లేటెస్ట్

'జగన్‌' తీరుపై 'ఉమ్మారెడ్డి' అసహనం..!

వైకాపా సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ 'ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు' ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన తరువాత తనను పట్టించుకోవడం లేదని, ఏ విషయాలు తనతో చర్చించడం లేదని, కూరలో కరేపాకులా తీసేస్తున్నారనే భావన ఆయనలో వ్యక్తం అవుతుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి 'జగన్‌' పట్టించుకోకపోయినా, పార్టీలో 'జగన్‌' తరువాత రెండో స్థానంలో ఉన్న 'విజయసాయిరెడ్డి' కూడా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉందని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి 'జగన్‌' తీసుకున్న వివిధ కారణాల వల్ల వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని, దీన్ని 'జగన్‌' కానీ, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన అంటున్నారట. 

తప్పు మీద తప్పు చేస్తోన్న 'జగన్‌'...!

అధికారంలోకి వచ్చిన తరువాత 'జగన్‌' పార్టీ పరంగా తప్పు మీద తప్పు చేస్తున్నారని, పాలనలో ఆయనకు అనుభవం లేకపోవడంతో మరిన్ని తప్పులు చేస్తున్నారని 'ఉమ్మారెడ్డి' అంటున్నారట. మూడు రాజధానుల విషయం, శాసనమండలి రద్దు, ఇసుక విధానం, అన్న క్యాంటీన్ల రద్దు వంటి విషయాల్లో ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డపేరు వచ్చిందని, దీన్ని సరి చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించడం లేదని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఇటీవల కొంత మంది వైకాపాకు చెందిన సీనియర్‌ నాయకులు కలిసిన సందర్భంగా 'ఉమ్మారెడ్డి' తన మనస్సులోని మాటలను వారితో పంచుకున్నారని తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేయడం వల్ల 'టిడిపి' కన్నా 'వైకాపా'కే ఎక్కువ నష్టమని, కొంత మంది నాయకులకు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు 'మండలి' రద్దుతో ఆ హామీ బుట్టదాఖలైనట్లేనని, దీని వల్ల వారు అసంతృప్తికి గురువుతున్నారని చర్చించుకున్నారట. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరికి ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని హామీ ఇచ్చామని, కానీ..ఇప్పుడు 'మండలి'ని రద్దు చేస్తుండడంతో..ఆయన పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా ఒకరినొకరు ప్రశ్నించుకున్నారని తెలుస్తోంది. 

టిడిపి అంత బలహీనంగా ఏమీ లేదు..!

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు 151 ఎమ్మెల్యే సీట్లు రావడంతో టిడిపి పనైపోయిందని పార్టీ సీనియర్‌ నాయకులు భావిస్తున్నారని, కానీ..టిడిపి వారు అనుకున్నంత బలహీనంగా ఏమీ లేదని 'ఉమ్మారెడ్డి' వ్యాఖ్యానించారట. వైకాపాకు 50శాతం ఓట్లు వస్తే...టిడిపికి 39శాతం ఓట్లు వచ్చాయని, ఇంత గాలిలో కూడా టిడిపి అంతశాతం ఓటింగ్‌ సాధించిందంటే ఆ పార్టీకి సంస్థాగతంగా ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చని, దీన్ని పార్టీ పెద్దలు గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఓడిపోయాడని 'చంద్రబాబు'ను తక్కువ అంచనా వేయవద్దని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పటిష్టతపై మరింత దృష్టి పెడతారని, సంస్థాగతంగా ఆయన పార్టీని మరింతగా బలోపేతం చేసుకుంటారని, వైకాపాలో మాత్రం సంస్థాగతంగా బలపడాలనే ఆలోచన కనిపించడం లేదని అన్నారట. అంతా 'జగనే' చూసుకుంటారు..మనకెందుకన్న ధోరణిలో సీనియర్లు ఉన్నారని, ఇది సరికాదని, సంస్థాగతంగా బలపడాలని, గత ఎన్నికల్లో వైకాపాకు వచ్చిన ఓటు భావోద్వేగానికి చెందిన ఓటు అని, ఈ సారి అటువంటి పరిస్థితి ఉండదని, పైగా మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల ప్రజల్లో ఒకరకమైన భావన వచ్చిందని, వీటన్నింటిని తట్టుకుని మళ్లీ గెలవాలంటే పార్టీ సంస్థాగతంగా బలపడాలని ఆయన కోరుకుంటున్నారట. ముఖ్యమంత్రి 'జగన్‌' ఎవరినీ సంప్రదించడం లేదని, ఎన్నికలకు ముందు ప్రాధాన్యత ఇచ్చిన వారిని పక్కన పెడితే...వారు అసంతృప్తికి గురవుతున్నారని, దీన్ని సరి చేసుకోవాలని 'ఉమ్మారెడ్డి' సూచిస్తున్నారట. మొత్తం మీద..'ఉమ్మారెడ్డి' కొంతమంది నాయకుల వద్ద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'జగన్‌'పై ఆయనకు అసంతృప్తి కన్నా..పార్టీ ఏమైపోతోందోనన్న భయం ఆయనలో కనిపించందని, దీన్ని సరి చేసుకోవాలని ఆయన కోరుతున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత 'వైకాపా' కూడా 'టిడిపి' వలే మారిందని, తాను గతంలో టిడిపిలో ఉన్నప్పుడు అక్కడ చూసిన తప్పులే ఇక్కడ కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారట. 

(1115)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ