‘జగన్’ చేతికి ‘కేశినేని నాని’ భలే ఆయుధానిచ్చాడే...!?
విజయవాడ మాజీ ఎంపి ‘కేశినేని నాని’ తన సోదరుడు ‘కేశినేని శివనాధ్’పై ఉన్న పగ,ద్వేషంతో చేస్తోన్న ఆరోపణలు, విమర్శలు మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’కి ఆయుధాల్లా ఉపయోగపడుతున్నట్లున్నాయి. ‘కేశినేని నాని’ తన సోదరుడు ‘కేశినేని శివనాథ్’ (చిన్ని)పై చేసిన మద్యం ఆరోపణలను ‘జగన్మోహన్‌రెడ్డి’ భలే ఉపయోగించుకుంటున్నారు. మద్యం కేసులో నిందితులుగా ఉన్న వారంతా ‘టిడిపి’ నేతలే అని, వారంతా ‘చంద్రబాబు’ ఆడించినట్లు ఆడుతున్నారని, భేతాళకథలు సృష్టిస్తున్నారని ‘జగన్’ పత్రిక ఓ భారీ స్టోరీ తన పత్రికలో ప్రచురించింది. ఈ కథనం మొత్తంలో ‘కేశినేని నా’ని ఆరోపించిన ఆరోపణలే మళ్లీ ముద్రించి..దీన్ని ‘టిడిపి’కి అంట కట్టింది. 2019-2024 వరకు జరిగిన మద్యం కుంభకోణం మొత్తం ‘టిడిపి’ నేతలే చేశారని, దీనిలో ‘వైకాపా’కు, ‘జగన్’కు సంబంధం లేదంటూ..ఆ కథనంలో పేర్కొంది. ఇప్పుడు మద్యం కేసులో అరెస్టు అయిన ‘కసిరెడ్డి’ విజయవాడ ఎంపి ‘కేశినేని శివనాథ్’కు సన్నిహితుడని, ఇద్దరూకలసి వ్యాపారాలు చేశారని దీంతో..ఈ కేసులో ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదా అని ఆ కథనంలో ప్రశ్నించారు. ‘కేశినేని శివనాథ్’, ‘కసిరెడ్డి’లు ఒకే ఇంటి నెంబర్‌తో కార్యాలయాన్ని తెరిచారని, వారిద్దరూ సన్నిహితులని ‘కేశినేని నాని’ ఇంతకు ముందు ఆరోపించారు. దీన్ని ఇప్పుడు ‘జగన్’ వాటంగా వాడేసుకున్నారు. అంతే కాదంట..? మాజీ ఎంపి ‘విజయసాయిరెడ్డి’, బేవరేజ్ కార్పొరేషన్ ‘ఎండి వాసుదేవరెడ్డి’లు కూడా ‘టిడిపి’ వాళ్లేనట. వాళ్లిద్దరూ ‘చంద్రబాబు’ ఆడించినట్లు ఆడుతున్నారని, ‘వాసుదేవరెడ్డి’ని బెదిరించి వాగ్మూలం ఇప్పించారని, ఆయన ‘చంద్రబాబు’ చెప్పమన్నట్లు చెప్పారని, అందుకే ఆయను ఇక్కడ నుంచి కేంద్రానికి వెళ్లనిచ్చారని ఇవన్నీ కుట్రలు కాదా..? అంటూ ఆ పత్రిక ప్రశ్నిస్తోంది.
అదే విధంగా సిఎంలో పనిచేసిన ‘ధనుంజయరెడ్డి’కి, జగన్ ఓఎస్టీ ‘కృష్ణమోహన్‌రెడ్డి’, భారతీ సిమెంట్ డైరెక్టర్ ‘బాలాజీ గోవిందప్ప’లు ఈ కుంభకోణంతో సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులని వారిని విచారించాలని సిఐడి పలుసార్లు పిలిచినా వారు విచారణకు హాజరు కావడం లేదు. దీంతో..వారిని అరెస్టు చేస్తారనే భయంతో వారు పారిపోతున్నారు. అయితే ఇప్పుడు వారికి ఈ కేసుతో సంబంధం లేదని ‘జగన్’ వాదిస్తున్నారు. మరోమూడేళ్లు రాజ్యసభ సభ్యత్వం ఉన్న ‘విజయసాయిరెడ్డి’ ‘చంద్రబాబు’తో కుమ్మక్కు అయ్యే రాజ్యసభను వదులుకుని కుట్రలో భాగస్వామి అయ్యారని ఆరోపించింది. మొత్తం మీద మద్యం కేసు ‘జగన్ దంపతుల’ను తాకనున్న తరుణంలో విజయవాడ మాజీ ఎంపి ‘కేశినేని నాని’ అందించిన ఓ అస్త్రాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ‘కేశినేని నాని’ ఈ మద్యం కేసులో తన తమ్ముడి ప్రస్తావన తేకపోతే..ఈ కేసును ‘టిడిపి’ మీదకు తోయడానికి ‘జగన్’కు అవకాశం ఉండేది కాదు. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టు అయిన వారు, నిందితులంతా ‘జగన్’కు సన్నిహితులే. ఎప్పుడైతే ‘నాని’ ‘చిన్ని’కీ, ‘కసిరెడ్డి’కి సంబంధాలు ఉన్నాయని చెప్పారో..ఇక అప్పటి నుంచి ‘జగన్’ బృందం దీన్ని ‘టిడిపి’ మీదకు తోయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. మొత్తం మీద ‘కేశినేని నాని’ రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యానని ప్రకటించి, ‘వైకాపా’కు రాజీనామా చేసి కూడా ‘జగన్’కు మేలు చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.