లేటెస్ట్

‘కరోనా’ కట్టడి ఘనత ఎవరిది..?

గ్రామ వాలంటీర్లదా...? ‘నిమ్మగడ్డ’దా...!?

తాము అధికారంలోకి వచ్చిన తరువాత నియమించిన వాంటీర్ల వ‌ల్ల‌ బ్రహ్మాండం బద్దలైపోతుందని, రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే ఒక్క రోజు నడవదన్నట్లుగా అధికార వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వాలంటీర్లు, సచివాల‌య వ్యవస్థ ఉండడం వల్లే...ఈ రోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందన్నట్లు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ ఎమ్మెల్యేలు వారికి లేనిపోని ఘనతల‌ను ఆపాదిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి 50 కుటుంబాల‌కు ఒక వాలంటీర్‌ను నియమిస్తూ..ఇక ఆ కుటుంబాల‌కు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల‌ సేవల‌ను వారే అందిస్తారని, ఇది చరిత్రలో లేని కార్యక్రమమని ఊదరగొట్టారు. దాదాపు 5ల‌క్ష మందిని ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నియమించారు. ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నో విమర్శలు ప్రత్యర్థుల‌ నుంచి వచ్చాయి. అయితే ఆ విమర్శల‌ను తేలిగ్గా కొట్టేస్తూ..ఇక రాష్ట్ర ప్రజల‌కు ఎటువంటి కష్టాలు వచ్చినా వారే తీరుస్తారన్నట్లు, తీరుస్తున్నట్లు ప్ర‌భుత్వ పెద్ద‌లు బిల్డ్‌ప్ ఇస్తున్నారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ వైరస్ వ‌ల్ల‌ ఒక రోజు కేంద్ర ప్రభుత్వం ‘జనతాకర్ఫ్యూ’ పాటించాల‌ని పిలుపు ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చంధంగా ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజలు స్వచ్చంధ సహకారంతో విజయవంతం అయింది. అయితే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి కొన్ని మీడియా వర్గాల‌తో నిర్వహించిన పత్రికా సమావేశంలో వాలంటీర్ల వల్లే ‘కరోనా’ రాష్ట్రంలో అదుపులో ఉందని, వారి సేలు అమోఘమని శ్లాఘించారు. ముఖ్యమంత్రి ‘జగన్‌’ వాలంటీర్లు లేకపోతే ‘కరోనా’ విజృంభించేదని, వారి వల్లే రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ వారికి ధన్యవాదాలు చెప్పారు. తాను నియమించిన వ్యవస్థ ఎలా పని చేస్తుందో చెప్పుకోవడానికి, తనకు తాను కితాఋ ఇచ్చుకోవడం తప్ప..వాలంటీర్ల వ‌ల్ల‌ ‘కరోనా’ కట్టడిలో ఉందనో, తక్కువ కేసులు నమోదయ్యాయనో..వారికి ఆ ఘనత ఆపాదించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు నిన్న మొన్నటి దాకా..రాష్ట్రంలో ‘కరోనా’నే లేదని, దాని గురించి స్థానిక ఎన్నికల‌ను వాయిదా వేయడం తగదని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, చివరకు స్పీకర్‌ కూడా రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ను నిందించారు. మరి లేని ‘కరోనా’ గురించి వాలంటీర్లు చేసిందేమిటి..? ఈ వారం రోజుల్లో ‘కరోనా’ను వారు ఎక్కడ కట్టడి చేశారు..? వాలంటీర్లు ఏమి చేస్తే ‘కరోనా’ కట్టడిలో ఉందో చెప్పాల్సింది. ఇంటింటికి తిరిగి..సర్వే నిర్వహించారని ప్రభుత్వ పెద్దలు చెబుతోన్న మాట శుద్ధ అబద్దం. వాలంటీర్ల కన్నా..రెవిన్యూ, పోలీసు, వైద్యాధికారులు విశేషంగా కృషి చేసి..విదేశాల‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించారు. దీనిలో వాలంటీర్లు చేసిందేమిటి..? వారు చేయని పనులు వారే చేశారని చెబుతూ బిల్డ్‌ప్‌లు ఇవ్వడం వ‌ల్ల‌ ఉపయోగం ఏమిటి..? ప్రభుత్వ పెద్దలు...ఈ రకంగా చెబుతుంటే ‘నగరి’ ఎమ్మెల్యే మరో విచిత్రమైన ట్వీట్‌ ఒకటి ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు వీధుల్లోకి వచ్చి ‘కరోనా’ వైరస్‌ను నిరోధించేందుకు ఫాగింగ్‌ చేస్తున్నట్లు ఎక్కడదో ఒక ఫోటో పెట్టి...ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. అదే విధంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వాంటీర్ల వల్లే ‘కరోనా’ కట్టడిలో ఉందని చెబుతూ వారికి లేని ఘనతను ఆపాదించుకుని..సంతృప్తి చెందుతున్నారు. 

‘నిమ్మగడ్డ’కు దండం పెట్టాలి...!

వాస్తవానికి రాష్ట్రంలో కాస్తాకూస్తో...‘కరోనా’ కట్టడిలో ఉందంటే అది ఎన్నికల‌ సంఘం కమీషనర్‌ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ చ‌లవే. ఎందుకంటే పది రోజుల‌ క్రితమే ఆయన ‘కరోనా’ ప్రభావాన్ని అంచనా వేయగలిగారు. ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని..కేంద్ర అధికారుల‌తో మాట్లాడి..‘స్థానిక’ ఎన్నికల‌ను వాయిదా వేశారు. ఆయన కనుక..తనకెందుకులే...ప్రభుత్వ ఇష్టం ప్రకారం ఎన్నికలు జరిపిస్తే..సరిపోతుందని భావిస్తే..ఈ రోజు ఎన్నికలు జరిగి ఉండేవి. ఈ పదిరోజుల‌ పాటు రాజకీయనాయకులు, పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎన్నికల‌ హడావుడిలో ఇళ్లు ఇళ్లూ కలియ తిరిగేవారు. దాదాపు 15 రోజుల‌ క్రితమే ‘కరోనా’ ప్రభావం రాష్ట్రంపై ఉంది. 12వేల‌ మంది దాకా విదేశాల్లో ఉంటున్న వారు..రాష్ట్రానికి వచ్చారని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది.వారి వ‌ల్ల‌ వైరస్‌ విస్తృతం అయిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైరస్‌ అనుమానిత కేసుల‌న్నీ అవే. విదేశాల‌ నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబాల‌కు, ఆ కుటుంబాల‌ను కలిసిన వారికి నేరుగా వైరస్‌ వ్యాపించేంది. ఎన్నికల‌ ప్రచారం సందర్భంగా, పోలింగ్‌ సందర్భంగా మరింతగా ఇది ప్రజల‌కు వ్యాపించేది. అదే కనుక జరిగి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని ఊహించలేం. ‘స్థానిక’ ఎన్నికల‌ను వాయిదా వేసి ‘నిమ్మగడ్డ’ ప్రజల‌కు ఎక్కడ లేని మేలు చేశారు. ‘కరోనా’ కట్టడి ఘనత ఎవరికైనా ఇవ్వాంటే అది ముందుగా ‘నిమ్మగడ్డ’కే ఇవ్వాలి. నిజంగా ‘నిమ్మగడ్డ’ దూరదృష్టే రాష్ట్ర ప్రజల‌కు కొంత వరకు వరంగా మారిందని చెప్పవచ్చు.

(443)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ