లేటెస్ట్

10మంది టిడిపి ఎమ్మెల్సీలపై వైకాపా వల...!

శాసనమండలిలలో ఘోరపరాభవానికి గురైన అధికార వైకాపా పార్టీ దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించడంతో దిగ్బ్రాంతికి గురైన వైకాపా అధినాయకత్వం ఈ రోజు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనే దానిపై సమావేశాలపై సమావేశాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా శాసనమండలిని రద్దు చేయాలని ఈ రోజు అసెంబ్లీలో వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు 'మండలి'ని రద్దు చేయాలని కోరుతున్నారట. ప్రజలతో ఎన్నిక కాని ఎమ్మెల్సీల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాటలను వారంతా సమర్థిస్తున్నారు. దీంతో 'మండలి'ని రద్దు చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. 

మంత్రి పదవులు పోయినా ఫర్వాలేదు..!

శాసనమండలి ద్వారా ఎన్నికై మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌'లు తమ మంత్రి పదవులు పోయినా ఫర్వాలేదు..'శాసనమండలి'ని రద్దు చేయాలని ముఖ్యమంత్రిని బహిరంగంగానే కోరారు. వీరికి తోడు మరి కొందరు ఎమ్మెల్సీలు కూడా ఇదే రీతిలో స్పందిస్తున్నారు. ప్రజలతో ఎన్నిక కాకుండా ప్రతి బిల్లునూ 'మండలి'లో తిరస్కరిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుందని, మండలిని రద్దే దీనికి మార్గమని వైకాపా అధినేత 'జగన్‌' శాసనసభలో పేర్కొన్నారు. అధినేత మనోగతం తెలుసుకున్న మిగతా సభ్యులు కూడా ఆయనతో శృతి కలపగా, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీలు కూడా దానికి మద్దతు పలుకుతున్నారు. ఇది ఇలా ఉంటే 'మండలి' రద్దు కోసమే 'శాసనసభ'ను 'సోమవారాని'కి వాయిదా వేశారని, సోమవారం దీనిపై బిల్లు పెట్టి 'మండలి'కి మంగళం పాడతారని వైకాపా నాయకులు గట్టిగా చెబుతున్నారు. అయితే మరి కొందరు నేతలు మాత్రం దీన్ని సమర్థించడంలేదు. మండలి రద్దు అనేది లీక్‌ అని, టిడిపి ఎమ్మెల్సీలను భయపెట్టి తమ వైపు తిప్పుకునేందుకే ఇటువంటి లీకులు, ఈ రోజు శాసనసభలో ప్రసంగాలు చేశారని చెబుతున్నారు. 

మూడు రోజుల్లో తేలిపోవాలి...!

కాగా...శాసనసభకు మూడు రోజుల పాటు విరామం రావడంతో...సోమవారం లోపు టిడిపి నుంచి వచ్చే ఎమ్మెల్సీలను పార్టీలోకి లాక్కోవాలని వైకాపా పెద్దలు భావిస్తున్నారట. దాదాపు 10మంది టిడిపి ఎమ్మెల్సీలను లాగాలనేది ప్లాన్‌ అని చెబుతున్నారు. ప్రస్తుతం టిడిపికి నామినేటెడ్‌ సభ్యులతో కలిసి 34 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 'డొక్కా మాణిక్యవరప్రసాద్‌' రాజీనామా చేయగా, 'పోతుల సునీత', శివనాథరెడ్డి' వైకాపాలోకి వెళ్లారు. వీరు ముగ్గురు కాకుండా మరో 10మంది టిడిపి ఎమ్మెల్సీలను ఈ మూడు రోజుల్లో ఆకర్షించాలనే లక్ష్యంతో వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఛైర్మన్‌పై అవిశ్వాసం..!

టిడిపి ఎమ్మెల్సీల్లో మెజార్టీ ఎమ్మెల్సీలను లాగిన తరువాత ఛైర్మన్‌ 'షరీఫ్‌'పై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన వైకాపా అధినాయకత్వంలో ఉందట. మొదటి వ్యూహం ప్రకారం 'ఛైర్మన్‌'పై అవిశ్వాసం పెట్టి ఆయనను సాగనంపిన తరువాత..తమకు ఇష్టుడైన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించుకోవాలని, తద్వారా సెలెక్ట్‌ కమిటీకి పంపిన రాజధాని బిల్లుపై వేగవంతంగా చర్యలు తీసుకుని మళ్లీ పరిస్థితులను తన అధీనంలోకి తెచ్చుకోవాలనే భావన వారిలో ఉందట. ఇది ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చెప్పలేమని వైకాపాకు చెందిన నాయకులే చెబుతున్నారు. టిడిపికి 'మండలి'లో ఉన్న బలాన్ని పట్టి చూస్తే..అంత ఈజీగా ఈ పని జరగదు. ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేంత మంది వచ్చేది అనుమానమే. మరో మూడు రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో కానీ...ఇప్పటికైతే వైకాపా నేతలు..తమకు జరిగిన అవమానంపై రగిలిపోతున్నారు. ఏదోవిధంగా రాజధాని బిల్లును గట్టెక్కించి రాజధానిని మార్చి తమ సత్తా చాటలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాగా..టిడిపిని ఈ మూడు రోజుల్లో చీల్చలేకపోతే ముందు నుంచి అనుకున్నట్లే..'సోమవారం' శాసనసభలో 'మండలి'ని రద్దు చేస్తూ బిల్లును పాస్‌ చేసుకుని కేంద్రానికి పంపుతారు. దీంతో..ప్రస్తుతానికి రాజధానిపై జరుగుతున్న రగడ కొన్నాళ్లు సద్దుమణిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే..సోమవారం లోపు..ఏదో ఒకటి చేసి..పోయిన పరువును దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో వైకాపా పెద్దలు ఉండగా, తమ వైపు అపరచాణ్యుక్యుడు 'చంద్రబాబు' ఉన్నారని, వారి వ్యూహాలను ఎప్పటి వలే తిప్పికొడతారని, ఆయన నిద్రపోతున్నా రాజకీయాల గురించే ఆలోచిస్తారని, వైకాపా ఎత్తులు తమ వద్ద పనిచేయవని టిడిపి నేతలు భరోసాతో ఉన్నారు. చూద్దాం..ఈ మూడు రోజుల్లో ఏమి జరుగుతుందో..?

(1068)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ