లేటెస్ట్

త్వ‌ర‌లో భారీగా ఐఏఎస్‌ల బ‌దిలీలు...!?

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి దాదాపు ఏడాది కావ‌స్తున్నా..అధికార వ్య‌వ‌స్థ‌పై ఇంకా ప‌ట్టుసాధించ‌లేక పోయింది. అపార రాజ‌కీయ‌, అధికార అనుభ‌వం ఉన్న ముఖ్య‌మంత్రి ‘చంద్ర‌బాబునాయుడు’ కూడా ఎందుకో ఈసారి అధికార వ్య‌వ‌స్థ‌పై ప‌ట్టుసాధించ‌లేక‌పోయారు. గ‌త వైకాపా ప్ర‌భుత్వ హ‌యంలో అధికార వ్య‌వ‌స్థ మొత్తం జ‌గ‌న్‌కు సాగిల‌ప‌డి ప‌నిచేయ‌గా..నేడు మాత్రం అధికార వ్య‌వ‌స్థ అధికార‌పార్టీకి అడుగ‌డు గునా..అడ్డు త‌గులుతూ ప్ర‌భుత్వానికి సానుకూల‌త రాకుండా చేస్తోంది. ముఖ్యంగా రెవిన్యూ, పోలీసు, పంచాయితీరాజ్‌, మున్సిప‌ల్‌, గ‌నులు, వ్య‌వ‌సాయ‌, పౌర‌స‌ర‌ఫ‌రాలు,దేవాదాయ‌,ఫైనాన్స్‌,బీసీ వెల్ఫేర్‌ త‌దిత‌ర శాఖ‌ల్లోని అధికార‌వ్య‌వ‌స్థ ఈ కూట‌మి ప్ర‌భుత్వాన్నితీవ్ర ఇర‌కాటంలో పెడుతోంద‌నే అభిప్రాయం  పార్టీ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా ఐఏఎస్‌, ఐపిఎస్ అధికారులు ఇంకా ‘జ‌గ‌న్’ పార్టీ నాయ‌కులకు స‌హ‌క‌రిస్తూ, కూట‌మి ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌తీస్తున్నారు.  ముఖ్య‌మంత్రి ‘చంద్ర‌బాబు’ను భ్ర‌మ‌ల్లో ముంచెత్తుతూ..ఆయ‌న మెప్పుకోసం ఆయ‌న‌ను మున‌గ‌చెట్టెక్కిస్తున్నారు. దీంతో..అంతా స‌రిగా ఉంద‌నే భావ‌నలో అధికార‌పార్టీ పెద్ద‌లు ఉన్నారు. అయితే..క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు అంత స‌రిగా లేవ‌నే సంగ‌తి ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి గుర్తించిన‌ట్లు చెబుతున్నారు.


ఏడాది క్రితం బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం అధికార వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు చేస్తోంద‌నే అభిప్రాయా లు వ్య‌క్తం అయ్యాయి. అయితే..ఉన్న అధికారుల‌తోనే ప‌నిచేయించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ‘చంద్ర‌బాబు’ గ‌తంలో ఉన్న అధికారుల‌ను తొల‌గించ‌కుండా కొన‌సాగిస్తున్నారు. దీంతో వీరు రెచ్చిపోయి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు. అంతేనా.. అధికార‌పార్టీకి కాకుండా ఇంకా ‘జ‌గ‌న్’ మ‌నుషుల‌కే ప‌నులు ప‌నులు చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ముఖ్య‌మంత్రి ‘చంద్ర‌బాబునాయుడు’ త్వ‌ర‌లో అధికార వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు చేయ‌బోతున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల‌ను భారీగా బ‌దిలీ చేయ‌బోతున్నారు. అయితే ఈ బ‌దిలీలు మ‌హానాడు త‌రువాత ఉంటాయ‌ని కొంద‌రు చెబుతుండ‌గా మ‌రి కొంద‌రు కూట‌మి వార్షికోత్స‌వం పూర్త‌యిన త‌రువాత ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే ఎవ‌రెవ‌రినీ బ‌దిలీ చేస్తార‌నే దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. పాల‌న‌కు కీల‌క‌మైన ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కొన్ని బ‌దిలీలు ఉంటాయ‌ని చెబుతున్నారు. సిఎంఓలో నలుగురు అధికారులు ఉండ‌గా ఇక్క‌డ ఉన్న ఇద్ద‌రు యువ ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. దీనిలో ఒక‌రు వైకాపాకు స‌హ‌క‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.  దీన్ని ముఖ్య‌మంత్రి సీరియ‌స్‌గా తీసుకున్నారంటున్నారు. కీల‌క‌మైన పంచాయితీరాజ్‌, విద్యాశాఖ‌, జ‌ల‌వ‌న‌రుల‌శాఖ‌, బీసీ వెల్ఫేర్‌,ఫైనాన్స్‌, మున్సిప‌ల్‌, దేవాదాయ‌, గ‌నుల‌శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌ను బ‌దిలీ చేస్తారంటున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో కూడా భారీ మార్పులు చేస్తార‌నే ప్ర‌చారం ఉంది. కొంద‌రు యువ ఐఏఎస్‌ల‌కు ప్ర‌మోష‌న్ ఇస్తార‌నే చ‌ర్చా ఉంది. కీల‌క‌మైన గుంటూరు, కృష్ణా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తారంటున్నారు. ప‌లు జిల్లాల ఎస్పీల‌ను మార్చ‌నున్నారు. వీరితో పాటు కొన్నిశాఖ‌ల హెచ్ఓడీల‌ను బ‌దిలీ చేస్తారు.

 

‘అతిబాబు సిఎంఓకు వ‌స్తార‌ట‌...?

‘చంద్ర‌బాబునాయుడు’కు ఉన్న‌వీ లేనివీ చెప్పి ఆయ‌న‌ను మాయ‌చేస్తోన్న ఓ ఐఏఎస్ తాను సిఎంఓకు వ‌స్తాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. త‌న‌కు ముఖ్య‌మంత్రి ‘చంద్ర‌బాబునాయుడు’ ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, త‌న‌ను సిఎంఓలోకి తీసుకుంటార‌ని ఆయ‌న అడిగిన వారికి అడ‌గ‌నివారికి చెబుతున్నార‌ట‌. 2014-19 మ‌ధ్య ‘చంద్ర‌బాబు’ ప్ర‌భుత్వం బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తోంద‌ని, అన్ని శాఖ‌ల్లో వందశాతం సంతృప్తి ఉంద‌ని ‘చంద్ర‌బాబు’ను మున‌గ‌చెట్టు ఎక్కించిన ఈ ఐఏఎస్ ఇప్పుడు కూడా అదే విధంగా ఆయ‌న‌ను మాయ‌చేస్తున్నార‌ట‌. ఆయ‌న మాయ మాట‌ల‌ను న‌మ్ముతోన్న ‘చంద్ర‌బాబు’ ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇస్తారో..?  లేదో చూడాలి. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వ‌ల్ల కేంద్ర వ‌ర్గాల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని, అయినా ఆయ‌న త‌న తీరు మార్చుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ