లేటెస్ట్

'రాజధాను'లతో బిజెపి ఆట...!

దేశం మొత్తాన్ని మతం మత్తులో ముంచెత్తి, భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న బిజెపి, ఇప్పుడు రాజధానుల ఆట ఆడబోతోంది. రాజధానుల ఆట కోసం 'ఆంధ్రప్రదేశ్‌'నే కార్యక్షేత్రంగా ఎంచుకుంది. ఉమ్మడి రాష్ట్రాన్ని ఆంధ్రుల మనోభావాలతో పనిలేకుండా విభజించి, వారిని రోడ్డున పడేసిన 'బిజెపి' తాజాగా రాష్ట్రంలో 'రాజధాని' నిప్పు రాజేసి పండుగ చేసుకుంటోంది. రాష్ట్ర విభజనతో నష్టపోయిన 'ఆంధ్రా'ను ఆదుకోకుండా, దాని ఉసురు తీయడానికి కంకణం కట్టుకుంది. 'ఆంధ్రా'కు న్యాయబద్దంగా రావాల్సిన ప్రత్యేకహోదా, నిధులను అడిగారనే కోపంతో 'వైకాపా'కు మద్దతు ఇచ్చి, టిడిపిని ఓడించిన బిజెపి, మళ్లీ టిడిపిని లేకుండా చేసేందుకు 'రాజధాని' మార్పు ఆటను ఆడుతోంది. రాజధాని 'అమరావతి'ని తరలించడానికి, మూడు రాజధానుల ప్రతిపాదనకు తెర వెనుక నుంచి మద్దతు ఇచ్చిన 'బిజెపి' తనకు తెలియకుండానే చిక్కుల్లో కూరుకుపోబోతోంది. 'అమరావతి' నుంచి రాజధాని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు, ప్రజలు ఉద్యమిస్తుంటే దాన్ని పట్టించుకోకుండా అధికార వైకాపాకు మద్దతు ఇస్తూ..నూతన రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే..దాన్ని నోటిఫై చేస్తామని చెబుతోంది. టిడిపిని అణిచివేయడానికి వేసిన ఈ ఎత్తు...బిజెపి మెడకే చుట్టుకోబోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 'ఆంధ్రా' రాజధానిగా 'అమరావతి'ని కేంద్రం నోటిఫై చేసిందన్న మాటను, ప్రస్తావిస్తూ..వైకాపా ప్రభుత్వం జీవో ఇస్తే మళ్లీ నోటిఫై చేస్తామని ఆ పార్టీ ఎంపి జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు పేర్కొన్నారు. సరే..ఇప్పుడు 'జగన్‌' 'విశాఖ'ను రాజధానిగా జీవో ఇస్తే..వీరు నోటిఫై చేస్తారు..మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జీవోలు ఇస్తే...కేంద్రం నోటిఫై చేస్తుందా..? బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలను పక్కన పెడితే..మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు..తమ రాజధానిని మార్చాలని నిర్ణయాలు తీసుకుంటే వాటిన్నంటిని నోటిఫై చేస్తుందా..? వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇతర పార్టీలు..బిజెపిని ఎదుర్కోవడానికి....ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి...తమకు అనుకూలంగా ఇది వరకు ఉన్న రాజధానులను కాదని నూతన రాజధానులను ప్రకటిస్తే...చేస్తుందా..? ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న 'కాంగ్రెస్‌' ఇప్పుడున్న రాజధాని 'భోపాల్‌'ను కాదని తమకు రాజకీయ ప్రయోజనకం కలిగిన నగరాన్ని రాజధానిగా ప్రకటించి జీవో ఇస్తే...కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుందా..? ఇంతకు ముందున్న రాజధానులను ఎటువంటి కారణం లేకుండా పాలకులు మారినప్పుడల్లా...మారుస్తూ పోతే కేంద్రం ఓకే అంటుందా..? ముఖ్యమంత్రి 'జగన్‌' చేసిన నిర్ణయాన్ని సమర్థిస్తూ..నోటిఫై చేసుకుంటూ పోతే...ఏ రాష్ట్రానికి సుస్థిరమైన రాజదాని ఉండదు..? తమ రహస్యమిత్రుడి సహాయం చేయాలనే యావలో బిజెపి పెద్దలు..రాజ్యాంగానికి వేరే భాష్యాలు చెప్పుకుంటూ..'ఆంధ్రా'ను నాశనం చేయడానికి తమ వంతు ఆజ్యం పోస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

(945)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ