లేటెస్ట్

'సుజనాచౌదరి' ఎక్కడ...!?

మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన తరువాత 'బిజెపి' నుంచి తీవ్రమైన స్పందన వ్యక్తం చేసిన వారిలో చెప్పుకోదగిన వారు రాజ్యసభ సభ్యుడు 'సుజనాచౌదరి' మాత్రమే. 'జగన్‌' నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించి రాజధాని రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. వారు చేస్తోన్న ఆందోళనకు మద్దతు ఇచ్చారు. రాజధాని ఈ ప్రాంతం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తరలదని, దానికి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. కేంద్రం రాజధానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని, కేంద్ర పెద్దల అనుమతితోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపారు. అయితే ఆయన ప్రకటన చేసిన తరువాత అదే పార్టీకి చెందిన 'జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు' రాజధాని విషయంపై స్పందిస్తూ..రాజధాని తరలింపు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చి చెప్పారు. దీనిపై 'సుజనా'ను కొంత మంది ప్రశ్నిస్తే..తాను కేంద్ర పెద్దల ఆలోచనను చెబుతున్నానని, తాను చెప్పిందే నిజమని, ఇతరులు చెప్పేదాన్ని పట్టించుకోవద్దంటూ..స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన తరువాత..ఇక 'చౌదరి' మళ్లీ వార్తల్లో కనిపించలేదు. మరో వైపు కేంద్ర పరిధిలో లేదన్న 'జివిఎల్‌' మాత్రం ఇదే అంశంపై ప్రతిసారీ స్పందిస్తున్నారు. శాసనమండలి రద్దు విషయంలో కానీ, లేక రాజదాని విషయంలో కేంద్రం చేసేదేమీ లేదని చట్ట ప్రకారం వ్యవహరిస్తామని చెబుతూ..వైకాపా ప్రభుత్వం చర్యలను పరోక్షంగా సమర్థిస్తూ వచ్చారు. దీంతో 'జివిఎల్‌' చెప్పేదే కేంద్ర ఆలోచన కావచ్చనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

'సుజనా' మౌనం దేనికి..?

కాగా..'జివిఎల్‌' రాజధాని, శాసనమండలి విషయంలో పదే పదే ప్రస్తావిస్తుంటే..'సుజనాచౌదరి' మాత్రం ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న రాజధాని ప్రాంత వాసులతో పాటు ఇతర వర్గాల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. ఆయన నోటికి బిజెపి అధిష్టానం మూయించిందా..? లేక వ్యూహాత్మకంగా ఆయనే మోనాన్ని ఆశ్రయించారా..? అనేది తెలియడం లేదు. కాగా..శాసనసభలో 'మండలి' రద్దుపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి 'సుజనాచౌదరి'ని ఉద్దేశించి ఆయనను తన్ని బిజెపి నుంచి బయటకు పంపించాలని వ్యాఖ్యానించినా...'చౌదరి' మౌనాన్నే ఆశ్రయించారు. అంటే మొత్తం మీద..రాజధాని వ్యవహారంలో 'సుజనా' మనోభావాలకు వ్యతిరేకంగా 'ఢిల్లీ' వర్గాలు ఉన్నాయని, అందుకే ఆయన ఎక్కడా కనిపించడం లేదని, పైగా నోరెత్తడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

(792)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ