లేటెస్ట్

'గుజరాత్‌' వాళ్ల కోసమే 'విశాఖ'కు రాజధాని...!

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో రాష్ట్రానికి మోడు రాజధానులు రావచ్చని..ఏ టైంలో అన్నారో కానీ..అప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్రమైన అలజడి నెలకొంది. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతే తమకు నష్టం వస్తుందని రాజధాని రైతులు, తమ ప్రాంతానికి నూతన రాజధాని దూరం అవుతుందని భావనతో రాయలసీమ వాసులు, తమ ప్రాంతం నుంచి రాజధాని వెళ్లిపోతుందనే భావనతో కృష్ణా,గుంటూరు జిల్లాల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా వారు చలించడం లేదు. మరో వైపు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. టిడిపి,బిజెపి, జనసేన, సిపీఐ, సిపిఎం తదితర పార్టీలు మూడు రాజధానుల ప్రతిపాదన అర్థం లేదని పనని, రాజధానిగా 'అమరావతి'నే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. 

ఒక్కసారిగా 'జగన్‌' మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తెచ్చారు..? ఆయన రాజధానిని 'వైజగ్‌'కు తరలించడం వెనుక..ఆయనకు స్వంత ప్రయోజనాలు ఉన్నాయని, ఆయనకు 'వైజాగ్‌'లో భారీగా భూములు ఉన్నాయని, వాటి విలువ పెంచుకునేందుకే ఆయన రాజధానిని తరలిస్తున్నారని టిడిపి,బిజెపి, జనసేన,సీపీఐ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రశాంతమైన 'వైజాగ్‌'లో 'రాయలసీమ ముఠాలు' ప్రవేశించి భూములు కొల్లగొట్టేస్తాయని, తన వారికి మేలు చేసేందుకే 'జగన్‌' రాజధానిని తరలిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు 'విశాఖ' స్వామి 'జగన్‌' జాతకతం చూసి..రాజధాని 'అమరావతి' నుంచి 'విశాఖ'కు మార్చాలని చెప్పారని, అందుకే ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకే 'జగన్‌' రాజధాని మార్చుతున్నారని అంటున్నారు. ఒకటే రాజధానిని అభివృద్ధి చేస్తే..వికేంద్రీకరణ జరగదని, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందని వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు. రాజధాని తరలింపుపై ఎవరికి తోచించింది వారు చెప్పుకుంటూ..'జగన్‌' నిర్ణయాన్ని సమర్థించే వారు సమర్థిస్తుండగా, వ్యతిరేకించేవారు వ్యతిరేకిస్తున్నారు. అయితే 'రాజధాని' మార్పుపై అంశంపై వైకాపాకు చెందిన ఓ నాయకుడు చెప్పిన మాటలు..ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆయన చెప్పిన మాటల ప్రకారం 'జగన్‌' రాజధానిని మారుస్తోందని 'గుజరాతీయుల' కోసమట. ఆంధ్రప్రదేశ్‌లో 'విశాఖపట్నం'లోనే 'గుజరాతీయులు' ఎక్కువగా ఉన్నారని, వారి వ్యాపారాల అభివృద్ధి కోసం 'విశాఖ'కు రాజధాని తరలిపోతుందని సదరు నాయకుడు చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు 'మోడీ, అమిత్‌షా'లకు రాజధాని మార్పు గురించి 'జగన్‌' వివరించినప్పుడు వారు పరిపాలనా రాజధానిని 'విశాఖ'లో ఏర్పాటు చేయాలని సూచించారని ఆ నాయకుడు చెబుతున్నారు. వారి మాటలతోనే ఇప్పుడు రాజధాని 'విశాఖ'కు తరలుతోందని, రాజధాని తరలింపుపై ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తోన్నా 'జగన్‌' ముందుకెళుతున్నారంటే  వారి మార్గదర్శకాలతోనేనని ఆయన వివరణ ఇచ్చారు. మొదటి నుంచి 'అమరావతి'లో రాజధాని ఉండడం 'జగన్‌'కు నచ్చలేదని, తాను అధికారంలోకి వచ్చిన తరువాత..'అమరావతి'లో కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని, 2014 ఎన్నికల్లో ఆయన గెలిస్తే..రాజధాని 'దొనకొండ' తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యేదని, కానీ..అప్పుడు ఓడిపోవడంతో..ఆయనకు ఇష్టం లేకపోయినా..నాటి పరిస్థితుల్లో 'జగన్‌' అమరావతికి ఓకే అన్నారని, అయితే తాను గెలిచిన తరువాత..తాను అనుకున్నట్లు రాజధానిని తరలించాలనే తన ఆలోచన బిజెపి పెద్దలకు చెప్పారని, దీంతో వారు తమ రాష్ట్ర వాసులు ఎక్కువగా ఉన్న 'విశాఖ'ను సూచించారని ఆయన తెలిపారు. 'విశాఖ' రాజధానిగా ఉంటే అక్కడ ఉన్న 'గుజరాత్‌' వ్యాపారాలకు లాభం చేకూరుతుందని, వారి వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని, అదే సమయంలో తమ పార్టీ కూడా బలపడుతుందని, మూడు రాజధానులతో టిడిపి దెబ్బతింటుందనే ఆలోచనతోనే 'బిజెపి' పెద్దలు తమ చేతికి మంటి అంటనీయకుండా 'జగన్‌'తో రాజధాని ఆట ఆడిస్తున్నారని సదరు నాయకుడు తెలిపారు. మరో వైపు 'విశాఖ' వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం, రాజధానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ దానికి ఉండడం, ముఖ్యంగా తాను వ్యతిరేకించే సామాజికవర్గం తక్కువగా ఉండడం తదితర కారణాలతో 'జగన్‌' 'విశాఖ'కు వెళ్లాలని భావిస్తున్నారని, రాజధాని మార్పు ఆలోచన 'జగన్‌'దే అయినా...'బిజెపి' పెద్దల మార్గదర్శకంలో రాజధాని 'విశాఖ'కు తరలిపోతుందని ఆయన అంటున్నారు. ఒక వైపు మూడు రాజధానులు వద్దంటూ రాష్ట్ర బిజెపి చెబుతుందని, కానీ కార్యాచరణకు మాత్రం రాదని, ఇటీవల 'జనసేన'తో పొత్తు పెట్టుకోవడంతో 'పవన్‌కళ్యాణ్‌' రాజధానిపై ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా...దాన్ని బిజెపి పెద్దలు  ఆపించారంటే 'రాజధాని' వెనుక ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదా..అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రతిపాద 'బిజెపి' పెద్దలకు తెలియకుండా జరిగితే..'జగన్‌' ఇప్పటికే దానికి భారీ మూల్యం చెల్లించేవారని, వారి కనుసన్నల్లో నడుస్తుందని కనుకే...'జగన్‌' అంత దీమాగా..ఉన్నారని, రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా చలించడం లేదంటే కారణం అదేనని ఆయన సూత్రీకరించారు. మొత్తం మీద..బిజెపి పెద్దలు తమ వాళ్ల కోసం మరోసారి ఆంధ్రా ప్రజలను అతలాకుతలం చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. 

(2660)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ