లేటెస్ట్

'జగన్‌'ది ప్రజాద్రోహం-నిప్పులు చెరిగిన 'ఈనాడు'...!

తెలుగులో అత్యధిక సర్కులేషన్‌ కలిగిన 'ఈనాడు' మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడింది. రాజధాని తరలింపు విషయంపై మొదటి నుంచి 'జగన్‌' ప్రభుత్వంతో విభేదిస్తున్న 'ఈనాడు' ఈ రోజు తన సంపాదకీయంలో 'జగన్‌' ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టింది. మూడు రాజధానులంటూ 'జగన్‌' ప్రభుత్వం ప్రజాద్రోహం చేస్తోందని నిప్పులు చెరిగింది. 'అమరావతికి మరణ శాసనం' పేరిట రాసిన ఈ సంపాదకీయంలో 'జగన్‌' ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకేసింది. తన పార్టీకి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి అధికారం ఇచ్చినంత మాత్రానా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ ప్రజారాజధానికి మరణశాసనం రాశారంటూ విమర్శలు గుప్పించింది. ఐదేళ్ల తప్పిదాలను సరిచేస్తున్నామంటూ, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని కపట నాటకాలు ఆడుతూ 'అమరావతి' రెక్కలు కత్తిరించి, రాజధాని కోసం స్వచ్చంధంగా భూములు రాసిచ్చిన రైతుల పొట్టకొట్టిందని ఆక్షేపించింది. తాము అధికారంలోకి వస్తే..రాజధానిని మార్చుతామని ఎక్కడా వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదని, పైగా అత్యాధునికమైన, పర్యావరణపరంగా అత్యున్నతమైన, దేశంలోని రాష్ట్రాల రాజధాని నగరాలతో కాకుండా ప్రపంచంలోని సుందరమైన నగరాలతో పోల్చదగిన, సామాన్యుడికి చేరువుగా ఉండే రాజధానిని నిర్మిస్తామని పేర్కొన్నారని, ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజారాజధాని ప్రాణం తీశారని ఎండగట్టింది. రాజధానిని తరలించడం ద్వారా నిర్మాణరంగం, ఇతర రంగాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, దీనిపై ఆధారపడుతున్నవారు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. రాజధాని నిర్మాణం కొనసాగించి ఉంటే సిఆర్‌డిఎకు నిర్మాణ రంగం నుంచే దాదాపు 12వేల కోట్లు వచ్చేవని, కానీ వాటన్నింటిని కాలదన్నుకుని రాజధాని రైతుల ఉసురుతీస్తూ..ప్రజాద్రోహానికి 'జగన్‌' ప్రభుత్వం పాల్పడుతుందని పేర్కొంది.

(5347)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ