లేటెస్ట్

ఎవరి ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది...!

మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన వారికి మళ్లీ నిరాశే ఎదురయింది. ఎప్పటిలానే గోడమీద పిల్లి వలే మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం తప్పించుకుని తిరుగుతోంది. మూడు రాజధానులపై టిడిపి లోక్‌సభ సభ్యుడు 'గల్లా జయదేవ్‌' అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ...రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని, వారి ఇష్ట ప్రకారమే రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీకి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపింది. దీంతో కేంద్రం మూడు రాజధానులకు మద్దతు ఇచ్చిందని వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. తాము ముందు నుంచి చెప్పినట్లే రాజధాని విషయంలో కేంద్రం స్పందించదని, తమ ఇష్టం వచ్చినట్లు రాజధానులను ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు చెప్పుకుంటున్నారు. పైగా కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపి ఆశలపై కేంద్రం నీళ్లు జల్లిందని ఆ పార్టీకి చెందిన మీడియా ప్రచారం చేస్తోంది. 

మరో వైపు టిడిపి నేతలు మాత్రం దీనిపై 'జగన్‌'కు ఎదురుదెబ్బ తగిలిందని ప్రచారం చేస్తున్నారు. రాజధాని ఏర్పాటు ఎప్పుడో జరిగిపోయిందని, కేంద్రం దాన్ని నోటిఫై చేసిందని, ఇప్పుడు కొత్తగా రాజధాని ఏర్పాటు విషయం ప్రస్తావనకు రాదని, ఇప్పటికే 'అమరావతి'ని ఆంధ్రా రాజధానిగా గుర్తించిందని, ఇటీవల విడుదల చేసిన ఇండియా మ్యాప్‌లో కూడా దీన్ని ప్రచురించారని అంటున్నారు. రాజధానిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదని ఇప్పటి వరకు వైకాపా నేతలు వాదించారని, కేంద్ర మంత్రి మాత్రం తాము రాజధానిని నోటిఫై చేశామని చెబుతున్నారని, దీంతో వైకాపా చేస్తోన్న ప్రచారంలో పసలేదని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద..మూడు రాజధానుల విషయంలో తప్పించుకు తిరుగుతున్న బిజెపి మరోసారి కూడా అదే విధంగా వ్యవహరిస్తూ...టిడిపి,వైకాపాలకు ఎవరి భాష్యం వారు చెప్పుకునే అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో 'అమరావతి, మూడు రాజధానుల విషయంలో ఇంత గొడవ జరుగుతున్నా...అది తాము చూడనట్లు, పత్రికల్లో వార్తలు చూస్తున్నామని డొంకతిరుగుడుగా మాట్లాడుతోంది. ఒకవైపు మూడు రాజధానులకు బిజెపి రాష్ట్ర నాయకులు తాము వ్యతిరేకమని, ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని చెబుతుంటే..దాని సంగతి ప్రస్తావించకుండా..రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర పరిధిలోనిదే అంటూ పాత పురాణం వినిపించడంపై సగటు ఆంధ్రా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

(954)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ