లేటెస్ట్

రాజధానిపై బిజెపి ముసుగు తొలిగిపోయింది...!

మూడు రాజధానుల విషయాన్ని కేంద్రానికి వివరించిన తరువాతే తాము నిర్ణయం తీసుకున్నామంటున్న వైకాపా నేతల మాటలే నిజం అవుతున్నాయి.  ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు 'నడ్డా'ల ఆశీస్సులతోనే వికేంద్రీకరణ బిల్లును తాము అసెంబ్లీలో పెట్టామని, తమ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని, తామనుకున్నట్లే రాజధాని 'విశాఖ'కు తరలుతుందని వైకాపా గట్టిగా చెప్పడం వెనుక బిజెపి పెద్దల హామీ ఉందని ఈ రోజు బిజెపి ఎంపి 'జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు' చేసిన వ్యాఖ్యలతో రుజువైంది. నిన్నటికి నిన్న రాజధాని విషయం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రితో చెప్పించిన బిజెపి అధిష్టానం, గతంలో చేసిన 'అమరావతి' నోటిఫికేషన్‌కు పెద్దగా విలువ లేదని తేల్చింది. ఇదే విషయంపై 'జి.వి.ఎల్‌' ఈ రోజు మాట్లాడుతూ..గత ప్రభుత్వం రాజధానిని నోటిఫై చేస్తూ జీవో ఇచ్చిందని, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కూడా నూతన రాజధానిపై జీవో తెస్తే...కేంద్రం నోటిఫై చేస్తుందని తేల్చి చెప్పింది. ఇది మామూలుగా కేంద్రం చేసే పనేనని, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇస్తే...కేంద్రం నోటిఫై చేస్తుందని తేల్చి చెప్పడం ద్వారా కేంద్ర మద్దతు 'వైకాపా'కేనని స్పష్టం చేసింది. 

ఎందుకీ ముసుగు...!?

ఒక వైపు ఆంధ్రా బిజెపితో 'అమరావతి'కే మద్దతు అంటూ చెప్పిస్తూ..మరోవైపు కేంద్రం మాత్రం మూడు రాజధానులకు తెర వెనుక నుంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ముసుగులో గుద్దలాట ఆడుతోంది.  ముఖ్యమంత్రి 'జగన్‌' మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు 'బిజెపి' రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నా లక్ష్మీనారాయణ' 'అమరావతి'కి వెళ్లి 'మోడీ' శంఖుస్థాపన చేసిన ప్రాంతంలో దీక్ష చేస్తే...కేంద్ర పెద్దలకు తెలియకుండానే వైకాపా పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని మొదట్లో ప్రజలు భావించారు. అయితే తరువాత నుంచే అసలు కథ ప్రారంభమైంది. మౌన దీక్ష చేసిన 'కన్నా' మళ్లీ ఉద్యమంలోకి రాలేదు..సరైన సమయంలో కేంద్రం రంగంలోకి దిగుతుందన్న 'సుజనాచౌదరి' ఎక్కడ ఉన్నాడో..ఎవరికీ తెలియదు...? రాజధాని రైతులు 50 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే..బిజెపి నేతలు వారి మోహం చూసిన పాపాన పోలేదు అంటే ఇదంతా బిజెపి పెద్దల నిర్వాహకమేనని 'జివిఎల్‌' మాటలతో తేలిపోయింది. రాజధాని వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని తరలింపును ఆపితే అది 'టిడిపి'కి మేలు అవుతుందనే భావనతోనే మూడు రాజధానులకు తెరవెనుక నుండి బిజెపి మద్దతు ఇస్తోంది. రాజధాని రైతులకు మద్దతుగా వచ్చేవారిని ఒక్కొక్కరిని పక్కకు పంపిస్తూ...వైకాపాకు సహకరిస్తోంది. ముందుగా 'కన్నా,సుజనాచౌదరి'లను రాజధాని ఉద్యమం నుంచి పక్కకు తప్పించిన బిజెపి పెద్దలు తాజాగా 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌'ను కూడా తప్పించేశారు. దీంతో రాజధాని తరలింపుకు 'బిజెపి' పెద్దలు పూర్తిగా సహకరించినట్లైంది. 

పాపం..'పవన్‌'...!?

మూడు రాజధానుల విషయంలో  తాడో పేడో తేలుస్తానన్న 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' తాజా పరిస్థితులతో ఒంటరైపోయారు. రాజధాని కోసం అవసరమైతే 'బిజెపి'తో పొత్తు పెట్టుకుంటానని, ఆ పార్టీ పెద్దల నుంచి తనకు హామీ ఉందన్న ఆయన మాటలకు విలువ లేదని 'బిజెపి' పెద్దలు నిరూపించారు. రాజధాని కోసం ఆమరణ దీక్ష చేస్తానని, లాంగ్‌ మార్చ్‌ చేస్తానన్న 'పవన్‌' ప్రజల్లో చులకన అయిపోయారు. ఆయన 'బిజెపి' ఆడించే బొమ్మని సోషల్‌మీడియాలో సటైర్లు పేలుతున్నాయి.  'లాంగ్‌మార్చ్‌' వాయిదాతోనే 'పవన్‌' విలువ ప్రజల్లో చులకనైంది. రాజధాని ఉద్యమంలో 'పవన్‌' పాల్గొంటే ప్రజలు స్పందిస్తారనే భావనతో ఆయనను సినిమాలు చేసుకోవాలని కేంద్ర పెద్దలు ఆదేశించారని, దీంతో ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయి...జరుగుతున్న పరిణామాలను రోజుకో స్టేట్‌మెంట్‌ ఇస్తూ..పేపర్‌ పులిలా అయ్యారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అనవసరంగా 'బిజెపి'తో కలిశారని, స్వంతంగా ఆయన ఉద్యమంలో పాల్గొంటే రాజధాని క్రెడిట్‌ ఆయన ఖాతాలో జమయ్యేదని, కానీ బిజెపి పెద్దలకు వైకాపా పెద్దలకు ఉన్న అవగాహనతో 'పవన్‌' పలుచన అయిపోయారంటున్నారు. మొత్తం మీద..నిన్న మొన్నటి దాకా ముసుగులో రాజధాని ఆట ఆడిన బిజెపి నేతలు..ఇప్పుడు ముసుగు తొలగించుకుని మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. 

(2553)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ