లేటెస్ట్

‘కమ్మజపం’తో కళ్లు మూసుకున్నారా...?

ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’పై కుల దాడికి దిగారో కానీ అప్పటి నుంచి ఆయనకు అన్ని విధాలుగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ‘స్థానిక’ ఎన్నికల‌ను తనకు తెలియకుండా వాయిదా వేశారని, తొలిసారి ప్రెస్‌మీట్‌ పెట్టి  నిమ్మ‌గ‌డ్డ ‘కమ్మ’ కాబట్టి అంటూ విమర్శులు చేశారో..అప్పటి నుంచి వరుసగా ఆయనకు తిప్పలు తప్పడం లేదు. ముందుగా ముఖ్యమంత్రి జగన్‌ ‘నిమ్మగడ్డ’పై ‘కమ్మ’ వ్యాఖ్యలు చేయడంతో మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర చోటామోటా నాయకులంతా..అదే దారిలో ఆయనను తిట్టిపోశారు. అసలు ఎందుకు ఆయనను తిడుతున్నారో తెలియనంతగా...తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. చివరకు అసెంబ్లీ స్పీకర్‌ కూడా తాను వాళ్లకంటే రెండాకులు ఎక్కువ చదివానంటూ...‘కమ్మ’ కరోనా అంటూ రెచ్చిపోయారు. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ సల‌హాదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ‘జగన్‌’ బాటలో నడిచి ఆయన అహాన్ని సంతృప్తి పరిచడానికి ప్రయత్నాలు చేశారు. ఇదే ఊపులో ‘సుప్రీంకోర్టు’కు వెళ్లి ‘నిమ్మగడ్డ’ చేసింది తప్పని నిరూపించాల‌నుకున్నారు. కానీ..అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. అప్పటికయినా...వెనక్కు తగ్గారా..అంటే లేదు..మరింతగా రెచ్చిపోయారు. ఇదే సమయంలో ‘నిమ్మగడ్డ’ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ విషయంలో అనవసర ఆవేశాల‌కు పోయి..పరువు తీసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆయన ఆ లేఖ రాయలేదని, ఆ లేఖ టిడిపి నేతలు రాసి వారికి కావాల్సిన మీడియాకు ఇచ్చి ప్రభుత్వ పరువు తీయాల‌ని ప్రయత్నించారని, వారిపై కేసులు పెడతామని బెదిరించారు. కొంత మంది ఎమ్మెల్యేలు..డీజీపీని కల‌సి వారిపై కేసులు పెట్టాల‌ని కోరారు. ఈ మొత్తం వ్యవహారంలో వైకాపా పెద్దలు కానీ, ఆ పార్టీ మంత్రులు కానీ, నాయకులు కానీ...ఎక్కడా..వ్యూహాత్మకంగా వ్యవహరించిన దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి మెప్పుకోసం...‘కమ్మ’జపం చేస్తూ...ప్రభుత్వ ప్రతిష్టను వారే దిగజార్చుకున్నారనే మాట రాజకీయ పరిశీకుల‌ నుంచి వినిపిస్తోంది. 

వాస్తవానికి స్థానిక ఎన్నికల‌ నామినేషన్ల సందర్భంగా వైకాపా నాయకులు తీవ్రమైన హింసకు దిగకుంటే..ఇప్పుడు ఈ కఠినమైన పరిస్థితి ఎదురయ్యేది కాదు. చరిత్రలో ఎన్నడూ లేని పరాభవం చవిచూసిన ప్రతిపక్షపార్టీ స్థానిక పోరుకు అంతంత మాత్రమే సన్నద్దమైంది. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి..ఎవరూ..ముందుకువచ్చే పరిస్థితి లేదు. గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీ తరుపున బరిలోకి దిగే వారు లేక..వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆర్థికంగా,రాజకీయంగా బల‌హీనపడిన టిడిపి నాయకులు..ప్రస్తుతం పోటీ ఇవ్వ‌లేని పరిస్థితిని వైకాపా సరిగా వినియోగించుకోలేదు. స్థానిక ఎన్నికల‌ నామినేషన్‌ సందర్భంగా హింసకు పాల్ప‌డ‌కుండా...ఎన్నికలు జరగనిచ్చి ఉంటే...దాదాపు 80శాతం ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వచ్చేవి. కానీ..అన్నీ తమకే కావాల‌ని, ఎన్నికల్లో ఓడిపోతే ఇంటికి పంపిస్తానని, ‘జగన్‌’ ఆవేశంగా చేసిన హెచ్చరికల‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. చివరకు ఎన్నికల‌ కమీషన్‌ చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించారు. ఎన్నికల‌ కమీషన్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత..అయినా ముఖ్యమంత్రి ఆవేశాల‌కు పోకుండా ‘నిమ్మగడ్డ’పై అనవసర విమర్శలు చేయకుండా ఉంటే...ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదని కొందరు పేర్కొంటున్నారు. ఆయన ఆవేశమే..ఆయనకు నష్టాన్ని చేకూర్చిందని వారు అంటున్నారు.

10 రోజు కళ్లు మూసుకుంటే...!?

స్థానిక ఎన్నికల‌ను ఎన్నిక కమీషనర్‌ వాయిదా వేసిన సందర్భంలో ఎన్నికల‌ కమీషనర్‌ పదిరోజు కళ్లు మూసుకుంటే...ఎన్నికలు అయిపోయేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నిజంగా ‘ఎన్నికల‌ కమీషనర్‌’ ‘కరోనా’ను పట్టించుకోకుండా ఎన్నికకు వెళితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో తల‌చుకుంటేనే భయం వేస్తోంది. ‘కరోనా’ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల‌ను యధావిధిగా..కొనసాగించి ఉంటే..రాష్ట్రంలో ‘ఇటలీ’ పరిస్థితి ఏర్పడి ఉండేది. ముందు చూపుతో ‘నిమ్మగడ్డ’ తీసుకున్న నిర్ణయం..కొంత వరకు మేలు చేసిందనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో నిన్నటి దాకా ..దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ‘కరోనా’ కేసులు బయటకు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎన్నికల‌ వాయిదా వేసిన ‘నిమ్మగడ్డ’పై దాడి చేయడం ద్వారా...తమకు ప్రజల‌ కంటే ఎన్నికలే ముఖ్యమని వైకాపా చాటిచెప్పినట్లు అయింది. మొత్తం మీద చూసుకుంటే...ముఖ్యమంత్రి ఆవేశం...ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

(466)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ