లేటెస్ట్

'అమరావతి'ని వదలి...'విశాఖ'కు 'సిఎం జగన్‌'...!

మూడు రాజధానులకు సాంకేతిక అడ్డంకులు రావడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్లాన్‌ 'బి'ని అమలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానులు, సిఆర్‌డిఎ రద్దు బిల్లులను 'శాసనమండలి' సెలెక్ట్‌ కమిటీకి పంపడం, రాజధాని తరలింపు విషయంలో హైకోర్టు ఏమి చెబుతుందో తేలకపోవడంతో..'జగన్‌' ప్లాన్‌ 'బి'ని అమలు చేయాలని తలపోస్తున్నారట. నిన్న మొన్నటి దాకా..రాజధాని 'విశాఖ'కు తరలిపోతుందని రాష్ట్ర జనాభాలో 90శాతం వరకు భావించారు. కానీ 'శాసనమండలి'లో 'జగన్‌' ప్రభుత్వానికి అనూహ్యమైన దెబ్బ తగలడంతో..ఇప్పట్లో 'రాజధాని' తరలిపోతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. సాంకేతిక కారణాలు కానివ్వండి, హైకోర్టులో కేసు విషయం కానివ్వండి..లేదా ఇతర కారణాలు కానివ్వండి..ఇప్పట్లో అయితే మాత్రం రాజధాని తరలిపోదని, 'విశాఖ' నుంచి పాలన మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నిన్న, మొన్నటి దాకా సచివాలయం, హెచ్‌ఒడిలు, డైరెక్టరేట్లుకు సంబంధించిన శాఖల సీనియర్‌ అధికారులు 'విశాఖ'లో కార్యాలయాలను చూసుకోవడానికి అక్కడికి వెళ్లి వచ్చారు. వారంతా మానసికంగా 'విశాఖ'కు వెళ్లడానికి సిద్ధం అయిన పరిస్థితుల్లో హఠాత్తుగా 'శాసనమండలి'లో ఎదురుదెబ్బ తగలడంతో...ఇప్పట్లో ఇక్కడ నుంచి వెళ్లేది లేదని భావిస్తున్నారు. అధికార వైకాపా నేతల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 'శాసనమండలి' బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన తరువాత...ప్రభుత్వం వైపు నుంచి ఆ బిల్లుల విషయంలో చేసేదేమీ కనిపించడం లేదు. రేపు శాసనసభ సమావేశం జరిగినా..ఆ బిల్లుల విషయం ఏమీ తేలదు..'మండలి'ని రద్దు చేసినా, ఆర్డినెన్స్‌ను తెచ్చినా..ఇప్పట్లో రాజధాని తరలింపు జరిగే పనికాదు. దీంతో తన పంతాన్ని ఎలాగైనా నెగ్గించుకోవాలనే తలంపుతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి 'విశాఖ'కు వెళతారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు.

'విశాఖ'లో ముఖ్యమంత్రి ఏదో ఒక బంగ్లా తీసుకుని..అక్కడ నుంచే తన కార్యకలాపాలను ప్రారంభిస్తే..ఆయనను అడిగేవారు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలనా విషయాలను అక్కడ నుంచే చేస్తుంటే సిఎంఒ అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. సిఎంఒ అధికారులతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీలోని సీనియర్లు అంతా 'విశాఖ'కు వస్తారు. దీంతో అధికారికంగా 'విశాఖ' రాజధాని కాకపోయినా...అనధికారికంగా అది రాజధానిగా ఉంటుంది. ముందుగా అక్కడకు సిఎం వెళితే మిగతా వారంతా అదే దారిలో పయనిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగంలో కాపిటల్‌ అనే పదం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అవుతుందని 'శాసనసభ'లో ముఖ్యమంత్రి 'జగన్‌'  చెప్పడం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకునేనని వారు చెబుతున్నారు. గతంలో 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'హుద్‌హుద్‌' తుపాన్‌ వచ్చిందని, ఆ సమయంలో ఆయన అక్కడ నుంచే పరిపాలన చేశారని, ఇప్పుడు 'జగన్‌' కూడా అదే విధంగా చేసుకోవచ్చని వారు అంటున్నారు. 

'చంద్రబాబు' బాటలోనే...!

అదే కాదు..రాష్ట్ర విభజన తరువాత 'చంద్రబాబు' అధికారంలోకి వచ్చిన తరువాత 'హైదరాబాద్‌' ఉమ్మడి రాజధానిగా ఉందని, ఆ సమయంలో హైదరాబాద్‌ సచివాలయంలో ఒక భాగాన్ని సచివాలయం కోసం ఇచ్చారని, మొదట్లో అక్కడ నుంచే పరిపాలనను ప్రారంభించిన 'చంద్రబాబు' ఓటుకు నోటు కేసు అనంతరం ఒక్కసారిగా అక్కడ సచివాలయాన్ని వదిలేసి 'విజయవాడ'కు వచ్చి క్యాంప్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించారు. ముఖ్యమంత్రి 'విజయవాడ'కు రావడంతో సిఎంఒ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు, అధికారులంతా 'విజయవాడ'లోనే తిష్టవేశారు. దాంతో హైదరాబాద్‌లోని సచివాలయం బోసిపోయింది. సచివాలయానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సీనియర్‌ అధికారులు రాకపోవడంతో కళాహీనమైపోయింది. అప్పటి వరకు వివిధ పనుల కోసం హైదరాబాద్‌ వచ్చే వారు..'విజయవాడ' బాట పట్టారు. ఇప్పుడు..'జగన్‌' కూడా అదే విధంగా వ్యవహరించవచ్చునని, 'చంద్రబాబు' వ్యవహరించిన విధంగానే 'జగన్‌' చేస్తే అభ్యంతర పెట్టేవారు ఎవరు..? అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజధానుల వికేంద్రీకరణ అంశం తేలే నాటికి తేలుతుందని, 'విశాఖ'కు 'సిఎం జగన్‌' వెళితే మిగతా విషయాలు అవే సర్దుకుంటాయని కొందరు వైకాపా నేతలు అంటున్నారు. కాగా ఇదే విషయాన్ని ఓ సీనియర్‌ అధికారి 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో ప్రస్తావిస్తూ 'జగన్‌' మూడు రాజధానులంటూ..అనవసరంగా కెలికారని, ఆయన ప్రశాంతంగా మొదట్లోనే 'విశాఖ'లో సిఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలనను అక్కడ నుంచి కొనసాగించి ఉంటే..ఇటువంటి ఎదురుదెబ్బలు తగిలేవి కావని వ్యాఖ్యానించారు. మొత్తం మీద...రాజధాని విషయంలో కొరివితో తలగోక్కుని ఇప్పుడు 'జగన్‌' తలపట్టుకుంటున్నారని, ఇప్పట్లో ఈ గందరగోళం తెరపడేది కాదని, ఆయన 'విశాఖ'కు వెళ్లాలనుకుంటే వెంటనే వెళ్లిపోతే రాజధాని సమస్య నెమ్మదిగా సర్దుకుంటుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆయన నియమించుకున్న ప్రముఖ లాయర్‌ కూడా సమర్థించారట. మరి ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తారా..? లేదా..? అధికారికంగానే వెళ్లాలనే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా..? చూద్దాం..మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

(1633)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ