లేటెస్ట్

'జగన్‌'కు షాక్‌

సెలెక్ట్‌ కమిటీకి రాజధాని బిల్లు...!

మూడు రాజధానులు ఉండవచ్చు..అంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచి ఆయన దూకుడుకు అడ్డే లేకుండా సాగిపోయింది. మూడు రాజధానుల ప్రస్తావన వచ్చిన తరువాత రాజధాని రైతులు, ప్రతిపక్షాలు రోడ్డెకి ఆందోళనలు చేస్తున్నా 'జగన్‌' కిమ్మనలేదు. రాజధానికి చెందిన రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ధర్నాలు, దీక్షలు చేస్తుంటే వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులు అంటూ ఎగతాళి చేస్తూ...వారంతా ఒక సామాజికవర్గానికి చెందిన వారని నిందలు మోపుతూ 'జగన్‌' ప్రభుత్వం ఇష్టానుసారం మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకుంది. తాను అనుకున్నట్లుగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను అనుకున్నదే చేస్తానన్న మొండి పట్టుదలతో ముందుకు పోయిన 'జగన్‌'కు మండలి షాక్‌ ఇచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపించింది. దీనితో రాజధాని తరలింపు, మూడు రాజధానుల వ్యవహారం మరో మూడు నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. శాసనసభ ఆమోదించిన రాజధాని బిల్లును 'శాసనమండలి'లో కూడా టిడిపిని చీల్చి నెగ్గించుకోవాలన్న వైకాపా పెద్దల ప్రయత్నం నేడు బెడిసికొట్టింది. మండలి ఛైర్మన్‌ రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నామని చెప్పడంతో..అప్రహతింగా సాగుతున్న 'జగన్‌' దూకుడుకు అడ్డుకట్ట పడినట్లైంది. తాజాగా మండలి తీసుకున్ననిర్ణయంతో 'జగన్‌' ప్రభుత్వం రాజధాని మార్పుపై మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి.

బుధవారం నాడు ఉదయం నుంచి శాసనమండలిలో 'రాజధానిబిల్లు'పై తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఒకవైపు అధికారపార్టీ ఎలాగైనా బిల్లును నెగ్గించుకోవాలనే పంతంతో పట్టుదలతో దాదాపు 20 మంది మంత్రులను మండలిలో మొహరించి 'ఛైర్మన్‌'పై ఒత్తిడి తెచ్చింది. మరో వైపు వైకాపా సీనియర్‌ నేతలు, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు టిడిపి ఎమ్మెల్సీల్లో చీలిక తేవడానికి, లేదా 'బిల్లు'కు మద్దతు ఇచ్చేందుకువారిని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే దీన్ని ముందే గ్రహించిన టిడిపి అధినేత 'చంద్రబాబు' వారి వ్యూహానికి ప్రతి వ్యూహం రచించారు. నిన్నంతా రూల్‌ 71తో అల్లాడిపోయిన అధికారపక్షం ఈ రోజు ఎలాగైనా బిల్లును నెగ్గించడమో..లేక బిల్లును ఓడించడమో చేసి దాన్ని తిరిగి శాసనసభలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించుకోవాలని ప్రయత్నించారు. అయితే వారి వ్యూహాలు,ఒత్తిడి, ప్రలోభాలు కొంత వరకు పనిచేసినట్లు కనిపించినా..మండలి ఛైర్మన్‌ షరీప్‌ తీసుకున్న నిర్ణయంతో డీలా పడాల్సి వచ్చింది. శాసనమండలి గ్యాలరీలో అధికారపార్టీ సీనియర్‌ నాయకులు ఒక వైపు తిష్టవేసి మండలి సమావేశాలను పర్యవేక్షిస్తుండగా దానికి పోటీగా 'చంద్రబాబు' మరో వైపు మొహరించారు. దీనితో మండలిలో ఏమి జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు మంత్రులు మండలి ఛైర్మన్‌ పోడియం వద్ద మొహరించి బిల్లును పాస్‌ చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. దీన్ని ప్రతిపక్ష టిడిపి సభ్యులు ఎదుర్కొన్నారు. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మండలిని రణరంగంలా మార్చేశారు. దీనితో మండలి సమావేశాలకు పలుసార్లు అంతరాయం కలగడంతో పలుసార్లు వాయిదాలు వేయాల్సి వచ్చింది. చివరకు మండలి ఛైర్మన్‌ తనకు ఉన్న విచక్షణాధికారాలను ఉపయోగించి బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో టిడిపి సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేయగా, అధికార వైకాపా అసంతృప్తిని వ్యక్తం చేసింది. చంద్రబాబునాయుడు ఛైర్మన్‌ను బెదిరించి బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారని ఆరోపించింది. మొత్తం మీద..చూస్తే...రాజధాని విషయంలో ప్రజల మనోభావాలకు, రాజధాని రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలన్న 'జగన్‌' ప్రభుత్వ నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. 

(928)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ