లేటెస్ట్

‘జగన్‌’ ప్రభుత్వానికి రెండు ఎదురుదెబ్బలు...!

అధికార వైకాపా ప్రభుత్వానికి సోమవారం నాడు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివిధ అంశాల‌పై ‘జగన్‌’ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల‌పై న్యాయస్థానాలు తలంటుపోస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు రాజధాని భూముల‌ను ఇళ్ల స్థలాలు లేని పేదల‌కు పంచే విషయంపై హైకోర్టు, ప్రభుత్వ కార్యాయాల‌కు రంగు వేయడంపై ‘సుప్రీంకోర్టు’ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాల‌ వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూముల‌ను వేరే ప్రాంతాల‌ వారికి ఎలా కేటాయిస్తారని రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో భూముల‌ను అక్కడి పేదల‌కు కేటాయించాల‌ని సీఆర్డీఏ చట్టంలో ఉందని, ఆ విధంగానే తాము వాటిని కేటాయించామన్న ప్రభుత్వ న్యాయవాది చెప్పగా రైతుల‌ తరుపున వాదనను వినిపించిన న్యాయవాది అలా కేటాయించలేదని, రాజధానిలోని భూముల‌ను దుగ్గిరాల‌, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించారని ఇది చట్ట విరుద్దమని వాదించారు. కాగా దుగ్గిరాల‌, మంగళగిరి, విజయవాడ సీఆర్డీఎ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరు పక్షాల‌ వాదనను విన్న న్యాయస్థానం దీనిపై స్టే విధించింది. 

కాగా పంచాయితీ భవనాల‌కు వైకాపా రంగులు వేశారని, ఇది చట్ట విరుద్దమని హైకోర్టులో కేసు దాఖలు కాగా దీనిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. పంచాయితీ భవనాల‌కు ఒక పార్టీ రంగు వేయడం సరికాదని తెలుపుతూ హైకోర్టు రంగుల‌ను తుడిచివేయాల‌ని తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుల‌ను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ‘హైకోర్టు’ ఇచ్చిన తీర్పునే ‘సుప్రీంకోర్టు’ సమర్థించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్ర భవనాల‌కు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా..? అని రాష్ట్ర ప్రభుత్వ  తరుపున వాదించిన న్యాయవాదిని ప్రశ్నిస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాల‌ని చెబుతూ ప్రభుత్వ పిటీషన్‌ను కొట్టేసింది. మొత్తం మీద...పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వైకాపా ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఎక్కడికక్కడ బ్రేక్‌లు వేస్తున్నాయి. అయితే న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం మాత్రం యధావిధిగా వివాదస్పద నిర్ణయాల‌ను తీసుకుంటూనే ఉంది. 

(950)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ