లేటెస్ట్

వ్యూహలోపమా..? లేక ఇరికించారా..?

సిఆర్‌డిఎ రద్దు, పాలనవికేంద్రీకరణ బిల్లు విషయంలో వైకాపా ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగలడంపై ఆపార్టీలో ఆత్మపరిశీలన జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకు ఈ విధమైన ఎదురు దెబ్బ తగిలింది...? ఎవరు దీనికి కారకులు...? అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను శాసనమండలిలో బలం ఉన్న టిడిపి తిప్పికొడుతుందని ఎందుకు ఆలోచించలేదు..? ఏమీ కాదు..? అంతా తాము అనుకున్నట్లే జరుగుతుందన్న ఆలోచన ఎవరిది..? ఎవరి సలహాతో..శాసనమండలికి బిల్లు పంపించారు. ఇలా తాము అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతోనే..శాసనమండలిలో కూడా ఆమోదిస్తారని..ఎలా భావించారు..? ఇప్పటికే ఇంగ్లీషు మీడియం, ఎస్‌సి, ఎస్‌టి కమీషన్‌ బిల్లులను 'శాసనమండలి' వెనక్కు పంపిన సంగతి తెలిసి కూడా కీలకమైన సిఆర్‌డిఎ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు 'మండలి'లో ఆమోదం పొందడం/లేదా వెనక్కుపంపడం చేస్తారని ఎలా ఆలోచించారు..? దీన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపుతారని అధికారపార్టీ పెద్దలు ఊహించలేదా..? అసలు సెలెక్ట్‌ కమిటీ ఒకటి ఉంటుందని కానీ, దాని వల్ల తాము అసెంబ్లీలో చేసిన బిల్లు ఆగిపోయే ప్రమాదం ఉందని కానీ..అధికార పార్టీ పెద్దలు కానీ, వ్యూహకర్తలు కానీ ఆలోచించలేకపోయారా..? 'మండలి'లో 'బిల్లు' పాస్‌ కాకపోయినా..మళ్లీ అసెంబ్లీలో ఆమోదించుకుని పాస్‌ చేసుకుందామనే ఆలోచనే తప్ప..'మండలి' దాన్ని కోల్డ్‌స్టోరేజిలో పడేస్తుందన్న కనీస అవగాహన,పరిశీలన కానీ పాలకపార్టీ పెద్దల్లో లేదని..జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

సిఆర్‌డిఎ రద్దు, వికేంద్రీకరణ బిల్లు 'శాసనమండలి'లో ఆమోదం పొందదనే విషయం..వైకాపా పెద్దలకు తెలుసు. టిడిపికి మెజార్టీ ఉన్న 'మండలి'లో తిప్పి పంపిన బిల్లును మళ్లీ అసెంబ్లీలో ఆమోదించుకోవచ్చునని, దాని కోసం 'శాసనసభ' సమావేశాలను పొడిగించుకుంటే సరిపోతుందనే ఆలోచనతోనే తప్ప వేరే రకంగా వారు ఆలోచించలేకపోయారు. అపార అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనమండలిలో ప్రతిపక్షనేత 'యనమల రామకృష్ణుడు'లు వ్యూహాలు ఎలా ఉంటాయో వీరు పసిగట్టలేకపోయారా..? లేక   ఉద్దేశ్యపూర్వకంగా ముఖ్యమంత్రి 'జగన్‌'ను ఇరికించారా..? అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి 'జగన్‌'కు శాసనమండలి విషయంలో అనుభవం లేదు..? ఆయనకు ఈవిషయాలు తెలియకపోవచ్చు...కానీ ఆయన తరువాత మంత్రి మండలిలో సీనియర్లుగా ఉన్న మంత్రులకు ఈ విషయం తెలియదా..? అని వైకాపాలో అంతర్మథనం జరుగుతోంది. మంత్రి వర్గంలో అనుభవం ఉన్న సీనియర్లు ఎవరు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పలేకపోయారా..?  లేక రాజధాని 'అమరావతి' ఇక్కడ నుంచి తరలిపోవడం ఇష్టం కొందరు మంత్రులు ఈ విషయంలో కావాలనే అలా వ్యవహరించారా..? మండలిలో బిల్లును గట్టెక్కిస్తామని, అక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తామన్న వారు..ఇప్పుడు జరిగిన ఘోర అవమానానికి ఏమని సమాధానం ఇస్తారు. 'జగన్‌'కు దూకుడుకు అడ్డకట్ట వేయాలనే భావనతోనే వారు ఉదాశీనంగా వ్యవహరించారనే మాట పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. వ్యూహలోపం/ఎదురుదెబ్బ తగలాలనే ఆలోచనతోనే వారు ఈవిధంగా వ్యవహరించారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ బిల్లుల విషయంలో సరిగా వ్యవహరించలేకపోయిన/ కావాలనే ఇరుకున పెట్టిన మంత్రుల సంగతి ముఖ్యమంత్రి 'జగన్‌' తేలుస్తారని, 'బిల్లులు' సెలెక్ట్‌ కమిటీకి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి సదరు సీనియర్లు, క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయిన మంత్రులపై చర్యలు తీసుకుంటారని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే 'జగన్‌'కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని, తొలిసారి ప్రతిపక్షం అధికారపక్షంపై పై చేయి సాధించగలిగిందనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. 

(1922)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ