన్య ప్రజల్లో సానుకూలతను తీసుకురాగా..ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఈ వ్యతిరేకత పెరిపెరిగి.. చివరకు..మళ్లీ ‘చంద్రబాబు’ను ముఖ్యమంత్రిగా చూడకూడదనే శపథాన్ని వారు చేసుకున్నారు. దీని వల్లే ‘ఆయన’ పార్టీ 2004, 2009ల్లో వరుసగా ఓడిపోయింది. 2004లో అయితే ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటీవల ఆయన తన పరాజయాలకు తానే కారణమని చెప్పుకున్నారు. 2004, 2019ల్లో ఓటమికి తానే కారణమని చెప్పుకున్న ఆయన..ఇప్పుడు మళ్లీ పాత తప్పులనే చేసి..2029లో ఓడిపోతారా.. అంటూ టిడిపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 



వాట్స‌ప్ పాల‌న అంటున్నారుగా..ఇక ఆక‌స్మిక త‌నిఖీలు ఎందుకు..?

ఎప్పుడో 20ఏళ్ల క్రితం చేసిన ఆకస్మిక తనిఖీలు ఇప్పుడు అవసరమా..? పాలనంతా వాట్సప్‌లోనే జరుగుతుందని ఒకపక్క చెబుతున్నప్పుడు ‘ఆకస్మిక’ తనిఖీలు అవసరమా..? ఏ అధికారి..ఎప్పుడు ఏ పనిచేశాడు..? ఎంత వరకు చేశాడు..? ఏ టైమ్‌లో చేశాడనేది..స్పష్టంగా కంప్యూటర్‌లో తెలిసిపోతున్నప్పుడు..మళ్లీ తనిఖీలు అవసరం ఏముందనే ప్రశ్న రాజకీయ, అధికార వర్గాల నుంచి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ దస్త్రాలన్నీ ఇ-గవర్నన్స్‌లోనే నడుస్తున్నాయి. పేపర్‌తో సంబంధం లేకుండా నేరుగా ఫైళ్లు కదులుతున్నాయి. ఏదైనా ఫైల్‌ గురించి తెలుసుకోవాలంటే.. ఒక్క‌ క్లిక్‌ కొడితే..తెలిసిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా పాత పద్దతులు ఎందుకు..? దీని వల్ల అదనంగా వచ్చే లాభం ఏమీ లేదు. కొన్నాళ్లకు ముందు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ‘ఫైబర్‌నెట్‌’ గురించి మాట్లాడుతూ ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, ఇళ్లలో ఉండి ‘ఫైబర్‌నెట్‌’ ద్వారానే తమ సమస్యలను, ఇతర అవసరాలను నేరుగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ‘ఆకస్మిక తనిఖీలు’ ఎందుకు..? రాష్ట్రంలో ఏమూలన ఏమి జరుగుతుందో...‘వెలగపూడి సచివాలయం’లోని ‘ఆర్టీజీఎస్‌’ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఇంకా పాత విధానాలు- ఆక‌స్మిక త‌నిఖీలు ఎందుకు..? దీని వల్ల ‘టిడిపి కూటమి’కి లాభమేమీ రాదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్లీ ‘టిడిపి’పై అసంతృప్తి పెరగడం తప్ప...మరే విధమైన లాభం ఉండదు. ఎంతో అనుభవం ఉన్న ‘చంద్రబాబు’ ఇంకా పాత విధానాలను పట్టుకుని వేలాడడం ఏమిటి..? ఈ విధానాలతోనే గతంలో ఓడిపోయామని, మళ్లీ ఇప్పుడు దీని వల్ల మరోసారి ఓడిపోతామనే భయం తెలుగుతమ్ముళ్లలో నెలకొంది. చేయాల్సిన పనులు చేయకుండా.. అనవసర విషయాలకు ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇప్పటికే నెల నెలా ‘కలెక్టర్ల సదస్సు’ అంటూ రెండురోజుల పాటు..అత్యున్నత అధికారగణాన్ని తన చుట్టూ మొహరింప చేసుకుని..వారు చెప్పే కాకిలెక్కలతో మురిసిపోతున్నారని, ఇప్పుడు దీనికి ‘ఆకస్మికతనిఖీలు’ అంటూ మరో మాయదారి రోగాన్ని తమ అధినేతకు అధికారులు ఎక్కిస్తున్నారని, దీంతో..ఏమవుతుందోనన్న గుబులు తెలుగుతమ్ముళ్లలో నెలకొంటోంది. మొత్తం మీద..‘చంద్రబాబు’ ఏదో చేయబోయి ఏదో చేస్తున్నారు.. చివరకు ఇవి ఎటువంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ