లేటెస్ట్

'జగన్‌'ను గెలిపించి తప్పు చేశానంటున్న 'ప్రశాంత్‌ కిశోర్‌'..!

ఆంధ్రాలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలకు తానే కారణమంటూ, 'జగన్‌'ను గెలిపించి తప్పు చేశానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త 'ప్రశాంత్‌ కిశోర్‌' బాధను వ్యక్తం చేస్తున్నారట. 'ఆంధ్రా' మూడు రాజధానుల వ్యవహారం, ఇసుక కొరత, శాసనమండలి రద్దు, ప్రతీకార రాజకీయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని దీనంతటికి తాను పరోక్ష కారణమని, దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారని 'ఏబీఎన్‌ రాధాకృష్ణ' తన వీకెండ్‌ కామెంట్‌లో పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు 'ప్రశాంత్‌ కిశోర్‌' వైకాపా వ్యూహకర్తగా పనిచేశారని, ఆ సమయంలో రాష్ట్రంలో కులాల మధ్య ఆయన చిచ్చు పెట్టారని, ముఖ్యంగా 'కమ్మ' కులంపై విషం చిమ్మి, మిగతా కులాలను ఆ కులంపై రెచ్చగొట్టి 'జగన్‌' గెలుపుకు కారణమయ్యారని, తన వల్లే ఇప్పుడు 'ఆంధ్రా' ఇలా అయిపోయిందని 'ప్రశాంత్‌కిశోర్‌' ఆవేదన చెందారని 'రాధాకృష్ణ' తన వ్యాసంలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 'చంద్రబాబు' ఓడిపోకూడదని, కానీ తన వ్యూహాలవల్ల, కుల రాజకీయాల వల్ల ఆయన ఓడిపోయారని, ఆ ఫలితం నేడు ఆంధ్రాలోని అమాయక ప్రజలు అనుభవిస్తున్నారని 'ప్రశాంత్‌' తన సన్నిహితులతో పేర్కొన్నారని 'రాధాకృష్ణ' తన వీకెండ్‌ కామెంట్‌లో పేర్కొన్నారు. 'ప్రశాంత్‌ కిశోర్‌' ఈ విషయం గురించి ఎవరితో చెప్పారో 'రాధాకృష్ణ' చెప్పలేదు. దీనిపై వైకాపా శ్రేణులు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు 'ఆర్‌కె'పై విరుచుకుపడుతున్నాయి. మొత్తం మీద..'ప్రశాంత్‌ కిశోర్‌' కుల రాజకీయాలకు 'ఆంధ్రా' బలైందని, ఆయన వ్యూహాల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని 'ఆర్‌కె' పేర్కొన్నారు. 

(21526)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ